IPL Mumbai Indians : ఓటమితో సరి
ABN , Publish Date - May 18 , 2024 | 06:12 AM
సొంతగడ్డపై ఓ విజయంతో తాజా సీజన్‌కు ముగింపు పలకాలని భావించిన ముంబై ఇండియన్స్‌కు నిరాశే మిగిలింది. కీలక సమయాల్లో బౌలర్లు, బ్యాటర్లు మూకుమ్మడిగా విఫలమయ్యారు.
ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ ముంబైకి నిరాశే
లఖ్‌నవూ ఘనవిజయం
చెలరేగిన పూరన్
రోహిత్ పోరాటం వృధా
ముంబై: సొంతగడ్డపై ఓ విజయంతో తాజా సీజన్‌కు ముగింపు పలకాలని భావించిన ముంబై ఇండియన్స్‌కు నిరాశే మిగిలింది. కీలక సమయాల్లో బౌలర్లు, బ్యాటర్లు మూకుమ్మడిగా విఫలమయ్యారు. దీంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 18 పరుగులతో ఘనవిజయం సాధించింది. నికోలస్ పూరన్ (29 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 75) మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు ఆ జట్టు బౌలర్లు గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈ ఓటమితో ముంబై 8 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అటు 14 పాయింట్లు సాధించిన లఖ్‌నవూ కూడా ఇంటికెళ్లినట్టే. ముందుగా లఖ్‌నవూ 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. రాహుల్ (41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 55) అర్ధసెంచరీ సాధించాడు. తుషార, చావ్లాలకు మూడేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసి ఓడింది. రోహిత్ (38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 68), నమన్ ధిర్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 నాటౌట్) వేగంగా ఆడారు. బిష్ణోయ్, నవీన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా పూరన్ నిలిచాడు.
శుభారంభం దక్కినా..: భారీ ఛేదనలో ముంబైకి లభించిన మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓపెనర్ రోహిత్ భారీ షాట్లతో లఖ్‌నవూ బౌలర్లను ఆడుకున్నాడు. కానీ పవర్‌ప్లే ముగిశాక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ముంబై తడబడింది. చివర్లో నమన్ ధిర్ ఎదురుదాడి సరిపోలేదు. రెండో ఓవర్‌లోనే రోహిత్ రెండు సిక్సర్లతో జోరు చూపాడు. అయితే నాలుగో ఓవర్‌లో కురిసిన వర్షం గంటపాటు అంతరాయం కలిగించింది. ఆ తర్వాత కూడా రోహిత్ వరుస ఫోర్లతో చెలరేగడంతో పవర్‌ప్లేలో జట్టు 53 పరుగులు సాధించింది. ఇక ఏడో ఓవర్‌లో 4,4,6తో 14 రన్స్ సాధించడమే కాకుండా 28 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేశాడు. అటు బ్రెవిస్ (23) తొమ్మిదో ఓవర్‌లో 4,6తో వేగం అందుకుంటున్న క్రమంలోనే నవీనుల్ హక్‌కు చిక్కాడు. దీంతో తొలి వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అక్కడి నుంచి వరుస ఓవర్లలో సూర్యకుమార్ (0), రోహిత్‌లను క్రునాల్, బిష్ణోయ్ అవుట్ చేశారు. కెప్టెన్ హార్దిక్ (16) 4,6తో ఆకట్టుకున్నా త్వరగానే నిష్క్రమించాడు. ఈ దశలో ఇషాన్, నమన్ జాగ్రత్తగా ఆడడంతో స్కోరు నెమ్మదించింది. అయితే 17వ ఓవర్‌లో నమన్ 4,6తో వేగం పెంచాడు. అలాగే 19వ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లతో ఆశలు రేపాడు. కానీ ఆఖరి ఓవర్‌లో 34 పరుగులు కావాల్సి ఉండడంతో ముంబై చేసేదేమీ లేకపోయింది. తొలి బంతికి సిక్సర్ బాదిన నమన్ 25 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేశాడు. అయితే రెండో బంతికి సిక్సర్ రాకుండా క్రునాల్ అద్భుత ఫీల్డింగ్‌తో అడ్డుకోగా, మూడో బంతికి ఇషాన్ అవుటవడంతో లఖ్‌నవూ సంబరాల్లో మునిగింది.
