Share News

Paris Olympics 2024: సెమీస్ చేరిన భారత హాకీ జట్టు.. అడుగు దూరంలో పతకం

ABN , Publish Date - Aug 04 , 2024 | 03:24 PM

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు పతకాన్ని ముద్దాడేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఉత్కంఠభరితంగా కొనసాగిన క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌ను మట్టి కరిపించి సెమీస్ చేరింది.

Paris Olympics 2024: సెమీస్ చేరిన భారత హాకీ జట్టు.. అడుగు దూరంలో పతకం

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు పతకాన్ని ముద్దాడేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగిన క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌పై సంచలనాత్మక విజయాన్ని సాధించి సెమీస్ చేరింది. మ్యాచ్ ఫుల్-టైమ్‌లో ఇరు జట్లు 1-1 సమంగా నిలవడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. దీంతో షూటౌట్‌లో 4-2 ఆధిక్యంతో భారత్ విజయకేతనం ఎగురవేసింది.


క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఇరు జట్లు నువ్వే నేనా అన్నట్టు ఆడాయి. ఆట రెండవ అర్ధ భాగంలో అమిత్ రోహిదాస్ రెడ్ కార్డ్‌కు గురవ్వడంతో భారత జట్టు 10 మంది ప్లేయర్లతో ఆడాల్సి వచ్చింది. ఒక ఆటగాడు తక్కువగా ఆడినప్పటికీ భారత ప్లేయర్లు ఏమాత్రం తగ్గలేదు. అద్భుతం ఆడి బ్రిటన్‌కు గట్టి పోటీ ఇచ్చారు. ఆట 22వ నిమిషంలో లభించిన పెనాల్టీని భారత జట్టు చక్కగా సద్వినియోగం చేసుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ బంతిని పోస్ట్‌లో పంపించి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించాడు.


ఇక ఆట మూడవ భాగంలో గోల్ సాధించేందుకు బ్రిటన్ ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించారు. దూకుడిని ప్రదర్శించాడు. బంతి ఎక్కువ సమయం వారి ఆధీనంలోనే ఉంది. కానీ భారత దిగ్గజ ఆటగాడు పీఆర్‌ శ్రీజేష్‌ ప్రత్యర్థి ఆటగాళ్ల ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టాడు. గోల్‌ పోస్టు ముందు అడ్డుగోడలా నిలబడి అదరగొట్టాడు. అయితే ఆట కొన్ని నిమిషాల్లో ముగుస్తుందన్న సమయంలో బ్రిటన్ ఆటగాడు మోర్టన్ గ్రేట్ గోల్ సాధించాడు. దీంతో ఇరు జట్ల స్కోర్లు 1-1తో సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది.

Updated Date - Aug 04 , 2024 | 03:46 PM