క్రికెట్‌లో రాజకీయ పెత్తనం ఆంధ్రకు ఆడలేను
ABN , Publish Date - Feb 27 , 2024 | 04:24 AM
ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ)లో రాజకీయ పెత్తనం మరోసారి రచ్చకెక్కింది. రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు క్వార్టర్‌ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించిన హనుమ విహారి ఏసీఏలో జరుగుతున్న...
ఏసీఏకు హనుమ విహారి గుడ్‌బై
ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్న క్రికెటర్
వాళ్లు చెప్పిన ఆటగాళ్లనే టోర్నీకి ఎంపిక చేయాలి.. వాళ్లు సూచించిన వారినే తుది జట్టులో ఆడించాలి.. లేదంటే పార్టీ నేతల నుంచి నేరుగా క్రికెట్ సంఘానికి ఫోన్లు రావడం.. వినకపోతే అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో ఒత్తిడి చేయించడం.. ఇదంతా ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ)లో కొన్నాళ్లుగా జరుగుతున్న వైసీపీ ‘రాజకీయ’ం.
ఇప్పుడీ రాజకీయ క్రీడకు అంతర్జాతీయస్థాయి ఆటగాడిని బలి చేశారు. సర్వశక్తులూ ఒడ్డి తన సారథ్యంలో ఆంధ్ర జట్టుకు మరపురాని విజయాలందించిన టీమిండియా టెస్టు ఆటగాడు గాదె హనుమ విహారిని ఘోరంగా అవమానించారు. రాజకీయ పార్టీ నేత కుమారుడి కోసం అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి తమ వికృతమైన ఆటను ప్రదర్శించారు. ఇదంతా స్వయంగా విహారీనే వెల్లడించాడు. ఏపీ క్రికెట్‌లో నేతల జోక్యం ఎక్కువైందని మనస్తాపం వ్యక్తం చేసిన విహారి.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన చోట ఉండలేననీ, జన్మలో ఆంధ్రకు ఆడేది లేదని సంచలన ప్రకటన చేశాడు. క్రీడా సంఘాలకు రాజకీయ చీడపడితే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు విహారి ఉదంతమే నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్/విశాఖపట్నం (స్పోర్ట్స్): ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ)లో రాజకీయ పెత్తనం మరోసారి రచ్చకెక్కింది. రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు క్వార్టర్‌ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించిన హనుమ విహారి ఏసీఏలో జరుగుతున్న రాజకీయాలను బహిర్గతం చేశాడు. ఈ ఏడాది రంజీ సీజన్ మధ్యలోనే తాను ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వెల్లడించాడు. రాజకీయ నేతల జోక్యంతోనే కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నానని సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టాడు. జట్టుకు సంబంధించిన విషయంలో ఓ రాజకీయ నేత కుమారుడైన ఆటగాడితో గొడవ జరిగినందుకు ఏసీఏ పెద్దలు తనపై వేటు వేశారని ఆరోపించాడు. ఇది తనను ఎంతో వేదనకు గురి చేసిందనీ, భవిష్యత్‌లో ఆంధ్ర జట్టుకు ఆడేదే లేదంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ‘ఈ రంజీ సీజన్‌లో జట్టు పరంగా మేమెంతో పోరాడాం. అయినా క్వార్టర్స్‌లో ఓడినందుకు బాధగా ఉంది. ఈ పోస్ట్ ద్వారా కొన్ని విషయాలను మీ ముందు పెడుతున్నా. రంజీల్లో బెంగాల్‌తో మ్యాచ్‌కు నేనే జట్టు కెప్టెన్‌గా ఉన్నా. ఆ సమయంలో జట్టులోని 17వ ఆటగాడిపై అరిచాను. దీంతో అతడు రాజకీయ నాయకుడైన తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. నాపై చర్యలు తీసుకోవాలని ఆ రాజకీయ నేత ఏసీఏపై ఒత్తిడి చేశాడు. నా తప్పు లేకున్నా, కెప్టెన్‌గా వైదొలగమని సూచించారు. జట్టు కోసం ఎంతగానో పోరాడి, గాయం వేధిస్తున్నా బ్యాటింగ్ చేసి, ఆంధ్రను ఐదుసార్లు నాకౌట్ దశకు తీసుకెళ్లి నా అంకితభావాన్ని చాటుకున్నా. భారత జట్టు తరఫున 16 టెస్టులు ఆడా. అయినా నాకంటే అతడే వాళ్లకు ముఖ్యుడయ్యాడు. అసోసియేషన్ తీరుతో ఎంతో వేదనకు గురయ్యా. నా ఆత్మగౌరవం దెబ్బతినేలా అవమానించారు. అందుకే భవిష్యత్‌లో ఆంధ్రకు ఆడరాదని నిర్ణయం తీసుకున్నా’ అని తన సుదీర్ఘమైన పోస్టులో విహారి ఆవేదన వ్యక్తం చేశాడు.
