Share News

దేశంలో ఒలింపిక్‌ స్థాయి క్రీడా సౌకర్యాలు 10.4 శాతమే!

ABN , Publish Date - Aug 18 , 2024 | 02:04 AM

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఓవైపు విశ్వాసం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు విశ్వక్రీడల ప్రమాణాలను అందుకునే స్థాయిలో క్రీడల మౌలిక వసతులు దేశంలో లేవన్న విషయం...

దేశంలో ఒలింపిక్‌ స్థాయి క్రీడా సౌకర్యాలు 10.4 శాతమే!

న్యూఢిల్లీ: 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఓవైపు విశ్వాసం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు విశ్వక్రీడల ప్రమాణాలను అందుకునే స్థాయిలో క్రీడల మౌలిక వసతులు దేశంలో లేవన్న విషయం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో క్రీడల మౌలిక వసతుల్లో ఒలింపిక్స్‌ ప్రమాణాలను అందుకొనేవి 10.4 శాతమే అని ‘బిజినెస్‌ స్టాండర్డ్‌’ చేసిన సర్వేలో తేలింది. భవిష్యత్‌ ప్రాజెక్టులను ఇందులో పరిగణనలోకి తీసుకోలేదు. ఖేలో ఇండియా లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 737 జిల్లాల్లో 15,822 క్రీడా మౌలిక నిర్మాణాలు పూర్తికాగా.. 20,832 పూర్తి క్రీడా సౌకర్యాలు ఉన్నాయి. కానీ, వీటిల్లో 1645 క్రీడా మౌలిక నిర్మాణాలు, 2473 పూర్తి క్రీడా సౌకర్యాలు మాత్రమే ఒలింపిక్స్‌ స్థాయిలో ఉన్నాయని నివేదిక లో బహిర్గతమైంది. ఇవన్నీ వివిధ రాష్ట్రాల్లోని 334 జిల్లాల్లో ఉన్నాయి.


అంతర్జాతీయ క్రీడల నిర్వహణ స్థాయిలో బ్యాడ్మింటన్‌కు 314 కోర్టులు, ఫుట్‌బాల్‌కు 301 గ్రౌండ్‌లు, వాలీబాల్‌కు 270 కోర్ట్‌లు, అథ్లెటిక్స్‌కు 221 ట్రాక్‌లు అందుబాటు లో ఉన్నాయి. పూర్తయిన క్రీడా మౌలిక నిర్మాణాల్లో తమిళనాడులో అత్యధికంగా 390 ఉండగా.. 161తో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఇక, గుజరాత్‌లో 43 క్రీడా మౌలిక సదుపాయాలు, 18 మల్టీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. కాగా, మొతేరాలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్పోర్ట్స్‌ ఎన్‌క్లేవ్‌తో భారీ ప్రాజెక్టును ఆరంభించనున్నారు. మిషన్‌ ఒలింపిక్స్‌లో భాగంగా ‘గుజరాత్‌ ఒలింపిక్‌ ప్లానింగ్‌, మౌలిక వసతుల కార్పొరేషన్‌’ను గుజరాత్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2036 ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం రూ. 6వేల కోట్లతో ఆరు క్రీడా కాంప్లెక్సులు నిర్మించాలనేది ప్రణాళిక. అయితే, ఇదంతా ఒలింపిక్‌ బిడ్‌ నెగ్గితేనే!

Updated Date - Aug 18 , 2024 | 02:04 AM