Share News

మయాంక్‌ మలుపు తిప్పాడు

ABN , Publish Date - Mar 31 , 2024 | 02:09 AM

రెండు వందల పరుగుల భారీ ఛేదన.. ఓపెనర్లు శిఖర్‌ ధవన్‌ (50 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70), బెయిర్‌స్టో (29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42)ల బాదుడుకు 11 ఓవర్లలోనే పంజాబ్‌ కింగ్స్‌ స్కోరు వంద పరుగులకు చేరింది. ఈ దశలో గెలుపు...

మయాంక్‌ మలుపు తిప్పాడు

నిప్పులు చెరిగిన యువ పేసర్‌

నేటి మ్యాచ్‌లు

గుజరాత్‌ X హైదరాబాద్‌, మ.3.30 గం. నుంచి

ఢిల్లీ X చెన్నై, రాత్రి 7.30 గం. నుంచి

  • లఖ్‌నవూ బోణీ

  • పంజాబ్‌ చిత్తు

  • ధవన్‌ పోరాటం వృధా

లఖ్‌నవూ: రెండు వందల పరుగుల భారీ ఛేదన.. ఓపెనర్లు శిఖర్‌ ధవన్‌ (50 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70), బెయిర్‌స్టో (29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42)ల బాదుడుకు 11 ఓవర్లలోనే పంజాబ్‌ కింగ్స్‌ స్కోరు వంద పరుగులకు చేరింది. ఈ దశలో గెలుపు ఖాయమనిపించినా.. యువ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ (4-0-27-3) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అత్యంత వేగంతో బంతులు విసిరిన అతను వరుస ఓవర్లలో కీలక వికెట్లు తీసి కింగ్స్‌కు ఝలకిచ్చాడు. ఫలితంగా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ 21 రన్స్‌తో బోణీ చేసింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులు చేసింది. డికాక్‌ (38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54), క్రునాల్‌ (22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43), పూరన్‌ (21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42) చెలరేగారు. ఛేదనలో పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 రన్స్‌ చేసి ఓడింది. మొహి సిన్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మయాంక్‌ యాదవ్‌ నిలిచాడు.

వేగంగా ఆరంభమై..: భారీ ఛేదనను పంజాబ్‌ ధాటిగా ఆరంభించినా.. తుది వరకు ఆ ఊపును కొనసాగించలేకపోయింది. మధ్య ఓవర్లలో అరంగేట్ర పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ వారి జోరుకు కళ్లెం వేశాడు. మొదట ఓపెనర్లు ధవన్‌, బెయిర్‌స్టో చెరో ఎండ్‌ నుంచి బౌలర్లను ఆడేసుకోవడంతో స్కోరు చకచకా పెరిగింది. తొలి వికెట్‌కు ఏకంగా 102 పరుగులు జత చేరాయి. రెండో ఓవర్‌లో జానీ రెండు ఫోర్లు, మూడో ఓవర్‌లో ధవన్‌ 4,4,6తో అదరగొట్టారు. ఇక ఆరో ఓవర్‌లోనూ తను 4,4,6తో 16 రన్స్‌ అందించాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 61 రన్స్‌ చేసింది. అటు క్రునాల్‌ ఓవర్‌లో బెయిర్‌స్టో 2 వరుస సిక్సర్లతో చెలరేగాడు. ఈ దెబ్బకు 11వ ఓవర్‌లోనే స్కోరు 101కి చేరింది. కానీ ఓపెనర్ల తుఫాన్‌ ఇన్నింగ్స్‌కు పేసర్‌ మయాంక్‌ బ్రేక్‌ వేస్తూ వరుస ఓవర్లలో బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్‌ (19), జితేశ్‌ శర్మ (6)లను అవుట్‌ చేశాడు. అటు పరుగులు కూడా తగ్గడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయింది. దీనికితోడు ఓపిగ్గా ఆడిన ధవన్‌తో పాటు సామ్‌ కర్రాన్‌ (0)లను 17వ ఓవర్‌లో మొహిసిన్‌ అవుట్‌ చేయడంతో పంజాబ్‌కు నిరాశే మిగిలింది. చివర్లో గాయంతోనే బరిలోకి దిగిన లివింగ్‌స్టోన్‌ (28 నాటౌట్‌) వేగంగా ఆడి ఓటమి తేడాను తగ్గించాడు.

ఆ ముగ్గురి దూకుడు: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ డికాక్‌ నిలకడగా ఆడగా, కెప్టెన్‌ పూరన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇక ఫినిషర్‌గా క్రునాల్‌ చెలరేగడంతో జట్టు భారీ స్కోరు అందుకుంది. పేసర్‌ సామ్‌ కర్రాన్‌ ఒక్కడే పొదుపైన బౌలింగ్‌తో కట్టడి చేశాడు. అటు మిగతా బ్యాటర్లు వేగంగా ఆడే క్రమంలో వికెట్లను కోల్పోయారు. మూడో ఓవర్‌లో డికాక్‌ 4,6 బాదగా.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన ఓపెనర్‌ రాహుల్‌ (15) తర్వాతి ఓవర్‌లోనే 6,4తో జోరు చూపాడు. అయితే అదే ఓవర్‌లో అర్ష్‌దీప్‌నకు దొరికిపోయాడు. ఇక వచ్చీ రాగానే దేవ్‌దత్‌ (9) రెండు వరుస ఫోర్లు బాది పెవిలియన్‌కు చేరాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 54/2 స్కోరుతో ఫర్వాలేదనిపించింది. స్టొయినిస్‌ (19) కూడా చాహర్‌ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లు సాధించి వెంటనే అవుటయ్యాడు. ఇక మధ్య ఓవర్లలో డికాక్‌కు కెప్టెన్‌ పూరన్‌ జత కలవడంతో స్కోరు దూసుకెళ్లింది. 12వ ఓవర్‌లో పూరన్‌ 6,4,6తో 20 పరుగులు సమకూరాయి. అటు డికాక్‌ ఓ ఫోర్‌తో 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. అయితే ఆ వెంటనే అతడిని అర్ష్‌దీప్‌ అవుట్‌ చేయగా.. పూరన్‌ అదే ఓవర్‌లో రెండు ఫోర్లతో దూకుడు కొనసాగించాడు. ప్రమాదకరంగా మారిన పూరన్‌ను 16వ ఓవర్‌లో రబాడ బౌల్డ్‌ చేయడంతో పంజాబ్‌ ఊపిరి పీల్చుకుంది. కానీ క్రునాల్‌ వారికి ఆ ఆనందం లేకుండా చేశాడు. 18వ ఓవర్‌లో 4,4,6తో 20 పరుగులు రాబట్టాడు. కర్రాన్‌ మాత్రం 19వ ఓవర్‌లో బదోని (8), బిష్ణోయ్‌ (0)ల వికెట్లను తీసి 9 పరుగులే ఇచ్చాడు. ఆఖరి ఓవర్‌లోనూ హర్షల్‌ 8 పరుగులే ఇవ్వడంతో స్కోరు 199 దగ్గరే ఆగిపోయింది.