పూరన్ ధనాధన్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ ఇన్నింగ్స్ ఆరంభంలో నత్తనడకన సాగింది. కానీ నికోలస్ పూరన్ ధనాధన్ ఆటతీరుతో మధ్య ఓవర్లలో స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. దీంతో 150 కూడా కష్టమే అనుకున్న చోట జట్టు 200 దాటగలిగింది. తొలి ఓవర్‌లోనే దేవ్‌దత్ డకౌట్ కాగా.. ఓపెనర్ రాహుల్ ఆచితూచి ఆడాడు. అటు స్టొయినిస్ (28) మాత్రం ఉన్న కాసేపు వేగం కనబర్చుతూ నాలుగో ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగాడు. ఇక రాహుల్ ఆరో ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లతో జోరు చూపినా, స్టొయినిస్ అవుటయ్యాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 49/2తో నిలిచింది. కాసేపటికే దీపక్ హుడా (11)ను స్పిన్నర్ పియూష్ చావ్లా అవుట్ చేశాడు. అటు రాహుల్ బంతికో పరుగు చొప్పున ఆడడంతో పది ఓవర్లలో స్కోరు 69/3గానే ఉంది. కానీ 13వ ఓవర్ నుంచి పూరన్ బాదుడు మొదలైౖంది. ఆ ఓవర్‌లో అతను 4,4,6,6తో ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. హార్దిక్ ఓవర్‌లోనూ రెండు సిక్సర్లు బాదిన పూరన్.. 15వ ఓవర్‌లో వరుసగా 6,6,6,4తో 19 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అటు రాహుల్ సిక్సర్‌తో జట్టు 29 పరుగులు రాబట్టింది. తర్వాతి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన రాహుల్ 37 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఈ సమయంలో జట్టు 220+ రన్స్ సాధిస్తుందనిపించింది. కానీ 178 స్కోరు వద్దే పేసర్ తుషార.. పూరన్, అర్షద్ (0)ల వికెట్లను తీయగా, రాహుల్‌ను పియూష్ చావ్లా అవుట్ చేశాడు. కానీ ఆఖరి ఓవర్‌లో బదోని (22 నాటౌట్) 6,6,4తో స్కోరు 200 దాటింది.
స్కోరుబోర్డు
లఖ్‌నవూ: రాహుల్ (సి) తుషార (బి) చావ్లా 55, దేవ్‌దత్ పడిక్కళ్ (ఎల్బీ) తుషార 0, స్టొయినిస్ (ఎల్బీ) చావ్లా 28, దీపక్ హుడా (సి) వధేరా (బి) చావ్లా 11, పూరన్ (సి) సూర్య (బి) తుషార 75, అర్షద్ (సి) వధేరా (బి) తుషార 0, బదోని (నాటౌట్) 22, క్రునాల్ (నాటౌట్) 12, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 214/6; వికెట్ల పతనం: 1-1, 2-49, 3-69, 4-178, 5-178, 6-178; బౌలింగ్: తుషార 4-0-28-3, అర్జున్ టెండూల్కర్ 2.2-0-22-0, అన్షుల్ 3-0-48-0, పీయూష్ చావ్లా 4-0-29-3, వధేరా 2-0-13-0, హార్దిక్ 2-0-27-0, నమన్ ధిర్ 0.4-0-17-0, షెపర్డ్ 2-0-30-0.
ముంబై: రోహిత్ (సి) మొహిసిన్ (బి) బిష్ణోయ్ 68, బ్రేవిస్ (సి) క్రునాల్ (బి) నవీనుల్ 23, సూర్యకుమార్ (సి) బిష్ణోయ్ (బి) క్రునాల్ 0, ఇషాన్ (బి) నవీనుల్ 14, హార్దిక్ (సి) నవీనుల్ (బి) మొహిసిన్ 16, నేహల్ వధేరా (సి) క్రునాల్ (బి) బిష్ణోయ్ 1, నమన్ ధిర్ (నాటౌట్) 62, షెపర్డ్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 196/6; వికెట్ల పతనం: 1-88, 2-89, 3-97, 4-116, 5-120, 6-188; బౌలింగ్: అర్షద్ 2-0-11-0, హెన్రీ 2-0-24-0, క్రునాల్ 4-0-29-1, మొహిసిన్ 4-0-45-1, నవీనుల్ 4-0-50-2, రవి బిష్ణోయ్ 4-0-37-2.