Share News

Pro Kabaddi: ప్రొ కబడ్డీ నయా చాంప్‌ పుణెరి పల్టన్‌.. ఉత్కంఠ ఫైనల్లో హరియాణాపై గెలుపు

ABN , Publish Date - Mar 02 , 2024 | 01:24 AM

ప్రొ కబడ్డీ సీజన్‌-10 టైటిల్‌ను పుణెరి పల్టన్‌ జట్టు కైవసం చేసుకుంది. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన తుది పోరులో పుణె 28-25తో హరియాణా స్టీలర్స్‌పై నెగ్గి విజేతగా నిలిచింది.

Pro Kabaddi: ప్రొ కబడ్డీ నయా చాంప్‌ పుణెరి పల్టన్‌.. ఉత్కంఠ ఫైనల్లో హరియాణాపై గెలుపు

ప్రొ కబడ్డీనయా చాంప్‌ పల్టన్‌

ఉత్కంఠ ఫైనల్లో హరియాణాపై గెలుపు

ఉత్తమ రైడర్‌గా అషు, డిఫెండర్‌గా రీజా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రొ కబడ్డీ సీజన్‌-10 టైటిల్‌ను పుణెరి పల్టన్‌ జట్టు కైవసం చేసుకుంది. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన తుది పోరులో పుణె 28-25తో హరియాణా స్టీలర్స్‌పై నెగ్గి విజేతగా నిలిచింది. పుణె చాంపియన్‌గా నిలవడం ఇదే తొలిసారి. ఈ జట్టు గత సీజన్‌లో ఫైనల్‌ చేరినా, జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇక, తొలిసారి ఫైనల్‌ చేరిన హరియాణా ఆఖర్లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది.

చెలరేగిన పంకజ్‌, మోహిత్‌: రైడర్లు పంకజ్‌ మోహిత్‌ 9 పాయింట్లు, మోహిత్‌ గోయత్‌ (5), అస్లం ఇనామ్‌దార్‌ (4), డిఫెండర్లు గౌరవ్‌ ఖత్రి (4) పుణె విజయంలో ముఖ్యభూమిక పోషించారు. హరియాణా స్టార్‌ రైడర్‌ సిద్ధార్ధ్‌ దేశాయ్‌ నాలుగు పాయింట్లే సాధించి, నిరాశ పర్చాడు. ఫైనల్లో డిఫెండర్ల ఆటే గెలుపు అవకాశాలను ప్రభావితం చేసింది. ఇరు జట్ల రైడర్లు చెరో 17 పాయింట్లతో సమంగా నిలవగా, డిఫెన్స్‌లో పుణె 9 పాయింట్లు సహా ఒక ఆలౌట్‌ బోనస్‌ పాయింట్‌ దక్కించుకుని పైచేయి సాధించింది.

పోటాపోటీగా..: ఈ సీజన్‌లోని రెండు ఉత్తమ డిఫెన్స్‌ జట్ల మధ్య ఫైనల్‌ జరగడంతో పాయింట్ల కోసం రైడర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. ఆట ప్రారంభమైన తొలి పది నిమిషాల్లో ఇరు జట్లకూ పెద్దగా పాయింట్లు లభించలేదు. ఆతర్వాత పోటాపోటీగా ఒక్కో పాయింట్‌ సాధించడం మొదలవగా ఒక సమయంలో 7-7తో సమమైంది. ఈ దశలో పుణె రైడర్‌ పంకజ్‌ సూపర్‌ రైడర్‌తో 4 పాయింట్లు సాధించి, పుణెను ప్రథమార్ధంలో 13-9 ఆధిక్యంలో నిలిపాడు.

హరియాణా పోరాడినా..: ద్వితీయార్ధంలో హరియాణా గెలుపు కోసం తీవ్రంగా పోరాడినా విజయానికి చేరువగా వచ్చి.. ఆగిపోయింది. ఆట రెండో భాగంలో పుణెతో సమానంగా హరియాణా 15 పాయింట్లు సాధించి, స్కోరు అంతరాన్ని తగ్గించగలిగింది కానీ, విజయానికి అవసరమైన పాయింట్లను సాధించలేకపోయింది. ప్రథమార్ధంలో పుణె సాధించిన మూడు పాయింట్ల ఆధిక్యతే ఆ జట్టును విజేతగా నిలిపింది. ఈ సీజన్‌ ఉత్తమ రైడర్‌ అవార్డును అషూ మాలిక్‌ (దబాంగ్‌ ఢిల్లీ), ఉత్తమ డిఫెండర్‌ అవార్డును మహ్మద్‌ రీజా (పుణెరి పల్టన్‌) అందుకున్నారు.

Updated Date - Mar 02 , 2024 | 06:38 AM