వైసీపీ నేత కుమారుడి వల్లే...
ఆంధ్ర రంజీ జట్టులో 17వ ఆటగాడిగా చేరిన చిత్తూరుకు చెందిన వైసీపీ నేత కే. నరసింహా చారి కుమారుడు పృధ్వీరాజ్ విషయంలో ఏర్పడిన స్వల్ప వివాదం విహారి జట్టు నుంచి వైదొలగడానికి కారణమైంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేటరైన నరసింహా చారి.. వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడని సమాచారం. ఇక.. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు హర్షిత్ రెడ్డి చిత్తూరు జిల్లా క్రికెట్ సంఘానికి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు. వాస్తవానికి పృధ్వీని రంజీ జట్టుకు ఎంపిక చేయడంలోనూ రాజకీయ నేతల ప్రమేయముందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, విహారి ఉదంతంపై ఈనెల 21న ఆంధ్రజ్యోతిలో ‘ఏసీఏలో మితిమీరుతున్న వైసీపీ పెత్తనం?’ అన్న శీర్షికతో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు.. గతనెల 5 నుంచి 8 వరకు విశాఖలో బెంగాల్‌తో జరిగిన రంజీ మ్యాచ్ సందర్భంగా ఈ వివాదం చోటు చేసుకుంది. టీ విరామ సమయంలో ఆ మ్యాచ్ కెప్టెన్ విహారి డ్రెస్సింగ్ రూమ్‌లో తోటి ఆటగాళ్లతో చర్చిస్తున్నాడు. నిబంధనల ప్రకారం జట్టులోని 15 మంది ఆటగాళ్లకు మాత్రమే డ్రెస్సి ంగ్ రూమ్‌లోకి ప్రవేశం ఉంటుంది. అయితే, 17వ ఆటగాడైన పృధ్వీ అక్కడ కనిపించడంతో మేనేజర్‌ను విహారి ప్రశ్నించాడు. ఈ విషయంలోనే విహారితో జరిగిన గొడవను అవమానంగా భావించిన పృధ్వీ...తన తండ్రికి ఫోన్ చేశాడు. సదరు నేత చిత్తూరు జిల్లా క్రికెట్ సంఘం నుంచి ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డికి ఫోన్ చేయించి తన కుమారుడిని అవమానించిన విహారిపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేశాడట. దీనిపై ఏసీఏ యాజమాన్యం కూడా తననే వివరణ అడగడంతో విహారి ఆవేదనకు గురయ్యాడు. ఆ తర్వాత రాజకీయ ఒత్తిడి ఎక్కువవడంతో కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. తర్వాతి మ్యాచ్‌లకు జట్టు పగ్గాలను రికీ భుయ్‌కు అప్పగించారు.
విహారికే ఆటగాళ్ల మద్దతు
అంతా విజయసాయి కనుసన్నల్లోనే..
