Share News

IND vs ENG 2nd Test : బజ్‌బాల్‌కు చెక్‌ పెట్టేనా?

ABN , Publish Date - Feb 02 , 2024 | 04:38 AM

ఇంగ్లండ్‌ ప్రధాన అస్త్రమైన బజ్‌బాల్‌ వ్యూహాన్ని భారత్‌ ఈసారి ఎలా ఎదుర్కొనబోతోంది? అంతకంటే ముందు జడేజా, రాహుల్‌, కోహ్లీ లేని వేళ తమ తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతోంది? ఇప్పుడందరినీ ఇవే సందేహాలు

IND vs ENG 2nd Test : బజ్‌బాల్‌కు చెక్‌ పెట్టేనా?

ఉదయం 9.30 గంటల నుంచి జియో సినిమాలో

తుది జట్టుపై అందరి దృష్టి

ఒత్తిడిలో టీమిండియా

నేటి నుంచి ఇంగ్లండ్‌తో రెండో టెస్టు

విశాఖపట్నం (స్పోర్ట్స్‌): ఇంగ్లండ్‌ ప్రధాన అస్త్రమైన బజ్‌బాల్‌ వ్యూహాన్ని భారత్‌ ఈసారి ఎలా ఎదుర్కొనబోతోంది? అంతకంటే ముందు జడేజా, రాహుల్‌, కోహ్లీ లేని వేళ తమ తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతోంది? ఇప్పుడందరినీ ఇవే సందేహాలు వెంటాడుతున్నాయి. శుక్రవారం విశాఖలో ఆరంభమయ్యే రెండో టెస్టు భారత జట్టుకు అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే ఇప్పటికే తొలి టెస్టులో అనూహ్య ఓటమి జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసింది. ఈ అవకాశం చేజారితే తిరిగి కోలుకోవడం కష్టమవుతుంది. ఉప్పల్‌ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కినా బ్యాటింగ్‌ వైఫల్యం కొంపముంచింది. అందుకే తాజా టెస్టులో ఇంగ్లండ్‌ను కౌంటర్‌ చేయాలంటే తమ ఆటతీరు మార్చుకోవాల్సిందే. డిఫెన్సివ్‌ ఆటను కాకుండా ఎదురుదాడిని నమ్ముకుంటేనే బజ్‌బాల్‌కు చెక్‌ పెట్టవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడేళ్ల క్రితం ఇదే జట్టుపై మొదటి టెస్టు ఓడినా.. ఆ తర్వాత భారత్‌ వరుసగా 3 టెస్టులు నెగ్గింది.

ఆడేది ఎవరు?: జడేజా, రాహుల్‌ స్థానంలో జట్టులోకి సర్ఫరాజ్‌, రజత్‌ పటీదార్‌, సౌరభ్‌ కుమార్‌ వచ్చారు. ఇప్పుడు తుది జట్టులో వీరిలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరం. అలాగే జడ్డూ స్థానంలో స్పిన్నర్‌గా కుల్దీప్‌ ఆడే చాన్స్‌ ఉంది. ఇక నలుగురు స్పిన్నర్లతో వెళ్లాలనుకుంటే పేసర్‌ సిరాజ్‌ను పక్కనబెట్టి ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ వైపు మొగ్గు చూపుతారు. అశ్విన్‌, అక్షర్‌ ప్రత్యర్థి స్వీప్‌ షాట్లకు చెక్‌ పెట్టేలా బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. బ్యాటింగ్‌ విభాగంలోనూ గిల్‌, శ్రేయా్‌సల ఫామ్‌ ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా గిల్‌ డిఫెన్సివ్‌ ఆటతో మరింతగా విఫలమవుతున్నాడు. అరంగేట్ర స్పిన్నర్‌ టామ్‌ హార్ట్‌లీని తట్టుకోవడంలో రోహిత్‌ మినహా అంతా విఫలమయ్యారు. స్వీప్‌ షాట్లు ఆడడంలో ఇంగ్లండ్‌ బ్యాటర్లకన్నా వెనుకబడ్డారు. అలాగే రాహుల్‌ స్థానంలో సర్ఫరాజ్‌కన్నా రజత్‌ పటీదార్‌కు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. పిచ్‌ను బట్టి తుది జట్టుపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఓ అంచనాకు రావచ్చు.

