శతక్కొట్టిన మంధాన
ABN , Publish Date - Oct 30 , 2024 | 04:42 AM
వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న డాషింగ్ బ్యాటర్ స్మృతి మంధాన (122 బంతుల్లో 10 ఫోర్లతో 100)తోపాటు హర్మన్‌ప్రీత్ కౌర్ (59 నాటౌట్) విజృంభించడంతో....
అదరగొట్టిన హర్మన్
మూడో వన్డేలో కివీస్‌పై విజయం
2-1తో భారత మహిళలదే సిరీస్
అహ్మదాబాద్: వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న డాషింగ్ బ్యాటర్ స్మృతి మంధాన (122 బంతుల్లో 10 ఫోర్లతో 100)తోపాటు హర్మన్‌ప్రీత్ కౌర్ (59 నాటౌట్) విజృంభించడంతో.. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సను భారత మహిళల జట్టు 2-1తో సొంతం చేసుకొంది. మంగళవారం జరిగిన సిరీస్ నిర్ణాయక ఆఖరి, మూడో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో కివీ్‌సను ఓడించింది. 233 పరుగుల లక్ష్యాన్ని భారత్ 44.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ షఫాలీ వర్మ (12)ను హనా రో (2/47) స్వల్ప స్కోరుకే అవుట్ చేయడంతో.. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మంధాన జట్టు బాధ్యతలను భుజాన వేసుకొంది. వన్‌డౌన్ బ్యాటర్ యాస్తిక భాటియా (35) చక్కని సహకారం అందించింది. అయితే, యాస్తికను డివైన్ రిటర్న్ క్యాచ్‌తో వెనక్కిపంపడంతో.. రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో కలసి మంధాన దూకుడుగా ఆడుతూ మూడో వికెట్‌కు 118 పరుగులు జోడించడంతో జట్టు విజయం దిశగా దూసుకెళ్లింది. సెంచరీ పూర్తి చేసుకొన్న మంధానాను రో బౌల్డ్ చేసినా.. తుదికంటా క్రీజులో నిలిచిన హర్మన్ మరో 34 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించేసింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. బ్రూక్ హాలిడే (86) అర్ధ శతకంతో పోరాడింది. దీప్తి శర్మ 3 వికెట్లు, ప్రియా మిశ్రా 2 వికెట్లు పడగొట్టారు. ఫీల్డ్‌లో అప్రమత్తంగా వ్యవహరించిన జెమీమా రెండు రనౌట్లు చేయడం విశేషం. సుజీ బేట్స్ (4), లారెన్ డౌన్ (1), కెప్టెన్ సోఫీ డివైన్ (9), జార్జియా ప్లిమ్మర్ (39), మ్యాడీ గ్రీన్ (15) పెవిలియన్‌కు క్యూ కట్టడంతో కివీస్ 88/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఇసబెల్ (25)తో కలసి ఆరో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టిన బ్రూక్.. రో (11)తో కలసి ఏడో వికెట్‌కు 47 పరుగులతో టీమ్ స్కోరును రెండు వందల పరుగుల వద్దకు చేర్చింది. బ్రూక్‌ను దీప్తి క్యాచవుట్ చేసినా.. ఆఖర్లో తహుహు (24 నాటౌట్) ధాటిగా ఆడడంతో జట్టు మెరుగైన స్కోరు చేసింది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 49.5 ఓవర్లలో 232 ఆలౌట్ (బ్రూక్ 86, ప్లిమ్మర్ 39; దీప్తి శర్మ 3/39, ప్రియ 2/41).
భారత్: 44.2 ఓవర్లలో 236/4 (మంధాన 100, హర్మన్ 59 నాటౌట్; రో 2/47).
8
వన్డేల్లో అత్యధికంగా 8 సెంచరీలు సాధించిన భారత మహిళా బ్యాటర్‌గా మంధాన. మిథాలీ 7 శతకాల రికార్డును స్మృతి అధిగమించింది.