Share News

Afghan team : స్ఫూర్తిదాయకం.. వీరి ప్రయాణం

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:28 AM

బాంబుల మోతలు.. విధ్వంసాలు.. అణచివేతలు.. వినాశనాలు.. ఆంక్షలు.. అఫ్ఘానిస్థాన్‌ అంటే ఎక్కువగా గుర్తుకు వచ్చేది ఇవే. అలాంటి పరిస్థితుల నుంచి ప్రపంచమే నివ్వెరపోయేలా.. క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించే స్థాయికి ఎదిగింది అఫ్ఘాన్‌ జట్టు.

 Afghan team : స్ఫూర్తిదాయకం.. వీరి ప్రయాణం

బాంబుల మోతలు.. విధ్వంసాలు.. అణచివేతలు.. వినాశనాలు.. ఆంక్షలు.. అఫ్ఘానిస్థాన్‌ అంటే ఎక్కువగా గుర్తుకు వచ్చేది ఇవే. అలాంటి పరిస్థితుల నుంచి ప్రపంచమే నివ్వెరపోయేలా.. క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించే స్థాయికి ఎదిగింది అఫ్ఘాన్‌ జట్టు. పరిస్థితులకు ఎదురీది.. పవర్‌ఫుల్‌గా మారింది.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

శరణార్థి శిబిరాల నుంచి..: గత దశాబ్ద కాలంలో క్రికెట్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందిన జట్టు అఫ్ఘాన్‌. పాకిస్థాన్‌ శరణార్థి శిబిరాల్లో పరిచయమైన క్రికెట్‌.. ఇప్పుడు వారికంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆటపై మక్కువ పెంచుకొన్న అఫ్ఘాన్‌లు.. తమతోపాటు క్రికెట్‌నూ తీసుకెళ్లారు. జట్టులో ఎక్కువ మంది 2001లో అమెరికా సేనల ప్రవేశానికి అటూఇటూగా పుట్టినవారే. వారిలో 25 ఏళ్ల కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌.. అఫ్ఘాన్‌ క్రికెట్‌ ముఖచిత్రంగా మారాడు. తన స్పిన్‌ మాయాజాలంతో ఫ్రాంచైజీ క్రికెట్‌లో స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకొన్నాడు.

అంతా ఒక కథలా..: 2021లో పాలన మళ్లీ తాలిబన్ల చేతిలోకి వెళ్లడం.. ఆటకు పెద్ద దెబ్బగా భావించారు. అయితే, జట్టు ఆడుతున్న తీరు, ఆటగాళ్ల నిబద్ధతను చూసిన పాలకులు కఠిన వైఖరి వీడడం ఒకరకంగా అఫ్ఘాన్‌ క్రికెట్‌ వేగంగా ఎదిగేందుకు దోహదం చేసింది. ‘అఫ్ఘాన్‌ రిపబ్లిక్‌’ జెండా కింద ఆడేందుకు కూడా అభ్యంతరం చెప్పలేదు. 2015లో తొలిసారి వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించిన అఫ్ఘాన్‌.. క్రమంగా రాటుదేలింది. గతేడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ లాంటి జట్లను ఓడించి ఔరా అనిపించింది. ఇప్పుడు పొట్టిక్‌పలో న్యూజిలాండ్‌కు షాకిచ్చిన రషీద్‌ సేన.. ఏకంగా కంగారూల కథనే ముగించింది.

అండగా బీసీసీఐ..: అఫ్ఘాన్‌ క్రికెట్‌ పురోభివృద్ధిలో బీసీసీఐ పాత్ర ఎనలేనిది. అసోసియేట్‌ సభ్యదేశం హోదా రావడానికి కృషి చేసిన బోర్డు.. ఆర్థిక సాయంతోపాటు భారత్‌లో సకల సౌకర్యాలున్న స్టేడియాల్లో శిక్షణ, మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతించింది. లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌, మనోజ్‌ ప్రభాకర్‌ లాంటి టీమిండియా మాజీలు అప్ఘాన్‌ కోచ్‌లుగా పనిచేశారు. 2014లో భారత ప్రభుత్వం కాందహార్‌లో స్టేడియం నిర్మాణానికి నిధులు కూడా అందించింది. ఐపీఎల్‌లో రషీద్‌, నూర్‌ అహ్మద్‌, రహ్మనుల్లా గుర్బాజ్‌, నవీనుల్‌ హక్‌లకు ఆడే అవకాశం కల్పించడం వారి కెరీర్‌లకు మలుపు. పొట్టిక్‌పలో అఫ్ఘాన్‌ సెమీస్‌ చేరడంతో.. భారత్‌కు తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్‌ షహీన్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.

అంతా రషీద్‌ చుట్టూనే..: అఫ్ఘాన్‌ టీమ్‌ విజయాలు మొత్తం రషీద్‌ చుట్టూనే అల్లుకొన్నాయనడంలో సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌లు ఆడుతున్న రషీద్‌.. ఇప్పుడు అఫ్ఘాన్‌ యూత్‌ ఐకాన్‌. కెప్టెన్‌గా జట్టులో అనుక్షణం స్ఫూర్తిని నింపుతూ అద్భుతాలు సాధిస్తున్నాడు. అఫ్ఘాన్‌ క్రికెట్‌ స్వర్ణ యుగానికి ప్రతినిధిగా నిలుస్తున్నాడు.

అతని నమ్మకాన్ని నిలబెట్టాం

మేం సెమీస్‌ చేరగలమని నమ్మిన ఒకేఒక్క వ్యక్తి బ్రియాన్‌ లారా. టోర్నీకి ముందు కలిసినప్పుడు.. మీ నమ్మకాన్ని మేం వమ్ము చేయం అని అతనితో చెప్పాం. ఇప్పుడదే నిజమైంది. దిగ్గజ ఆటగాళ్ల నుంచి అలాంటి గొప్ప మాటలు రావడం మాకెంతో శక్తినిస్తుంది. ఇప్పుడు మీ ముందు ఇలా గర్వంగా నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఈ ప్రదర్శన అఫ్ఘానిస్థాన్‌లో యువతకు స్ఫూర్తినిస్తుందనుకుంటున్నా.

- కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌

Updated Date - Jun 26 , 2024 | 06:06 AM