అండర్సన్‌, బషీర్‌కు చోటు: ఇంగ్లండ్‌ జట్టు ఇప్పటికే తమ తుది జట్టును ప్రకటించింది. ఈ టెస్టును సైతం గెలిచి 2-0తో భారత్‌పై మరింత ఒత్తిడి పెంచేందుకు వారికిది సువర్ణావకాశం. మొదటి టెస్టులో కెప్టెన్‌ స్టోక్స్‌ తమ బౌలర్లను అద్భుతంగా వినియోగించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ధారాళంగా పరుగులు సాధించినా స్పిన్నర్‌ హార్ట్‌లీని కొనసాగించడం.. కీలక సమయాల్లో పార్ట్‌టైం స్పిన్నర్‌ జో రూట్‌ను బరిలోకి దించడం అతడి నాయకత్వ ప్రతిభను సూచించాయి. వెటరన్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ దూరం కావడంతో షోయబ్‌ బషీర్‌ అరంగేట్రం చేయనున్నాడు. అలాగే పేసర్‌ మార్క్‌ ఉడ్‌ స్థానంలో సీనియర్‌ బౌలర్‌ అండర్సన్‌ను ఏకైక పేసర్‌గా తీసుకున్నారు.

భారత్‌ (అంచనా)

రోహిత్‌ (కెప్టెన్‌), జైస్వాల్‌, గిల్‌, శ్రేయాస్‌, రజత్‌ పటీదార్‌, అక్షర్‌, భరత్‌, అశ్విన్‌, కుల్దీప్‌, బుమ్రా, సిరాజ్‌/సుందర్‌.

ఇంగ్లండ్‌ (తుది జట్టు): క్రాలే, డకెట్‌, పోప్‌, రూట్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌ (కెప్టెన్‌), ఫోక్స్‌, రెహాన్‌ అహ్మద్‌, టామ్‌ హార్ట్‌లీ, షోయబ్‌ బషీర్‌, అండర్సన్‌.

పిచ్‌, వాతావరణం

ఇక్కడ జరిగిన రెండు టెస్టుల్లో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించింది. ఈసారి కూడా తొలి రెండు రోజులు పరుగులకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్పిన్నర్ల ఆధిపత్యం సాగవచ్చు. ఉష్ణోగ్రత 35 డిగ్రీలతో అధిక వేడి ఉండనుంది.

టెస్టుల్లో 500 వికెట్లను పూర్తి చేసేందుకు స్పిన్నర్‌ అశ్విన్‌కు మరో నాలుగు వికెట్లు చాలు. గతంలో భారత్‌ నుంచి కుంబ్లే (619) మాత్రమే 500 మార్క్‌ చేరాడు.

KS-Bharat-addresses-FF.jpg

పక్కా ప్లాన్‌తోనే ఆడతాం

‘రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను ఎదుర్కొనేందుకు మేం తగిన ప్రణాళికలతో బరిలోకి దిగబోతున్నాం. కీలక ఆటగాళ్లు గాయాలపాలైనా ఎలాంటి ఒత్తిడీ లేదు. మాకు స్వీప్‌ షాట్లు ఆడడం రాదని కాదు. కానీ పరిస్థితికి తగ్గట్టు బ్యాటర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ టీమ్‌ డిమాండ్‌ చేస్తే కచ్చితంగా ఆడతాం. తొలి టెస్టులో ఓడిపోయినా డ్రెస్సింగ్‌ రూమ్‌లో పరిస్థితి ప్రశాంతంగానే ఉండింది. సుదీర్ఘ సిరీస్‌ కావడంతో భయపడాల్సిన అవసరం లేదని మాకు తెలుసు’

- కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌)

Updated Date - Feb 02 , 2024 | 04:50 AM