స్కోరుబోర్డు

లఖ్‌నవూ: డికాక్‌ (సి) జితేశ్‌ (బి) అర్ష్‌దీప్‌ 54, రాహుల్‌ (సి) బెయిర్‌స్టో (బి) అర్ష్‌దీప్‌ 15, పడిక్కళ్‌ (సి) ధవన్‌ (బి) కర్రాన్‌ 9, స్టొయినిస్‌ (బి) చాహర్‌ 19, పూరన్‌ (బి) రబాడ 42, బదోని (సి) బెయిర్‌స్టో (బి) కర్రాన్‌ 8, క్రునాల్‌ (నాటౌట్‌) 43, బిష్ణోయ్‌ (సి/సబ్‌) త్యాగరాజన్‌ (బి) కర్రాన్‌ 0, మోహిసిన్‌ (రనౌట్‌) 2, నవీనుల్‌ హక్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 199/8; వికెట్ల పతనం: 1-35, 2-45, 3-78, 4-125, 5-146, 6-189, 7-189, 8-197; బౌలింగ్‌: కర్రాన్‌ 4-0-28-3, అర్ష్‌దీప్‌ 3-0-30-2, రబాడ 4-0-38-1, రాహుల్‌ 3-0-42-1, హర్‌ప్రీత్‌ 2-0-14-0, హర్షల్‌ 4-0-45-0.

పంజాబ్‌: ధవన్‌ (సి) డికాక్‌ (బి) మొహిసిన్‌ 70, బెయిర్‌స్టో (సి) స్టొయినిస్‌ (బి) మయాంక్‌ 42, ప్రభ్‌సిమ్రన్‌ (సి) నవీనుల్‌ (బి) మయాంక్‌ 19, జితేశ్‌ (సి) నవీనుల్‌ (బి) మయాంక్‌ 6, లివింగ్‌స్టోన్‌ (నాటౌట్‌) 28, కర్రాన్‌ (సి) పూరన్‌ (బి) మొహిసిన్‌ 0, శశాంక్‌ (నాటౌట్‌) 9, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 178/5; వికెట్ల పతనం: 1-102, 2-128, 3-139, 4-141, 5-141; బౌలింగ్‌: సిద్దార్థ్‌ 2-0-21-0, నవీనుల్‌ హక్‌ 4-0-43-0, మొహిసిన్‌ 4-0-34-2, క్రునాల్‌ 4-0-26-0, బిష్ణోయ్‌ 3-0-25-0, మయాంక్‌ యాదవ్‌ 4-0-27-3.

అబ్బో.. ఏమా వేగం!

21 ఏళ్ల యువ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. నిలకడగా గంటకు 150 కి.మీ వేగంతో బంతులు విసిరి ఔరా.. అనిపించాడు. అద్భుత పేస్‌, బౌన్స్‌తో పాటు లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు విసిరిన అతడు విజయం వైపు దూసుకెళుతున్న పంజాబ్‌కు ఓటమి రుచి చూపించాడు. వరుస ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఝలక్‌ ఇచ్చాడు. 12వ ఓవర్‌లోనైతే ఏకంగా 155కి.వేగాన్ని టచ్‌ చేయడంతో తాజా సీజన్‌లో అత్యంత వేగంగా బంతి విసిరిన బౌలర్‌గా నిలిచాడు. ఇదే రీతిన నిలకడగా బౌలింగ్‌ చేయగలిగితే అతి త్వరలోనే భారత జట్టులోనూ ఆడే అవకాశం ఉంది.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

చెన్నై 2 2 0 0 4 1.979

కోల్‌కతా 2 2 0 0 4 1.047

రాజస్థాన్‌ 2 2 0 0 4 0.800

హైదరాబాద్‌ 2 1 1 0 2 0.675

లఖ్‌నవూ 2 1 1 0 2 0.025

పంజాబ్‌ 3 1 2 0 2 -0.337

బెంగళూరు 3 1 2 0 2 -0.711

గుజరాత్‌ 2 1 1 0 2 -1.425

ఢిల్లీ 2 0 2 0 0 -0.528

ముంబై 2 0 2 0 0 -0.925

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

పరుగులు

ఇప్పటికి వీరే..

విరాట్‌ కోహ్లీ (బెంగళూరు) 181 పరుగులు

వికెట్లు

ముస్తాఫిజుర్‌ (చెన్నై) 6 వికెట్లు

Updated Date - Mar 31 , 2024 | 02:09 AM