రాష్ట్రంలో క్రీడాసంఘాలను ఇప్పటికే తన గుప్పిట్లో ఉంచుకున్నాడన్న ఆరోపణలున్న వైసీపీ ముఖ్య నేత విజయసాయి రెడ్డి కనుసన్నల్లోనే ఏసీఏ నడుస్తోందని సమాచారం. ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రా రెడ్డి విజయసాయికి సమీప బంధువు. లిక్కర్ స్కామ్‌లో అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్‌చంద్రా రెడ్డి ఏసీఏ పదవికి అనర్హుడయ్యే అవకాశం ఉన్నందున తన సోదరుడు రోహిత్ రెడ్డిని ఉపాధ్యక్షునిగా నియమించుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. విజయసాయికి రోహిత్ రెడ్డి అల్లుడు కావడం గమనార్హం. ఇలా, ఏసీఏలో తన బంధుగణాన్ని ఏర్పరచుకున్న విజయసాయి ఆంధ్ర క్రికెట్ వ్యవహారాల్లోనూ తలదూర్చుతున్నాడన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిధులు అధికంగా ఉండే క్రీడా సంఘాలను ఎంచుకొని వాటిని వైసీపీ నాయకులు కబ్జా చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. క్రీడల్లో వైసీపీ నేతల జోక్యంపై గత నవంబరులోనే ‘క్రీడలపైనా కక్ష..!’ అన్న పేరుతో ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే.
ఈ వివాదంలో ఆంధ్ర జట్టు ఆటగాళ్లంతా హనుమ విహారికే మద్దతుగా నిలుస్తున్నారు. విహారినే కెప్టెన్‌గా కొనసాగించాలంటూ జట్టు సభ్యులంతా కలిసి సంతకాలు చేసిన లేఖను ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ)కు అందించారు. సారథిగా విహారి ఉండడం జట్టుకు చాలా ముఖ్యమని ఆ లేఖలో ఆటగాళ్లు తెలిపారు. ఆటగాళ్లంతా విహారికే మద్దతిస్తున్నా, ఏసీఏ మాత్రం ఆ లేఖను పట్టించుకుంటున్నట్టు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ విహారిని మళ్లీ జట్టులోకి తీసుకునే ప్రసక్తే లేదని ఏసీఏ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.
ఇంతకుమించి ఏం పీకలేవు
విహారిపై పృథ్వీరాజ్ తీవ్ర వ్యాఖ్యలు
రాజకీయ నేత కుమారుడిపై అరిచినందుకే తనను కెప్టెన్సీ నుంచి తప్పించారంటూ విహారి చేసిన వ్యాఖ్యలపై సదరు నేత కుమారుడు, ఆటగాడు పృథ్వీరాజ్ స్పందించాడు. విహారి చెప్పిందంతా అబద్ధమని, అసభ్యకరంగా దూషించడాన్ని ఎవరూ అంగీకరించరనీ.. ఇంతకుమించి ఏం పీకలేవు అంటూ పృథ్వీరాజ్ తీవ్రవ్యాఖ్యలు చేశాడు. ‘ఆరోజు ఏం జరిగిందో జట్టులోని ప్రతి ఒక్కరికీ తెలుసు. చాంపియన్ అని చెప్పుకునే నీవు ఇంతకుమించి ఏం పీకలేవు. కావాల్సిన విధంగా సింపథీ గేమ్స్ ఆడుకో’ అని పృథ్వీరాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆరోపణలు అవాస్తవం: ఏసీఏ
విహారి ఆరోపణలను ఏసీఏ ఖండించింది. బెంగాల్‌తో మ్యాచ్ సందర్భంగా అందరి ముందూ విహారి తనను వ్యక్తిగతంగా దూషించినట్టు సదరు ఆటగాడు తమకు ఫిర్యాదు చేశాడని ఏసీఏ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలున్నందునే విహారిని కెప్టెన్సీ నుంచి తప్పించామని తెలిపింది.
ఏసీఏపై ఒత్తిడి తేలేదు
పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి
తిరుపతి (ఆంధ్రజ్యోతి): విహారిని కెప్టెన్‌గా తొలగించాలంటూ ఏసీఏపై తాను ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదని పృథ్వీరాజ్ తండ్రి, వైసీపీ కార్పొరేటర్ నరసింహాచారి అన్నారు. ‘రంజీ జట్టుకు ఎంపికైనా కూడా రెండున్నర నెలలుగా నా కుమారుడిని ఆడించడంలేదు. డ్రెస్సింగ్ రూమ్‌లోనూ పృధ్వీని మానసికంగా ఇబ్బంది పెట్టారు. విహారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు జట్టులో అస్సలు ఆడని నా కొడుకుపై అపవాదు వేయడం సరికాదు’ అని నరసింహా చారి వివరించారు.