MS Dhoni: గతేడాది ఐపీఎల్ సమయంలోనే.. ధోనీ షాకింగ్ నిర్ణయంపై రుతురాజ్ స్పందన ఏంటంటే..
ABN , Publish Date - Mar 22 , 2024 | 05:25 PM
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి ధోనీ అందరికీ షాకిచ్చాడు. ధోనీ స్థానంలో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సారథిగా బాధ్యతలు స్వీకరించనున్నాడు.
``ఈ ఏడాది కొత్త రోల్`` అంటూ కొన్ని రోజుల కిందట సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చిన ఎంఎస్ ధోనీ (MS Dhoni) తాజాగా బాంబు పేల్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ (CSK Captaincy) నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. ధోనీ స్థానంలో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) చెన్నై సారథిగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ధోనీ షాకింగ్ డెసిషన్ గురించి తాజాగా రుతురాజ్ స్పందించాడు.
``గతేడాది సీజన్ సమయంలోనే మహీ భాయ్ కెప్టెన్సీ గురించి నాకు హింట్ ఇచ్చాడు. కొత్త పాత్రకు సిద్ధంగా ఉండు అంటూ ధోనీ నాకు చెప్పాడు. మేము క్యాంప్‌లో జాయిన్ అయినపుడు చర్చల్లో నన్ను భాగస్వామిని చేశాడు. నాకు సంబంధించినంత వరకు ధోనీ డెసిషన్ సర్‌ప్రైజ్ కాదు. నాయకత్వం వహించడం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను`` అంటూ రుతురాజ్ పేర్కొన్నాడు. ఈ రోజు (శుక్రవారం) జరగబోతున్న సీజన్ (IPL 2024) తొలి మ్యాచ్‌లో చెన్నై టీమ్‌తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్ (CSK vs RCB) తలపడనుంది.
``ఎన్నో విజయాలు సాధించిన చెన్నై టీమ్‌లో నేను తేవాల్సిన మార్పులు ఏమీ ఉండవు. టీమ్‌కు బ్యాక్ బోన్ లాంటి ధోనీ భాయ్‌ను కలిగి ఉండడం గొప్ప వరం. అలాగే రహానే, రవీంద్ర జడేజా మాకు అదనపు బలం. ఆటగాళ్లకు స్వేచ్ఛనివ్వడం మాత్రమే కెప్టెన్‌గా నేను చేయాల్సింది`` అని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు.