Share News

కంగారెత్తిస్తారా!

ABN , Publish Date - Nov 22 , 2024 | 04:54 AM

సొంత గడ్డపై కివీస్‌ చేతిలో వైట్‌వాష్‌.. అటు చూస్తే జట్టులో కీలక ఆటగాళ్ల గాయాల బెడద.. దీనికి తోడు స్టార్‌ బ్యాటర్ల ఫామ్‌ లేమి. ఇన్ని సవాళ్ల మధ్య భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై సుదీర్ఘ టెస్టు సిరీస్‌ ఆడబోతోంది. అయితే చివరి రెండు...

కంగారెత్తిస్తారా!

నితీశ్‌ కుమార్‌ అరంగేట్రం

ప్రతీకారం కోసం ఆస్ట్రేలియా

నేటి నుంచి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ

తొలి టెస్టు-ఉదయం 7.50 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

సొంత గడ్డపై కివీస్‌ చేతిలో వైట్‌వాష్‌.. అటు చూస్తే జట్టులో కీలక ఆటగాళ్ల గాయాల బెడద.. దీనికి తోడు స్టార్‌ బ్యాటర్ల ఫామ్‌ లేమి. ఇన్ని సవాళ్ల మధ్య భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై సుదీర్ఘ టెస్టు సిరీస్‌ ఆడబోతోంది. అయితే చివరి రెండు పర్యాయాలు ఇక్కడి ప్రతికూలతలను అధిగమిస్తూ టీమిండియా జయ కేతనం ఎగురవేయగలిగింది. కానీ ఈసారి అలాంటి అద్భుతాన్నే సాధించగలదా? అంటే కచ్చితంగా అవునూ.. అని చెప్పలేని పరిస్థితి. ఆత్మవిశ్వాసం అడుగంటిన భారత జట్టు అటు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ బెర్త్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని ఆడాల్సి ఉంది. మరోవైపు భారత్‌ బలహీనతలను సొమ్ము చేసుకుంటూ ఈసారి ఎలాగైనా సిరీ్‌సను ఖాతాలో వేసుకోవాలని ఆతిథ్య ఆస్ట్రేలియా ఎదురుచూస్తోంది.


పెర్త్‌: క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీకి వేళయ్యింది. భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య నేటి నుంచే ఐదు టెస్టుల సిరీస్‌ ఆరంభం కానుంది. దీంట్లో భాగంగా పెర్త్‌లోని ఓప్టస్‌ స్టేడియంలో తొలి టెస్టు జరుగబోతోంది. 2018-19, 2020-21లలో ఇక్కడ జరిగిన నాలుగు టెస్టుల సిరీ్‌సలను టీమిండియా గెలుచుకోవడం విశేషం. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో పేసర్‌ బుమ్రా ఆధ్వర్యంలో భారత జట్టు పెర్త్‌ మ్యాచ్‌లో ఆడనుంది. హ్యాట్రిక్‌ సిరీ్‌సను అందుకోవడంపై భారత జట్టుకు ప్రస్తుతం ఆలోచన లేకున్నా మొదట తొలి టెస్టును ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. అదే జరిగితే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అటు భారత్‌ చేతిలో వరుసగా రెండు టెస్టు సిరీ్‌సలను కోల్పోయిన ఆసీస్‌ ఆ ఓటములకు చెక్‌ పెట్టాలనుకుంటోంది. ఈసారి కాస్త బలహీనంగా కనిపిస్తున్న ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చూపాలనే ఆత్రుతలో ఉంది. డబ్ల్యూటీసీ పాయింట్లలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఆసీస్‌, భారత్‌లకు ఈ సిరీస్‌ కీలకం కానుంది. అలాగే ఫైనల్‌ బెర్త్‌ ఆశిస్తున్న ఇతర జట్లు కూడా సిరీ్‌సను ఆసక్తిగా గమనిస్తుంటాయి.


