ముంబై మురిసె..
ABN , Publish Date - Apr 12 , 2024 | 03:15 AM
సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ మరోసారి అదరగొట్టింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 69) అందించిన మెరుపు ఆరంభానికి..
వరుసగా రెండో గెలుపు
ఇషాన్, సూర్య మెరుపు అర్ధసెంచరీలు
చిత్తుగా ఓడిన బెంగళూరు
బుమ్రాకు ఐదు వికెట్లు (4-0-21-5)
సూర్యకుమార్ (19 బంతుల్లో 52)
ముంబై: సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ మరోసారి అదరగొట్టింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 69) అందించిన మెరుపు ఆరంభానికి.. ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ (19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 52) ఇచ్చిన ఫినిషింగ్ టచ్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు చేష్టలుడిగిపోయారు. బంతి ఎక్కడ పడినా బౌండరీకే అన్నట్టుగా వీరి ఆట సాగడంతో 197 పరుగుల ఛేదనను ముంబై 27 బంతులుండగానే ముగించింది. దీంతో 7 వికెట్ల తేడాతో గెలిచిన హార్దిక్ సేన నాలుగు పాయింట్లు సాధించింది. బౌలింగ్‌లో బుమ్రా (4-0-21-5) చెలరేగాడు. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. డుప్లెసి (40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61), దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 నాటౌట్), రజత్ పటీదార్ (26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50) అర్ధసెంచరీలు సాధించారు. ఛేదనలో ముంబై 15.3 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసి నెగ్గింది. రోహిత్ (38) ఫర్వాలేదనిపించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా బుమ్రా నిలిచాడు.
ఇషాన్, సూర్య బాదుడు: ఫ్లాట్ పిచ్‌పై 197 పరుగుల ఛేదనను ముంబై అలవోకగా పూర్తి చేసింది. ఆరంభంలో ఇషాన్ ధనాధన్ ఆటతీరు.. మధ్య ఓవర్లలో సూర్యకుమార్ మెరుపులతో వాంఖడే దద్దరిల్లింది. వీరి ధాటికి ఆర్‌సీబీ బౌలర్లు చేతులెత్తేయడంతో 15.3 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసింది. ఎడాపెడా భారీ షాట్లతో పవర్‌ప్లేలోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఇషాన్.. రోహిత్‌తో కలిసి తొలి వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఐదో ఓవర్‌లో ఇషాన్ 6,4,6.. రోహిత్ 6తో పేసర్ సిరాజ్ 23 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఆరో ఓవర్‌లోనూ ఇషాన్ 4,6,4తో 23 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. అప్పటికి రోహిత్ స్కోరు 15 మాత్రమే. కానీ ఈ దూకుడుకు పేసర్ ఆకాశ్ దీప్ తొమ్మిదో ఓవర్‌లో చెక్ పెడుతూ ఇషాన్ వికెట్ తీశాడు. అటు సూర్యకుమార్ రాకతో ఆర్‌సీబీ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. 11వ ఓవర్‌లో తను 24 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లో టోప్లే గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో పట్టిన సూపర్ క్యాచ్‌తో రోహిత్ వెనుదిరిగాడు. అయినా జోరు తగ్గించని సూర్య 13వ ఓవర్‌లో 4,6,4,4తో 17 బంతుల్లో ఐపీఎల్‌లో తన వేగవంతమైన ఫిఫ్టీని పూర్తి చేశాడు. మరుసటి ఓవర్‌లోనే వైశాక్ అతడి వికెట్ తీసినా ముంబై అప్పటికే విజయం అంచుల వరకు వచ్చింది. హార్దిక్ (21 నాటౌట్), తిలక్ (16 నాటౌట్) కూడా వేగం చూపడంతో 16వ ఓవర్‌లో లాంఛనం పూర్తయ్యింది.
