Share News

ధర దద్దరిల్లింది

ABN , Publish Date - Nov 25 , 2024 | 02:42 AM

ఐపీఎల్‌ వేలం ఎప్పుడు జరిగినా ఆయా ఫ్రాంచైజీలు ఎక్కువగా విదేశీ ఆటగాళ్లపై దృష్టి సారిస్తుంటాయి. కానీ ఈసారి మెగా వేలంలో మాత్రం భారత ఆటగాళ్లపై కనకవర్షం కురిపించాయి. ఆదివారం తొలిరోజు వేలంలో వీరు కనీవినీ ఎరుగని రేటు పలికారు...

ధర  దద్దరిల్లింది

ఐపీఎల్‌ తొలిరోజు వేలం

రూ.27 కోట్లతో పంత్‌ రికార్డు

లీగ్‌ చరిత్రలోనే అత్యధిక రేటు

అనుకున్నదే జరిగింది. విధ్వంసకర బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ ధాటికి ఐపీఎల్‌ బాక్సులు బద్దలయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌ మెగా వేలానికి వదిలేసినప్పుడే అతడికి పలికే ధరపై అంతా ఊహించారు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పంత్‌ రేటు పైపైకి ఎగబాకుతూ ఏకంగా రూ.27 కోట్ల దగ్గర ఆగింది. అంతే.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డుపుటలకెక్కాడు. రైట్‌ టు మ్యాచ్‌ ద్వారా అతడిపై డీసీ కన్నేసినా.. లఖ్‌నవూ మాత్రం పట్టు వదల్లేదు. అంతకుముందు పంజాబ్‌ సైతం దూకుడుగా వెళ్లి శ్రేయాస్‌ను రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. అయితే అంచనాలకు భిన్నంగా కేఎల్‌ రాహుల్‌ కేవలం రూ.14 కోట్లకే ఢిల్లీ సొంతమవడం గమనార్హం. ఇక వెంకటేశ్‌ అయ్యర్‌ను అతడి పాత జట్టు కేకేఆర్‌ రూ.23.75 కోట్ల భారీ మొత్తానికి చేజిక్కించుకోవడం ఆశ్చర్యపరిచింది.


శ్రేయాస్‌కు రూ.26.75 కోట్లు

వెంకటేశ్‌కు రూ.23.75 కోట్లు

భారత ఆటగాళ్లకే ప్రాధాన్యం

జెద్దా: ఐపీఎల్‌ వేలం ఎప్పుడు జరిగినా ఆయా ఫ్రాంచైజీలు ఎక్కువగా విదేశీ ఆటగాళ్లపై దృష్టి సారిస్తుంటాయి. కానీ ఈసారి మెగా వేలంలో మాత్రం భారత ఆటగాళ్లపై కనకవర్షం కురిపించాయి. ఆదివారం తొలిరోజు వేలంలో వీరు కనీవినీ ఎరుగని రేటు పలికారు. రిషభ్‌ పంత్‌ను లఖ్‌నవూ రూ.27 కోట్లతో, శ్రేయాస్‌ అయ్యర్‌ను ఢిల్లీ రూ.26.75 కోట్లతో కొనుగోలు చేశాయి. ఐపీఎల్‌ చరిత్రలో ఈ ఇద్దరివే టాప్‌-2 రికార్డు ధరలు కావడం విశేషం. దీంతో గతేడాది ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ (రూ.24.75 కోట్లు) అత్యధిక ధర బద్దలయ్యింది. ఈసారి స్టార్క్‌ను ఢిల్లీ రూ.11.75 కోట్లకే దక్కించుకోవడం గమనార్హం. తొలిరోజు మొత్తంగా 72 మంది ఆటగాళ్లు అమ్ముడవగా.. వీరికోసం ఫ్రాంచైజీలు రూ. 467.95 కోట్లు వెచ్చించాయి. సోమవారంతో వేలం ముగుస్తుంది.