5-Sp.jpg

విరాట్‌పై ఒత్తిడి

రోహిత్‌, గిల్‌ అందుబాటులో లేకపోవడంతో తొలి టెస్టు బరిలో నిలిచే భారత జట్టుపై ఆసక్తి నెలకొంది. ఓపెనర్‌ జైస్వాల్‌ ఆసీ్‌సలో పర్యటించడం ఇదే మొదటిసారి. అతడికి జతగా రాహుల్‌ ఆడడం ఖాయమే. ఇక ఇటీవల ఆసీస్‌ ‘ఎ’పై రాణించిన దేవ్‌దత్‌ పడిక్కళ్‌ను వన్‌డౌన్‌లో ఆడించే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ అరంగేట్రం చేయవచ్చని సమాచారం. కోచ్‌ గంభీర్‌ అతడిని నాలుగో పేసర్‌గా వినియోగించుకోవాలనుకుంటున్నాడు. అలాగే ఇటీవల ఫామ్‌ కోల్పోయిన పేసర్‌ సిరాజ్‌కు ఆసీ్‌సలో చక్కటి రికార్డే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అతడిని కొనసాగిస్తారా? లేక పక్కనబెడతారా? వేచి చూడాల్సిందే. సిరాజ్‌ లేదా ఆకాశ్‌ స్థానంలో మరో పేసర్‌ హర్షిత్‌ రాణాను తీసుకునే అవకాశం లేకపోలేదు. అశ్విన్‌ ఏకైక స్పిన్నర్‌గా ఆడడం ఖాయమే. ఇక బ్యాటింగ్‌లో విరాట్‌ ఎలా ఆడనున్నాడన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. కివీస్‌తో సిరీ్‌సలో అతడి సగటు కేవలం 15.50 మాత్రమే. కానీ పెర్త్‌లో మాత్రం నాలుగు ఇన్నింగ్స్‌లో ఓ సెంచరీ, హాఫ్‌ సెంచరీతో విరాట్‌కు మెరుగైన రికార్డే ఉంది. అందుకే ప్రస్తుత వైఫల్యాన్ని అధిగమిస్తూ మరోసారి ఇక్కడ చెలరేగాలని ప్రతీ అభిమాని కోరుకుంటున్నాడు.


ఆధిపత్యం కోసం..

ఎనిమిది నెలల తర్వాత టెస్టు ఫార్మాట్‌లో ఆడనున్న ఆసీస్‌ జట్టు ఈసారి ఎలాగైనా భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. అంతేకాకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలంటే తమకు మిగిలిన ఏడు టెస్టుల్లో ఐదు గెలవాలి. అందుకే స్వదేశంలో వీలైనన్ని విజయాలు సాధిస్తే ఎలాంటి ఒత్తిడీ ఉండదనే ఆలోచనలో ఉంది. వార్నర్‌ వీడ్కోలు తర్వాత ఓపెనర్‌ సమస్య వెంటాడుతోంది. స్మిత్‌ను పరీక్షించినా విఫలమయ్యాడు. అందుకే ఖవాజాకు జతగా ఈసారి మెక్‌స్వీనేతో అరంగేట్రం చేయించనున్నారు. మిగతా బ్యాటర్లకు అపార అనుభవం ఉండడంతో భారత జట్టులోని యువ బౌలర్లపై ఒత్తిడి పెరగనుంది. పేసర్లు స్టార్క్‌, కమిన్స్‌, హాజెల్‌వుడ్‌లతో పాటు స్పిన్నర్‌ లియోన్‌ ప్రత్యర్థి బ్యాటర్లకు సవాల్‌ విసరనున్నాడు.

తుది జట్లు (అంచనా)

భారత్‌: జైస్వాల్‌, రాహుల్‌, పడిక్కళ్‌, విరాట్‌, పంత్‌, జురెల్‌, నితీశ్‌, అశ్విన్‌, బుమ్రా (కెప్టెన్‌), హర్షిత్‌/ప్రసిద్ధ్‌, సిరాజ్‌/ఆకాశ్‌.

ఆసీస్‌: ఖవాజా, మెక్‌స్వీనే, లబుషేన్‌, స్మిత్‌, హెడ్‌, మిచెల్‌ మార్ష్‌, క్యారీ, ప్యాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), స్టార్క్‌, లియోన్‌, హాజెల్‌వుడ్‌.


