Share News

పంజాబ్‌ బల్లే బల్లే

ABN , Publish Date - Apr 05 , 2024 | 02:10 AM

పంజాబ్‌ కింగ్స్‌ రెండు వరుస ఓటముల తర్వాత గెలుపు బాట పట్టింది. భారీ ఛేదనలో వరుస వికెట్లు కోల్పోతున్నా.. ఎవరి అంచనాల్లో లేని శశాంక్‌ సింగ్‌ (29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 నాటౌట్‌), అశుతోష్‌ శర్మ (17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 31) కదం తొక్కారు...

పంజాబ్‌ బల్లే బల్లే

నేటి మ్యాచ్‌

హైదరాబాద్‌ X చెన్నై, రా.7.30 నుంచి

గుజరాత్‌పై ఉత్కంఠ విజయం

ఆదుకున్న శశాంక్‌, అశుతోష్‌

గిల్‌ ఇన్నింగ్స్‌ వృధా

అహ్మదాబాద్‌: పంజాబ్‌ కింగ్స్‌ రెండు వరుస ఓటముల తర్వాత గెలుపు బాట పట్టింది. భారీ ఛేదనలో వరుస వికెట్లు కోల్పోతున్నా.. ఎవరి అంచనాల్లో లేని శశాంక్‌ సింగ్‌ (29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 నాటౌట్‌), అశుతోష్‌ శర్మ (17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 31) కదం తొక్కారు. టైటాన్స్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఆఖరి ఓవర్‌లో మ్యాచ్‌ను గుజరాత్‌ నుంచి లాగేశారు. అటు టైటాన్స్‌ ఫీల్డింగ్‌ వైఫల్యం కూడా కలిసివచ్చింది. దీంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 3 వికెట్లతో నెగ్గింది. ఈ సీజన్‌లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక ఛేదన. ముందుగా గుజరాత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 89 నాటౌట్‌), సాయి సుదర్శన్‌ (19 బంతుల్లో 6 ఫోర్లతో 33), రాహుల్‌ తెవాటియా (8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 23 నాటౌట్‌) రాణించారు. రబాడకు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో పంజాబ్‌ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 200 రన్స్‌ చేసి గెలిచింది. ప్రభ్‌సిమ్రన్‌ (24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) ఫర్వాలేదనిపించాడు. నూర్‌ అహ్మద్‌కు 2 వికెట్లు లభించాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా శశాంక్‌ నిలిచాడు.

కలిసికట్టుగా..: భారీ ఛేదనను పంజాబ్‌ ఆత్మవిశ్వాసంతో ఆరంభించింది. వికెట్లు కోల్పోయినా రన్‌రేట్‌ తగ్గకుండా చూసుకుంది. మధ్య ఓవర్లలో శశాంక్‌, చివర్లో అశుతోష్‌ బ్యాటింగ్‌ తీరు జట్టును కాపాడింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ బెయిర్‌స్టో (22) మూడు ఫోర్లతో 13 రన్స్‌ రాబట్టాడు. మరో ఓపెనర్‌ ధవన్‌ (1)ను రెండో ఓవర్‌లోనే పేసర్‌ ఉమేశ్‌ బౌల్డ్‌ చేసినా.. ప్రభ్‌సిమ్రన్‌ ధాటిని కనబర్చి నాలుగో ఓవర్‌లో 6,4తో ఆకట్టుకున్నాడు. అయితే టీనేజ్‌ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ తన తొలి ఓవర్‌లోనే బెయిర్‌స్టోను అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. నూర్‌ తన తర్వాతి ఓవర్‌లోనే ప్రభ్‌సిమ్రన్‌ను అవుట్‌ చేయగా.. ఆ వెంటనే సామ్‌ కర్రాన్‌ (5)ను అజ్మతుల్లా వెనక్కి పంపాడు. ఈ దశలో శశాంక్‌ సింగ్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 11వ ఓవర్‌లో వరుసగా 4,6,4తో 17 రన్స్‌తో స్కోరుబోర్డులో కదలిక తెచ్చాడు. ఇక జితేశ్‌ శర్మ (16) వరుస రెండు సిక్సర్లతో జోరు చూపినా తర్వాతి బంతికే రషీద్‌కు చిక్కాడు. 18 బంతుల్లో 41 పరుగులు కావాల్సి వేళ ఎవరి అంచనాల్లో లేని అశుతోష్‌ ఎడాపెడా బౌండరీలతో చెలరేగాడు. అటు 25 బంతుల్లోనే శశాంక్‌ తొలి ఐపీఎల్‌ ఫిఫ్టీ సాధించాడు. 19వ ఓవర్‌లో అశుతోష్‌ రెండు సిక్సర్లతో 18 రన్స్‌ సాధించి, ఆఖరి ఓవర్‌లో సమీకరణం 7 పరుగులకు తెచ్చాడు. అయితే 20వ ఓవర్‌ తొలి బంతికే అతడిని పేసర్‌ నల్కండే అవుట్‌ చేసినా.. శశాంక్‌ ఓ ఫోర్‌తో విజయాన్ని తేలిక చేశాడు.

