Novak Djokovic: పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నొవాక్ జకోవిచ్
ABN , Publish Date - Aug 04 , 2024 | 10:04 PM
సెర్బియన్ క్రీడాకారుడు నోవాక్ జొకోవిచ్ తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్-3 ఆటగాడు కార్లోస్ అల్కారాస్‌ను మట్టికరిపించాడు.
సెర్బియన్ క్రీడాకారుడు నోవాక్ జొకోవిచ్ తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్-3 ఆటగాడు కార్లోస్ అల్కారాస్‌ను మట్టికరిపించాడు. వరుస సెట్లలో 7-6, 7-6తో స్పానిష్ యువ స్టార్‌ను జకోవిచ్ ఓడించాడు. దీంతో 16 ఏళ్ల సుధీర్ఘ కెరియర్ తర్వాత అతడు ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. కాగా ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది.
స్వర్ణం సాధించడంతో ‘కెరీర్ గోల్డెన్ స్లామ్’ ఆటగాళ్ల జాబితాలో జకోవిచ్ చేరాడు. నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో పాటు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఆటగాళ్లను ‘కెరీర్ గోల్డెన్ స్లామ్’ ప్లేయర్లుగా పేర్కొంటారు. తాజా ఒలింపిక్ స్వర్ణంతో పాటు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను జకోవిచ్ ముద్దాడాడు. కాగా జొకోవిచ్, అల్కరాస్ ఇద్దరికీ ఒలింపిక్స్‌లో ఇదే మొట్టమొదటి ఫైనల్ మ్యా్చ్ కావడం విశేషం.
జకోవిచ్ తన కెరియర్‌తో ఒలింపిక్ స్వర్ణంతో పాటు మొత్తం 24 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించాడు. దీంతో తన టెన్నిస్ కెరియర్‌లో అతడు అంతా సాధించినట్టయింది. జర్మనీ లెజెండ్ స్టెఫీ గ్రాఫ్ 1988లో 4 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను, ఒలింపిక్ స్వర్ణాన్ని గెలిచి ‘గోల్డెన్ స్లామ్ టైటిల్’ను సంపాదించిన తొలి క్రీడాకారిణిగా అవతరించింది. ఇక ఆండ్రీ అగస్సీ 1999లో, రాఫెల్ నాదల్ 2010లో, సెరెనా విలియమ్స్ 2012లో అన్ని గ్రాండ్ స్లామ్ టైటిళ్లను, ఒక ఒలింపిక్ స్వర్ణాన్ని గెలుచుకున్నారు. ఇక సింగిల్స్, డబుల్స్ రెండు కేటగిరీలలోనూ కెరీర్ గోల్డెన్ స్లామ్ సాధించిన ఏకైక టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ కావడం విశేషం. ఇక జకోవిచ్‌కు గట్టి పోటీ ఇచ్చిన 21 ఏళ్ల కార్లోస్ అల్కరాస్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఒలింపిక్ స్వర్ణం మినహా మిగతా అన్ని గ్రాండ్స్ స్లామ్ టైటిల్స్‌ను ముద్దాడాడు.