పిచ్‌, వాతావరణం

ఇక్కడి పిచ్‌పై చక్కటి బౌన్స్‌ లభిస్తుందని ఇప్పటికే క్యూరేటర్‌ తెలిపాడు. దీంతో పేసర్లు లాభపడనుండగా, బ్యాటర్లకు కష్టాలు తప్పవు. శుక్రవారం ఉద యం వర్షం కురిసే అవకాశం ఉంది. ఓప్టస్‌ మైదానంలో సెకండ్‌ బ్యాటింగ్‌ చేసిన జట్టు గెలిచిన దాఖలాలు లేవు. అయితే వాతావరణ పరిస్థితులను బట్టి టాస్‌ నెగ్గిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.

రెండు రోజుల్లో పెర్త్‌కు రోహిత్‌

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈనెల 24న భారత జట్టులో చేరనున్నాడు. భార్య రెండో ప్రసవంతో స్వదేశంలోనే ఉండిపోయిన రోహిత్‌ తొలి టెస్టుకు దూరమయ్యాడు. వచ్చే నెల 6 నుంచి జరిగే అడిలైడ్‌ టెస్టుకు ముందు జట్టుతో కలుస్తాడని భావించారు. కానీ తాజా టెస్టు జరుగుతున్న సమయంలోనే ఆసీ్‌సకు వెళ్లాలని నిర్ణయించుకున్న తను 23న ముంబై నుంచి బయలుదేరనున్నాడు.

కెప్టెన్సీ ఓ బాధ్యత: బుమ్రా

జట్టుకు కెప్టెన్సీ వహించడాన్ని ఓ పదవిలా కాకుండా బాధ్యతగా తీసుకుంటానని పేసర్‌ బుమ్రా తెలిపాడు. ‘కెప్టెన్సీ ఓ గౌరవం. నాకంటూ సొంత శైలి ఉంది. పేసర్లు జట్టు కెప్టెన్‌గా ఉండాలని నేనెప్పుడూ చెబుతుంటాను. ఎందుకంటే మైదానంలో వారి వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. ఇక కివీస్‌తో వైట్‌వాష్‌ ప్రభావం ఇక్కడ ఏమాత్రం ఉండదు. గెలిచినా, ఓడినా మరో సిరీస్‌ను మొదటి నుంచే ఆరంభించాల్సి ఉంటుంది. భారత్‌లోని పరిస్థితులను ఇక్కడితో పోల్చలేం. మా తుది జట్టుపై ఇప్పటికే స్పష్టతతో ఉన్నాం’ అని బుమ్రా చెప్పాడు.


4-Sp.jpg

గంభీర్‌.. ప్రశాంతంగా ఉండు: రవిశాస్త్రి

ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు కోచ్‌ గంభీర్‌ ప్రశాంతంగా ఉండాలని మాజీ కోచ్‌ రవిశాస్త్రి సూచించాడు. కివీ్‌సతో 0-3 ఓటమితో గంభీర్‌పై ఒత్తిడి నెలకొన్న విషయం తెలిసిందే. ‘బయటి విషయాల్ని ఏవిధంగానూ ప్రభావితం చేయనివ్వద్దు. దేశంలోని వి విధ ప్రాంతాల నుంచి, అనేక సంస్కృతుల నుంచి జట్టులోకి వచ్చిన ఆటగాళ్లను సరిగా అర్థం చేసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు’ అని గంభీర్‌కు రవిశాస్త్రి హితవు పలికాడు.

నితీశ్‌ రాణిస్తాడు..: కమిన్స్‌

యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌పై ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు ప్రతిభావంతుడైన కుర్రాడని, ఆసీస్‌ గడ్డపై బంతిని స్వింగ్‌ చేయగలడని చెప్పాడు. ఐపీఎల్‌లో నితీశ్‌తో ఆడడాన్ని ఆస్వాదించినట్టు ఆ జట్టు కెప్టెన్‌ కూడా అయిన కమిన్స్‌ తెలిపాడు. అయితే ఆ టోర్నీలో అతడికి పెద్దగా బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదని గుర్తు చేశాడు.

Updated Date - Nov 22 , 2024 | 04:54 AM