Sanju Samson: సూర్య సలహాతోనే సెంచరీ.. ఆసక్తికర విషయం వెల్లడించిన సంజూ శాంసన్..
ABN , Publish Date - Oct 13 , 2024 | 09:49 PM
ఉప్పల్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో యువ బ్యాటర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 40 బంతుల్లోనే అద్భుత సెంచరీ సాధించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి 69 బంతుల్లోనే 173 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
బంగ్లాదేశ్‌తో (India vs Bangladesh) జరిగిన మూడు టీ-20 సిరీస్‌లో యువ భారత్ సత్తా చాటింది. మూడింటిలోనూ గెలుపొంది సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఉప్పల్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో యువ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 40 బంతుల్లోనే అద్భుత సెంచరీ సాధించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి 69 బంతుల్లోనే 173 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తాను 96 పరుగుల వద్ద ఉన్నప్పుడు సెంచరీ విషయంలో సూర్యకుమార్ (SuryaKumar Yadav) ఇచ్చిన సలహా గురించి తాజాగా సంజూ మాట్లాడాడు (Sanju Samson Century).
``నేను 96 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సూర్యకుమార్ యాదవ్‌తో మాట్లాడా. తర్వాతి బంతిని స్టేడియం అవతలకి పంపుతానని చెప్పా. అప్పుడు సూర్య.. ``ఇప్పటివరకు ఎలా ఆడావో అలాగే ఆడు. తొందర పడకు`` అని చెప్పాడు. ఆ క్లారిటీ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాతి బంతిని బౌండరీకి పంపి సెంచరీ చేశా`` అని సంజూ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో సంజూ భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. బంగ్లా లెగ్ స్పిన్నర్ రిషాద్ హుస్సేన్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
47 బంతుల్లో 111 పరుగులు చేసి టీ-20 క్రికెట్‌లో సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. అలాగే రోహిత్ శర్మ తర్వాత వేగవంతమైన సెంచరీ (40 బంతుల్లో) సాధించిన భారత బ్యాటర్‌గా కూడా సంజూ శాంసన్ నిలిచాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన సంజూ 2015లోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ-20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే నిలకడ లేమితో ఇబ్బంది పడుతూ అవకాశాలు అందుకోలేపోయాడు. ఈ పదేళ్లలో సంజూ శాంసన్ టీమిండియా తరఫున కేవలం 32 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..