20-Sp.jpg


ఈ ఇద్దరి కోసం హోరాహోరీ

వేలంలో ఐదో ఆటగాడిగా రిషభ్‌ పంత్‌ పేరు చెప్పగానే ఆడిటోరియంలోని ప్రేక్షకులు చప్పట్లతో స్వాగతం పలికారు. అటు వేలం కూడా అత్యంత ఆసక్తికరంగా సాగింది. మొదట పంత్‌ కోసం లఖ్‌నవూతో పోటీపడిన ఆర్‌సీబీ రూ.12 కోట్ల దగ్గర వెనక్కి తగ్గింది. ఈ దశలో సన్‌రైజర్స్‌ ప్రవేశించి రేటును రూ.20 కోట్లు దాటించింది. చివరకు రూ.20.75 కోట్ల దగ్గర వెనక్కి తగ్గడంతో.. ఢిల్లీ తమ పాత కెప్టెన్‌ కోసం ఆర్‌టీఎం ఉపయోగించింది. కానీ లఖ్‌నవూ మాత్రం పట్టు వదలకుండా రేటును ఒకేసారి రూ.27 కోట్లకు పెంచడంతో డీసీ షాకయ్యింది. దీంతో ఐపీఎల్‌ రికార్డు ధరతో పంత్‌ లఖ్‌నవూ కెప్టెన్‌గా మారబోతున్నాడు. అయితే పంత్‌ ధర ఊహించిందే అయినా.. శ్రేయాస్‌ అయ్యర్‌ మాత్రం జాక్‌పాట్‌ దక్కించుకున్నట్టే. వేలంలో అతడి పేరు పంత్‌కన్నా ముందే రావడం కూడా కలిసివచ్చింది. ఈ ఇద్దరిలో ఒకరిని దక్కించుకోవాలని పంజాబ్‌ కింగ్స్‌ ముందే భావించినట్టుంది. అందుకే శ్రేయాస్‌ కోసం పట్టుదల చూపింది. మొదట కేకేఆర్‌ కూడా తమ పాత కెప్టెన్‌ కోసం ఆసక్తి చూపింది. ఆ తర్వాత డీసీ రేసులోకి రావడంతో తొలిసారి రూ.20 కోట్ల మార్క్‌ను దాటిన భారత ఆటగాడయ్యాడు. ఆ జట్టు కూడా కెప్టెన్‌ కోసం చూస్తుండడంతో రేటు వేగంగా పెరిగింది. చివరకు రూ.26.75 కోట్లతో పంజాబ్‌ ఖాతాలో చేరాడు.


ప్చ్‌.. రాహుల్‌

గత సీజన్‌లో లఖ్‌నవూ కెప్టెన్‌గా ఉన్న కేఎల్‌ రాహుల్‌ వేలంలో సులువుగా రూ.20 కోట్ల మార్క్‌ దాటుతాడని భావించారు. కానీ ఫ్రాంచైజీలు అతడిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఫామ్‌ కోల్పోడం ప్రభావం చూపిందేమో. ఆర్‌సీబీ, చెన్నై ఆరంభంలో బిడ్‌ వేసినా రూ.14 కోట్లకే ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుని సంబరపడింది. వచ్చే సీజన్‌లో అతడినే తమ కెప్టెన్‌గా ప్రకటించే అవకాశం ఉంది.

50-Sp.jpg

వావ్‌.. వెంకటేశ్‌

గత సీజన్‌లో కోల్‌కతాకు ఆడిన ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌కు మాత్రం ఎవరూ ఊహించని ధర పలికింది. అతడిని రిటైన్‌ చేసుకోకుండా వేలానికి వదిలిన కోల్‌కతానే తిరిగి అతడిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే కసి చూపింది. అందుకే వేలంలో ఆర్‌సీబీతో దూకుడుగా పోటీ పడింది. చూస్తుండగానే రేటు రూ.20 కోట్ల మార్క్‌ను దాటేసింది. చివరకు కేకేఆర్‌ రూ.23.75 కోట్లతో అతడిపై కనకవర్షమే కురిపించింది.


స్వదేశీ ఆటగాళ్లే ముద్దు

తొలిసారిగా ఐపీఎల్‌ వేలంలో భారత ఆటగాళ్లు మెరిశారు. ముఖ్యంగా పేసర్లపై ఆయా జట్లు ఎక్కువగా దృష్టి సారించాయి. ఈ వేలం మొదట పేసర్‌ అర్ష్‌దీ్‌ప సింగ్‌తో ఆరంభం కాగా రూ.2 కోట్ల కనీస ధర ఉన్న అతడిని తీసుకునేందుకు సగంజట్లు పోటీపడ్డాయి. చివర్లో సన్‌రైజర్స్‌ ఎంట్రీతో రేటు రూ.15.75 దగ్గర ఆగింది. ఈ దశలో పంజాబ్‌ కింగ్స్‌ ఆర్‌టీఎం ఉపయోగించగా.. రైజర్స్‌ ధరను రూ.18 కోట్లకు పెంచింది. దీనికి కూడా పంజాబ్‌ అంగీకరించడంతో అర్ష్‌దీప్‌ తన పాత జట్టులోనే చేరాడు. ఇక స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌కు అధిక ధరే పలికింది. గుజరాత్‌, చెన్నెన, లఖ్‌నవూ, సన్‌రైజర్స్‌ అతడికోసం ప్రయత్నించాయి. చివరకు రూ.18 కోట్ల దగ్గర రైజర్స్‌ వైదొలగగా.. పంజాబ్‌ వశమయ్యాడు. అలాగే బెంగళూరుతో చాలాకాలం కొనసాగిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ రూ.12.25 కోట్లకు తీసుకుంది. వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమి (రూ.10 కోట్లు), కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ (రూ.11.25 కోట్లు) ఈసారి సన్‌రైజర్స్‌ తరఫున ఆడనున్నారు. బ్యాటర్‌ జితేశ్‌ శర్మ (రూ.11 కోట్లు) బెంగళూరు మారాడు. పేసర్లు నటరాజన్‌ (రూ.10.75 కోట్లు)ను ఢిల్లీ, అవేశ్‌ (రూ.9.75 కోట్లు)ను లఖ్‌నవూ, ప్రసిద్ధ్‌ (రూ.9.50 కోట్లు)ను టైటాన్స్‌ తీసుకోగా, స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌ (రూ.9.75 కోట్లు) తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి ‘సొంత’ జట్టు చెన్నైకి ఆడబోతున్నాడు.


