Share News

నిషద్‌కు రజతం

ABN , Publish Date - Sep 02 , 2024 | 04:54 AM

పారాలింపిక్స్‌లో నాలుగో రోజు పతకం లేకుండానే ముగుస్తుందనుకున్న వేళ.. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో మన అథ్లెట్లు రెండు మెడల్స్‌తో శభాష్‌ అనిపించారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల హైజంప్‌ టీ47 ఈవెంట్‌లో స్టార్‌ అథ్లెట్‌ నిషద్‌ కుమార్‌...

నిషద్‌కు రజతం

హైజంప్‌లో రెండోస్థానం

200 మీ. రేసులో ప్రీతికి కాంస్యం

షట్లర్లకు మూడు పతకాలు ఖరారు

ఫైనల్లో నితేశ్‌, సుహాస్‌

పారిస్‌: పారాలింపిక్స్‌లో నాలుగో రోజు పతకం లేకుండానే ముగుస్తుందనుకున్న వేళ.. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో మన అథ్లెట్లు రెండు మెడల్స్‌తో శభాష్‌ అనిపించారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల హైజంప్‌ టీ47 ఈవెంట్‌లో స్టార్‌ అథ్లెట్‌ నిషద్‌ కుమార్‌ రజతంతో మురిపించాడు. నిషద్‌ 2.04 మీటర్ల ఎత్తులో జంప్‌ చేయడంతో పాటు సీజన్‌ బెస్ట్‌ మార్క్‌ను నమోదు చేశాడు. నిషద్‌కు ఇది రెండో పారాలింపిక్‌ పతకం. 2020 టోక్యో గేమ్స్‌లోనూ అతనను రజతం అందుకున్నాడు. కాగా, ఓవరాల్‌గా పారాహైజం్‌పలో భారత్‌కిది ఏడో పతకం. ఇదే పోటీలో పాల్గొన్న రామ్‌ పాల్‌ మాత్రం 1.95మీ.తో ఏడో స్థానంలో నిలిచాడు. మరోవైపు మహిళల 200మీ. టీ35లో ప్రీతి పాల్‌ కాంస్యం సాధించింది. దీంతో ఈ క్రీడల్లో భారత్‌ ఖాతాలో ఓ స్వర్ణం, 2రజతాలు, 4 కాంస్యాలు చేరాయి.


రాకెట్‌ రయ్‌మంటూ..

పారాలింపిక్స్‌లో నాలుగో రోజు భారత షట్లర్ల హవా సాగింది. తమదైన ప్రదర్శనతో దేశానికి కనీసం మూడు రజత పతకాలు ఖాయం చేశారు. ఆదివారం జరిగిన పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో నితేశ్‌ కుమార్‌, సుహాస్‌ యతిరాజ్‌ తమ విభాగాల్లో తుది పోరుకు అర్హత సాధించారు. మొదట జపాన్‌ షట్లర్‌ డైసుకె ఫుజిహరతో జరిగిన ఎస్‌ఎల్‌3 కేటగిరీ సెమీ్‌సలో నితేశ్‌ 21-16, 21-12 తేడాతో సునాయాసంగా గెలిచాడు. సోమవారం జరిగే ఫైనల్లో డానియెల్‌ బెథెల్‌ (గ్రేట్‌ బ్రిటన్‌)తో నితేశ్‌ తలపడతాడు. ఫైనల్లో ఓడినా అతనికి కనీసం రజతం దక్కుతుంది. ఐఐటీ మండి గ్రాడ్యుయేట్‌ అయిన 29 ఏళ్ల నితేశ్‌కు పారాలింపిక్స్‌లో ఇదే తొలి పతకం కానుంది. కాగా, టోక్యో పారాగేమ్స్‌లో ఇదే విభాగం నుంచి ప్రమోద్‌ భగత్‌ స్వర్ణం గెలిచాడు. అలాగే ఎస్‌ఎల్‌4 కేటగిరీలో జరిగిన మరో సెమీఫైనల్స్‌లో సుహాస్‌ యతిరాజ్‌ తన సహచర షట్లర్‌ సుకాంత్‌ కదమ్‌పై 21-17, 21-12 తేడాతో గెలిచాడు. యూపీ ఐఏఎస్‌ అధికారిగా ఉన్న సుహాస్‌ ఖాతాలో మరో పారాలింపిక్‌ మెడల్‌ చేరనుంది. టోక్యో గేమ్స్‌లో తను రజతం సాధించిన విషయం తెలిసిందే. ఇక, మహిళల సింగిల్స్‌ ఎస్‌యూ 5 విభాగంలోనూ ఇద్దరు భారత షట్లర్లు మనీషా రామదాసు, తులసిమతి మురుగేశన్‌ అమీతుమీ తేల్చుకోనున్నారు. తులసిమతి శనివారమే ఫైనల్‌ చేరగా.. ఆదివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 19 ఏళ్ల మనీషా 21-13, 21-16 తేడాతో మమికో టోయోడా (జపాన్‌)ను ఓడించింది. మనీషా, తులసిమతి సెమీస్‌ పోరుతో కనీసం మరో రజతం భారత్‌ ఖాతాలో పడనుంది. అలాగే మహిళల సింగిల్స్‌ వ్యక్తిగత విభాగం ఎస్‌హెచ్‌6 సెమీ ఫైనల్లో నిత్యశ్రీ సివాన్‌ 13-21, 19-21 తేడాతో లిన్‌ షువాంగ్‌బావో (చైనా) చేతిలో ఓటమిపాలైంది. ఇక, నిత్యశ్రీ కాంస్య కోసం పోరాడనుంది. అయితే మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎస్‌హెచ్‌6 సెమీ్‌సలో భారత జంట శివరాజన్‌-నిత్యశ్రీ 21-17, 14-21, 13-21 తేడాతో అమెరికా జోడీ చేతిలో ఓడింది. ఈ ద్వయం కాంస్య పతకం కోసం తలపడనుంది. మహిళల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3లో మన్‌దీ్‌ప కౌర్‌, ఎస్‌ఎల్‌ 4లో పాలక్‌ కోహ్లీ పోరు క్వార్టర్స్‌లోనే ముగిసింది.