గిల్‌ అజేయంగా..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అజేయ అర్ధసెంచరీతో తుదికంటా నిలిచాడు. మధ్య ఓవర్లలో సాయి సుదర్శన్‌, చివర్లో తెవాటియా జోరుతో జట్టు భారీ స్కోరు అందుకుంది. తొలి ఓవర్‌లోనే గిల్‌ సిక్సర్‌ బాదగా, అటు సాహా ఫోర్లతో ఆకట్టుకున్నాడు. మూడో ఓవర్‌లోనే సాహా (11) వికెట్‌ కోల్పోయినా అప్పటికే జట్టు స్కోరు 29 పరుగులకు చేరింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ (26) ఉన్న కాసేపు వేగం చూపాడు. నాలుగు ఫోర్లతో ఆకట్టుకున్నా హర్‌ప్రీత్‌ బ్రార్‌ బౌన్సర్‌కు వెనుదిరిగాడు. రెండో వికెట్‌కు 40 పరుగులు జత చేరాయి. అయితే సాయి సుదర్శన్‌ రాకతో స్కోరులో వేగం పెరిగింది. 12వ ఓవర్‌లో అతడి రెండు ఫోర్లు, గిల్‌ ఓ ఫోర్‌తో 14 పరుగులు వచ్చాయి. చక్కగా కుదురుకున్న ఈ జోడీని పేసర్‌ హర్షల్‌ విడదీశాడు. 14వ ఓవర్‌లో సుదర్శన్‌ను అవుట్‌ చేయడంతో మూడో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్‌లోనే గిల్‌ ఫోర్‌తో 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. 18వ ఓవర్‌లో గిల్‌ చెలరేగి 6,4 బాదినా విజయ్‌ శంకర్‌ (8) వికెట్‌ను రబాడ తీసి నాలుగో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యానికి తెర దించాడు. అయితే తెవాటియా వచ్చీ రాగానే బ్యాట్‌కు పనిజెప్పాడు. చివరి రెండు ఓవర్లలో ఓ సిక్సర్‌, 3 ఫోర్లతో 33 పరుగులందించడంతో స్కోరు 200కి చేరువగా వచ్చింది.

స్కోరుబోర్డు

గుజరాత్‌: సాహా (సి) ధవన్‌ (బి) రబాడ 11, గిల్‌ (నాటౌట్‌) 89, విలియమ్సన్‌ (సి) బెయిర్‌స్టో (బి) బ్రార్‌ 26, సాయి సుదర్శన్‌ (సి) జితేశ్‌ (బి) హర్షల్‌ 33, విజయ్‌ శంకర్‌ (సి) బ్రార్‌ (బి) రబాడ 8, తెవాటియా (నాటౌట్‌) 23, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 199/4; వికెట్ల పతనం: 1-29, 2-69, 3-122, 4-164; బౌలింగ్‌: హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4-0-33-1, అర్ష్‌దీప్‌ 4-0-33- 0, రబాడ 4-0-44-2, కర్రాన్‌ 2-0-18-0, హర్షల్‌ 4-0-44- 1, సికందర్‌ 2-0-22-0.

పంజాబ్‌: ధవన్‌ (బి) ఉమేశ్‌ 1, బెయిర్‌స్టో (బి) నూర్‌ అహ్మద్‌ 22, ప్రభ్‌సిమ్రన్‌ (సి) మోహిత్‌ (బి) నూర్‌ 35, కర్రాన్‌ (సి) విలియమ్సన్‌ (బి) అజ్మతుల్లా 5, సికందర్‌ రజా (సి) సాహా (బి) మోహిత్‌ 15, శశాంక్‌ సింగ్‌ (నాటౌట్‌) 61, జితేశ్‌ శర్మ (సి) నల్కండే (బి) రషీద్‌ 16, అశుతోష్‌ శర్మ (సి) రషీద్‌ (బి) నాల్కండే 31, హర్‌ప్రీత్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 19.5 ఓవర్లలో 200/7; వికెట్ల పతనం: 1-13, 2-48, 3-64, 4-70, 5-111, 6-150, 7-193; బౌలింగ్‌: అజ్మతుల్లా 4-0-41-1, ఉమేశ్‌ 3-0-35-1, రషీద్‌ 4-0-40-1, నూర్‌ అహ్మద్‌ 4-0-32-2, మోహిత్‌ 4-0- 38-1, నల్కండే 0.5-0-6-1.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

కోల్‌కతా 3 3 0 0 6 2.518

రాజస్థాన్‌ 3 3 0 0 6 1.249

చెన్నై 3 2 1 0 4 0.976

లఖ్‌నవూ 3 2 1 0 4 0.483

పంజాబ్‌ 4 2 2 0 4 -0.220

గుజరాత్‌ 4 2 2 0 4 -0.580

హైదరాబాద్‌ 3 1 2 0 2 0.204

బెంగళూరు 4 1 3 0 2 -0.876

ఢిల్లీ 4 1 3 0 2 -1.347

ముంబై 3 0 3 0 0 -1.423

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

Updated Date - Apr 05 , 2024 | 02:10 AM