చివర్లో డీకే జోరు: ఆర్‌సీబీ నుంచి ఇప్పటిదాకా కోహ్లీ మాత్రమే 50+ స్కోరు చేయగా.. ఈ మ్యాచ్‌లో మాత్రం డుప్లెసి, రజత్, దినేశ్ కార్తీక్ రూపంలో ముగ్గురు బ్యాటర్లు ఈ ఫీట్ సాధించారు. దీంతో స్కోరు 200కి చేరువగా వెళ్లింది. పేసర్ బుమ్రా మాత్రం ఐదు వికెట్లతో పరుగులను సైతం కట్టడి చేశాడు. టాస్ ఓడిన బెంగళూరుకు ఆరంభంలోనే ఝలక్ తగిలింది. విరాట్ (3), ఐపీఎల్ అరంగేట్ర బ్యాటర్ విల్ జాక్స్ (8) తొలి నాలుగు ఓవర్లలోనే పెవిలియన్‌కు చేరారు. బుమ్రాను ఎదుర్కొనేందుకు తీవ్రంగా ఇబ్బందిపడిన కోహ్లీ అతడికే చిక్కాడు. ఈ దశలో కెప్టెన్ డుప్లెసితో పాటు రజత్ పటీదార్ జట్టును ఆదుకునే బాధ్యతను తీసుకున్నారు. రజత్ 12వ ఓవర్‌లో తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలచడంతో స్కోరు వంద దాటగా, 25 బంతుల్లోనే అతడి మెరుపు అర్ధసెంచరీ కూడా పూర్తయ్యింది. కానీ తర్వాతి బంతికే అతడి దూకుడుకు పేసర్ కొట్జీ బ్రేక్ వేశాడు. తర్వాతి ఓవర్‌లోనే ప్రమాదకర మ్యాక్స్‌వెల్ (0)ను స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ ఎల్బీ చేశాడు. ఈసీజన్‌లో మ్యాక్సీకిది మూడో డకౌట్. అటు డుప్లెసి ఫోర్‌తో 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. అయితే బుమ్రా డెత్ ఓవర్లలో గట్టి షాకే ఇచ్చాడు. 17వ ఓవర్‌లో డుప్లెసి, లొమ్రోర్ (0)లను, 19వ ఓవర్‌లో సౌరవ్ చౌహాన్ (9), వైశాక్ (0)లను అవుట్ చేశాడు. ఇక ఆఖరి ఓవర్‌లో డీకే 6,6,4తో 19 రన్స్ అందించి, 22 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా జట్టు సవాల్ విసిరే స్కోరు సాధించింది.
స్కోరుబోర్డు
బెంగళూరు: కోహ్లీ (సి) ఇషాన్ (బి) బుమ్రా 3, డుప్లెసి (సి) డేవిడ్ (బి) బుమ్రా 61, విల్ జాక్స్ (సి) డేవిడ్ (బి) మధ్వల్ 8, పటీదార్ (సి) ఇషాన్ (బి) కొట్జీ 50, మ్యాక్స్‌వెల్ (ఎల్బీ) శ్రేయాస్ 0, దినేష్ (నాటౌట్) 53, లోమ్రోర్ (ఎల్బీ) బుమ్రా 0, సౌరవ్ చౌహాన్ (సి) మధ్వల్ (బి) బుమ్రా 9, వైశాక్ (సి) నబీ (బి) బుమ్రా 0, ఆకాశ్ దీప్ (నాటౌట్) 2 : ఎక్స్‌ట్రాలు : 10 : మొత్తం 20 ఓవర్లలో 196/8 ; వికెట్లపతనం : 1-14, 2-23, 3-105, 4-108, 5-153, 6-153, 7-170, 8-170 ; బౌలింగ్: నబీ 1-0-7-0, కొట్జీ 4-0-42-1, బుమ్రా 4-0-21-5, ఆకాష్ మధ్వల్ 4-0-57-1, శ్రేయాస్ గోపాల్ 4-0-32-1, షెఫర్డ్ 2-0-22-0, హార్దిక్ 1-0-13-0.
ముంబై: ఇషాన్ (సి) కోహ్లీ (బి) ఆకాశ్‌దీ్‌ప 69, రోహిత్ (సి) టోప్లే (బి) జాక్స్ 38, సూర్యకుమార్ (సి) లోమ్రోర్ (బి) వైశాఖ్ 52, హార్దిక్ (నాటౌట్) 21, తిలక్ వర్మ (నాటౌట్) 16 : ఎక్స్‌ట్రాలు : 3 : మొత్తం 15.3 ఓవర్లలో 199/3 ; వికెట్ల పతనం :1-101, 2-139, 3-176 ; బౌలింగ్ : టోప్లే 3-0-34-0, సిరాజ్ 3-0-37-0, ఆకాశ్‌దీ్‌ప 3.3-0-55-1, మ్యాక్స్‌వెల్ 1-0-17-0, వైశాక్ 3-0-32-1, విల్ జాక్స్ 2-0-24-1.
1
ఐపీఎల్‌లో ఎక్కువసార్లు (17) డకౌటైన బ్యాటర్ మ్యాక్స్‌వెల్. దినేశ్ కార్తీక్, రోహిత్‌తో సమంగా నిలిచాడు.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
రాజస్థాన్ 5 4 1 0 8 0.871
కోల్‌కతా 4 3 1 0 6 1.528
లఖ్‌నవూ 4 3 1 0 6 0.775
చెన్నై 5 3 2 0 6 0.666
హైదరాబాద్ 5 3 2 0 6 0.344
గుజరాత్ 6 3 3 0 6 -0.637
ముంబై 5 2 3 0 4 -0.073
పంజాబ్ 5 2 3 0 4 -0.196
బెంగళూరు 6 1 5 0 2 -1.124
ఢిల్లీ 5 1 4 0 2 -1.370
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్