T20 World Cup final: ఆ గాయం నిజమైనది కాదు.. ప్రపంచకప్ ఫైనల్లో యాక్టింగ్‌పై రిషభ్ పంత్ ఏమన్నాడంటే..
ABN , Publish Date - Oct 12 , 2024 | 07:39 PM
దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా జరిగిన టీ-20 ప్రపపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్ క్లాసెన్ మంచి దూకుడుగా ఆడుతూ తన జట్టును విజయానికి చేరువ చేశాడు. ఆ సమయంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ వేసిన ఓ ట్రిక్ మ్యాచ్‌ను టీమిండియా వైపు మలుపు తిప్పింది.
దాదాపు పదిహేడేళ్ల తర్వాత టీమిండియా రెండోసారి టీ-20 ప్రపంచకప్ (T-20 Worldcup)ను తన ఖాతాలో వేసుకుంది. దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో (T20 World Cup final) టీమిండియా స్వల్ప తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్ క్లాసెన్ మంచి దూకుడుగా ఆడుతూ తన జట్టును విజయానికి చేరువ చేశాడు. 24 బంతుల్లో కేవలం 26 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా విజేతగా నిలుస్తుంది. ఆ సమయంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) వేసిన ఓ ట్రిక్ మ్యాచ్‌ను టీమిండియా వైపు మలుపు తిప్పింది (Ind vs SA).
పంత్ ``ఫేక్ ఇంజురీ`` (fake injury) సాకుతో ఆటను ఆపడం వల్ల టీమిండియాకు చాలా మేలు జరిగిందని ఓ కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యాఖ్యలపై పంత్ తాజాగా ఓ కార్యక్రమంలో స్పందించాడు. ``మ్యాచ్ వేగంగా మారిపోతోంది. ఫలితం మాకు అనుకూలంగా వచ్చేలా కనిపించలేదు. అప్పటికి గత మూడు ఓవరల్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు భారీ పరుగులు రాబట్టారు. ఆ సమయంలో మూమెంట్‌ను మార్చాలని అనుకున్నా. ఎందుకంటే అది ప్రపంచకప్ ఫైనల్. అలాంటి అవకాశం మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ సమయంలోనే నా మోకాలు కాస్తా నొప్పిగా అనిపించింది. అప్పుడు ఫిజియోను పిలిపించాం. నా కాలికి పట్టీ వేయాలని ఫిజియోకు చెప్పా`` అని పంత్ పేర్కొన్నాడు.
``కాస్తంత ఎక్కువ సమయం తీసుకో అని ఫిజియోకు చెప్పా. ``అంతా బాగానే ఉంది కదా`` అని ఫిజియో అన్నాడు. నేను జస్ట్ యాక్టింగ్ చేస్తున్నా. కాస్త ఎక్కువ సమయం తీసుకుని పట్టీ వేయమని చెప్పా. బ్యాటర్ల రిథమ్‌ను బ్రేక్ చేయడం వల్ల అప్పుడప్పుడు పరిస్థితి మారుతుంది. అన్నిసార్లూ అది వర్కవుట్ కాదు. కానీ, ఆ మ్యాచ్‌లో వర్కవుట్ అయింది. వారి దూకుడుకు బ్రేక్ పడింది. మ్యాచ్ మాకు అనుకూలంగా మారింది. అయితే ఆ ఒక్క కారణం వల్లే మేం మ్యాచ్ గెలిచాం అని చెప్పలేను`` అంటూ పంత్ వ్యాఖ్యానించాడు. ఫైనల్ మ్యాచ్ సమయంలో పంత్ చాలా తెలివిగా వ్యవహరించాడంటూ కెప్టెన్ రోహిత్ శర్మ గతంలో ప్రశంసించిన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..