షూటింగ్‌లో గురి తప్పింది: పారాగేమ్స్‌లో ఇప్పటికే నాలుగు పతకాలతో అదరగొట్టిన షూటర్లు ఆదివారం మాత్రం తమ లక్ష్యానికి దూరంగా ఉండిపోయారు. ఇదివరకే వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన అవనీ లేఖారా, మిక్స్‌డ్‌ ఈవెం ట్‌లో నిరాశపరిచింది. అవని, సిద్దార్థ బాబు ద్వయం మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌1లో ఫైనల్‌ చేరడంలో విఫలమైంది. క్వాలిఫికేషన్‌లో అవని 632.8 పాయింట్లతో 11వ స్థానం, సిద్దార్థ 628.3 పాయింట్లతో 28వ స్థానంలో నిలిచారు. అలాగే మిక్స్‌డ్‌ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌2 క్వాలిఫికేషన్‌లో షూటర్‌ శ్రీహర్ష దేవరడ్డి 26వ స్థానంలో నిలవడంతో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.


5-spr.jpg

పాయింట్‌ తేడాతో కాంస్యం చేజారె..

వరల్డ్‌ నెంబర్‌వన్‌, భారత ఆర్చర్‌ రాకేశ్‌ కుమార్‌ పారాలింపిక్స్‌లో తృటిలో కాంస్య పతకం చేజార్చుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల కాంపౌండ్‌ ఓపెన్‌ కేటగిరీ కాంస్య పతక పోరులో రాకేశ్‌ 146-147 తేడాతో హి జిహావో (చైనా) చేతిలో ఓడాడు. అంతకుముందు సెమీస్‌లో రాకేశ్‌ 143-145తో చైనాకు చెందిన జిన్‌ లియాంగ్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే ప్రీక్వార్టర్స్‌, క్వార్టర్స్‌లో స్కోర్లు సమమైనా షూటాఫ్‌లో గట్టెక్కాడు.


6-spr.jpg

రవి రాణించినా..

అథ్లెటిక్స్‌, రోయింగ్‌, షూటింగ్‌లో భారత్‌కు చేదు ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌40 ఫైనల్స్‌లో తెలుగు అథ్లెట్‌ రవి రొంగలి ఇనుప గుండును 10.63 మీటర్ల దూరం విసిరి తన అత్యుత్తమ ప్రదర్శన చూపాడు. కానీ ఓవరాల్‌గా అతను ఐదో స్థానంలో నిలవడంతో పతకం దూరమైంది. గతేడాది ఆసియా పారాగేమ్స్‌లో రవి రజతం అందుకున్నాడు. ఇక రోయింగ్‌ పీఆర్‌3 మిక్స్‌డ్‌ డబుల్‌ స్కల్స్‌ ఫైనల్‌ బి రెపిచేజ్‌లో మరో తెలుగు అథ్లెట్‌ నారాయణ-అనిత జోడీ 8 నిమిషాల 16.96 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ పోటీ 7 నుంచి 12 స్థానాల కోసం కావడంతో వీరు మొత్తంగా ఎనిమిదో ప్లేస్‌తో తమ ప్రస్థానాన్ని ముగించారు. మహిళల 1500 మీటర్ల టీ11 హీట్‌3 తొలి రౌండ్‌లో రక్షిత రాజు 5 నిమిషాల 29.92 సెకన్ల టైమింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచి వెనుదిరిగింది. ప్రతీ హీట్‌ నుంచి టాప్‌-2 ప్లేయర్స్‌ మాత్రమే ఫైనల్‌ వెళతారు.

Updated Date - Sep 02 , 2024 | 04:54 AM