Tennis Player Sumit Nagal : సుమిత్ జిగేల్
ABN , Publish Date - Jan 17 , 2024 | 03:38 AM
భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం సృష్టించాడు. క్వాలిఫయర్‌గా మెయిన్ డ్రాకు అర్హత సాధించిన 26 ఏళ్ల నగల్ తనకంటే ఎన్నో రెట్లు మెరుగైన, ప్రపంచ 27వ ర్యాంకర్ అలెగ్జాండర్
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలన ప్రదర్శన
తొలిరౌండ్లో 27వ ర్యాంకర్
అలెగ్జాండర్‌కు షాక్
గ్రాండ్‌స్లామ్‌లో సీడెడ్‌పై గెలిచిన రెండో భారత ఆటగాడిగా రికార్డు
మెల్‌బోర్న్: భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం సృష్టించాడు. క్వాలిఫయర్‌గా మెయిన్ డ్రాకు అర్హత సాధించిన 26 ఏళ్ల నగల్ తనకంటే ఎన్నో రెట్లు మెరుగైన, ప్రపంచ 27వ ర్యాంకర్ అలెగ్జాండర్ బబ్లిక్ (కజకిస్థాన్)కు షాకిచ్చాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఆరంభ రౌండ్లో 137వ ర్యాంకరైన సుమిత్ 6-4, 6-2, 7-6(5)తో 31వ సీడ్ అలెగ్జాండర్‌ను వరుససెట్లలో చిత్తుచేసి కెరీర్‌లో తొలిసారి మెల్‌బోర్న్ పార్క్‌లో రెండోరౌండ్ చేరాడు. ఈ క్రమంలో 35 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాలో సీడెడ్ ఆటగాడిని ఓడించిన తొలి భారత క్రీడాకారునిగా సుమిత్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు.. 1989 ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండోరౌండ్లో భారత్ తరఫున రమేశ్ కృష్ణన్ నాటి డిఫెండింగ్ చాంపియన్, నెంబర్‌వన్ మాట్స్ విలాండర్ (స్వీడన్)ను ఓడించాడు.
ఆరంభంలో అలవోకగా..: 2 గంటల 37 నిమిషాలపాటు సాగిన పోరులో నగల్ అద్భుత ఆటను ప్రదర్శించాడు. ఆరంభంలోనే ఒకరి సర్వీ్‌సలను ఒకరు బ్రేక్ చేసుకొని 1-1తో సమంగా నిలిచినా.. ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు గెలిచిన నగల్ 4-1తో ముందంజ వేశాడు. అయితే, క్రమంగా పుంజుకొన్న బబ్లిక్ 4-5తో సమం చేసే ప్రయత్నం చేసినా.. 10వ గేమ్‌లో సర్వీ్‌సను నిలబెట్టుకొన్న సుమిత్ 6-4తో ఆ సెట్ నెగ్గాడు. రెండో సెట్‌లో రెండుసార్లు ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్ చేసిన నగల్ 6-2తో సులువుగా దక్కించుకొన్నాడు. అయితే మూడో సెట్‌లో ఇద్దరూ 6-6తో సమంగా నిలవడంతో.. సెట్ ఫలితం టైబ్రేక్‌కు మళ్లింది. ఇందులో సుమిత్ 6-3తో మ్యాచ్ పాయింట్‌పై నిలిచినా.. పోరాడిన బబ్లిక్ 5-6తో సమం చేసే విధంగా కనిపించాడు. కానీ, 7-5తో నగల్ సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొన్నాడు. రెండో రౌండ్‌లో 140వ ర్యాంకర్ జుచెంగ్ షాంగ్ (చైనా)తో నగల్ తలపడనున్నాడు.
స్వియటెక్ కష్టపడి..
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్ అల్కరాజ్ 7-6(5), 6-1, 6-2తో రిచర్డ్ గాస్క్వెట్‌పై, ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 4-6, 6-3, 7-6(3), 6-3తో డొమినిక్ కోఫర్‌పై, 11వ సీడ్ కాస్పర్ రూడ్ 6-1, 6-3, 6-1 అల్బర్ట్ రమోస్‌పై గెలిచి రెండోరౌండ్లో ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్ ఇగా స్వియటెక్ 7-6(2), 6-2తో మాజీ చాంపియన్ సోఫియా కెనిన్‌ను, రిబకినా 7-6(6), 6-4తో ప్లిస్కోవాను, 5వ సీడ్ జెస్సికా పెగుల 6-2, 6-4తో రెబెక్కాను, కొలిన్స్ 6-2, 3-6, 6-1తో కెర్బర్‌ను, అజరెంకా 6-1, 4-6, 6-3తో కమిల గోర్జిని ఓడించి రెండో రౌండ్‌కు చేరుకొన్నారు. పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు యుకీ భాంబ్రి-రాబిన్ హస్సేన్ (నెదర్లాండ్స్) జంట 6-1, 6-7(8), 6-7(7)తో రఫెల్ మటో్‌స-నికోలస్ చేతిలో ఓడింది.
ఐటా వైల్డ్‌కార్డ్ నిరాకరించినా..
హరియాణాలోని జజ్జార్‌కు చెందిన సుమిత్ ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు చాలా కష్టపడ్డాడు. డేవిస్‌కప్‌లో ఆడేందుకు విముఖత చూపాడన్న కారణంతో సుమిత్‌ను రీజనల్ వైల్‌కార్డ్‌తో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడించేందుకు అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఐటా) నిరాకరించింది. వాస్తవానికి భారత్ నుంచి సింగిల్స్‌లో అత్యుత్తమ ర్యాంక్ ప్రకారం ఎంపిక చేయాలనుకుంటే సుమిత్‌నే మెల్‌బోర్న్ పంపాలి. కానీ, డేవిస్‌కప్‌కు దూరమై నిబంధనలు ఉల్లంఘించాడన్న కారణంతో అతడి ఎంట్రీని ఐటా పంపలేదు. దీంతో క్వాలిఫయింగ్ రౌండ్లలో సత్తాచాటిన సుమిత్ ఆస్ట్రేలి యన్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. ఇప్పుడు ఏకంగా తొలిరౌండ్లో సంచలన ప్రదర్శనతో తన సత్తా చాటాడు. సుమిత్ చివరిగా 2021లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడినా, అప్పుడు తొలిరౌండ్లోనే ఓడాడు. 2019లో యూఎస్ ఓపెన్‌తో గ్రాండ్‌స్లామ్ అరంగేట్రం చేసిన సుమిత్.. ఆనాడు స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌తో తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 6-4, 1-6, 2-6, 4-6తో ఫెడెక్స్ చేతిలో ఓడినా.. ఒక సెట్ నెగ్గడం పెద్ద సంచలనమే అయింది. 2020 యూఎస్ ఓపెన్‌లో బ్రాడ్లీ కల్హన్ (అమెరికా)పై గెలిచిన నగల్.. సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ (2013లో) తర్వాత గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో మ్యాచ్ నెగ్గిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.