30-Sp.jpg

వేలంలో టాప్‌-5 ప్లేయర్లు

రిషభ్‌ పంత్‌ లఖ్‌నవూ రూ.27 కోట్లు

శ్రేయాస్‌ అయ్యర్‌ పంజాబ్‌ రూ.26.75 కోట్లు

వెంకటేశ్‌ అయ్యర్‌ కోల్‌కతా రూ.23.75 కోట్లు

అర్ష్‌దీప్‌ సింగ్‌ పంజాబ్‌ రూ.18 కోట్లు

యజ్వేంద్ర చాహల్‌ పంజాబ్‌ రూ.18 కోట్లు

విదేశీ ఆటగాళ్లలో..

ఈసారి వేలంలో విదేశీ ఆటగాళ్లపై ఆయా ఫ్రాంచైజీలు జాగరూకతతో వ్యవహరిం చాయి. గుజరాత్‌ టైటాన్స్‌ జోస్‌ బట్లర్‌ (రూ.15.75 కోట్లు)పై పెట్టినదే అత్యధిక ధర కావడం గమనార్హం. ఆ తర్వాత పేసర్లు ట్రెంట్‌ బౌల్ట్‌ (ముంబై, రూ.12.50 కోట్లు), చివరి నిమిషంలో వేలంలోకి వచ్చిన జోఫ్రా ఆర్చర్‌ (రాజస్థాన్‌, రూ.12.50 కోట్లు), హాజెల్‌వుడ్‌ (ఆర్‌సీబీ, రూ.12.50 కోట్లు) నిలిచారు. ఫిల్‌ సాల్ట్‌ (ఆర్‌సీబీ, రూ.11.50 కోట్లు), స్టొయినిస్‌ (పంజాబ్‌, రూ.11 కోట్లు), రబాడ (టైటాన్స్‌, రూ.10.75 కోట్లు), నూర్‌ అహ్మద్‌ (సీఎస్‌కే, రూ.10 కోట్లు) మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరారు.


40-Sp.jpg

రసిక్‌ పంట పండింది

అన్‌క్యాప్‌డ్‌ క్రికెటర్లలో రసిక్‌ దార్‌ సలామ్‌కు అత్యధిక ధర పలికింది. రూ.30 లక్షల కనీస ధర కలిగిన అతడిని బెంగళూరు రూ.6 కోట్లకు తీసుకుంది. అయితే రసిక్‌ను ఆర్‌సీబీ రూ.2 కోట్లకే తీసుకోగా, ఢిల్లీ జట్టు ఆర్‌టీఎంను ఉపయోగించింది. దీంతో ఆర్‌సీబీ ఒక్కసారిగా రేటును రూ.6 కోట్లకు పెంచి సొంతం చేసుకుంది. నమన్‌ ధిర్‌ను కూడా ముంబై ఇండియన్స్‌ ఆర్‌టీఎం ద్వారా రూ.5.25 కోట్లకు తీసుకుంది. అబ్దుల్‌ సమద్‌ (లఖ్‌నవూ), నేహల్‌ వధేరా (పంజాబ్‌) రూ.4.20 కోట్ల చొప్పున, అభినవ్‌ మనోహర్‌ (సన్‌రైజర్స్‌) రూ.3.20 కోట్లు, రఘువంశీ (కోల్‌కతా) రూ.3 కోట్లకు అమ్ముడయ్యారు. గత మినీ వేలంలో రూ.8.40 కోట్ల ధర పలికిన సమీర్‌ రిజ్వీని ఈసారి రూ.95 లక్షలకే ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది.


వీరికి నిరాశే..

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌పై ఎవరూ ఆసక్తి చూపలేదు. రూ.2 కోట్ల కనీసధర కలిగిన దేవ్‌దత్‌ పడిక్కళ్‌, బెయిర్‌స్టోకు సైతం నిరాశే ఎదురైంది. అలాగే అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ యష్‌ ధుల్‌, అన్‌మోల్‌ప్రీత్‌, సీనియర్‌ పీయూష్‌ చావ్లా కూడా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలారు.

Updated Date - Nov 25 , 2024 | 02:58 AM