సన్‌రైజర్స్ అదే జోరు
ABN , Publish Date - Apr 06 , 2024 | 03:57 AM
క్రితం మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఉప్పల్‌లో పరుగుల సునామీ సృష్టించగా.. ఈసారి బౌలర్లు మెరిశారు. సమష్ఠి రాణింపుతో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఓపెనర్ అభిషేక్
అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
మార్‌క్రమ్ హాఫ్ సెంచరీ
చెన్నై సూపర్‌కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం
ఉప్పల్‌లో తగ్గేదేలె..
రాణించిన బౌలర్లు
అదరగొట్టిన అభిషేక్, మార్‌క్రమ్
చెన్నైపై సన్‌రైజర్స్ విజయం
హైదరాబాద్: క్రితం మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఉప్పల్‌లో పరుగుల సునామీ సృష్టించగా.. ఈసారి బౌలర్లు మెరిశారు. సమష్ఠి రాణింపుతో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ (12 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 37) మెరుపు ఆరంభం ఇవ్వగా.. మధ్య ఓవర్లలో మార్‌క్రమ్ (36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 50) చెలరేగాడు. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. శివమ్ దూబే (24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45), రహానె (30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 35), జడేజా (23 బంతుల్లో 4 ఫోర్లతో 31 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత ఛేదనలో హైదరాబాద్ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ట్రావిస్ హెడ్ (31) రాణించాడు. మొయిన్ అలీకి రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా అభిషేక్ నిలిచాడు.
మెరుపు వేగంతో..: ఓ మాదిరి ఛేదన కోసం బరిలోకి దిగిన హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్ అభిషేక్ శర్మ టాప్‌గేర్‌లో తీసుకెళ్లాడు. అటు తమ కీలక పేసర్లు ముస్తాఫిజుర్, పథిరన లేకుండానే బరిలోకి దిగిన చెన్నై బౌలింగ్ బలహీనంగా కనిపించింది. దీంతో పవర్‌ప్లేలో 78 పరుగులతో ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో మొయిన్ అలీ అందుకోలేకపోయాడు. ఇక రెండో ఓవర్‌లో శివాలెత్తిన అభిషేక్ 4,6,6,6,4తో 27 పరుగులతో అదరగొట్టాడు. అయితే మూడో ఓవర్‌లో అతడిని చాహర్ అవుట్ చేయగా తొలి వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. హెడ్, మార్‌క్రమ్ పోటాపోటీ బౌండరీలతో కదం తొక్కారు. పవర్‌ప్లే అయ్యాక స్పిన్నర్లు ప్రభావం చూపడంతో పరుగుల వేగం కాస్త తగ్గింది. పదో ఓవర్‌లో హెడ్‌ను జడేజా అవుట్ చేసి రెండో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యానికి తెర దించాడు. 11-15 ఓవర్ల మధ్య ఒక్క ఫోర్ కూడా రాకపోవడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొంది. ఫిఫ్టీ పూర్తి చేసిన మార్‌క్రమ్‌ను, షాబాజ్ (18)ను మొయిన్ అలీ వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. ఈ స్థితిలో గెలుపు సమీకరణం 26 బంతుల్లో 25 రన్స్‌కి మారింది. కానీ క్లాసెన్ (10 నాటౌట్), తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ (14 నాటౌట్) చెరో ఫోర్‌తో తేలిక చేశారు. అలాగే 19వ ఓవర్ తొలి బంతికే చక్కటి సిక్సర్‌తో నితీశ్ మ్యాచ్‌ను ముగించాడు.
సీఎస్‌కే తడ‘బ్యాటు’: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆట నిదానంగా సాగింది. క్రితం మ్యాచ్‌లో 500కు పైగా పరుగులు నమోదైన పిచ్ కాకుండా.. ఈ మ్యాచ్ ఇతర పిచ్‌పై సాగింది. ఈ స్లో పిచ్‌పై బ్యాటర్లు పరుగుల కోసం ఇబ్బందిపడ్డారు. శివమ్ దూబే ఒక్కడే స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించాడు. తొలి ఓవర్‌నే స్పిన్నర్ అభిషేక్‌తో వేయించగా.. పేసర్ భువనేశ్వర్ ఈసారి లైన్ అండ్ లెంగ్త్ బాల్స్‌తో కట్టడి చేశాడు. దీంతో ఓపెనర్ రచిన్ రవీంద్ర (12) నాలుగో ఓవర్‌లోనే భువీకి చిక్కాడు. అయితే ఐదో ఓవర్‌లో రహానె సిక్సర్.. ఆరో ఓవర్‌లో రుతురాజ్ 4,6తో పవర్‌ప్లేలో జట్టు స్కోరు 48కి చేరింది. ఇక షాబాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లిన రుతురాజ్ లాంగాన్‌లో క్యాచ్ ఇచ్చాడు. శివమ్ దూబే మాత్రం అదే ఓవర్‌లో 6,4తో జోరు చూపాడు. అలాగే స్పిన్నర్ మార్కండే ఓవర్‌లోనూ 4,6తో 15 రన్స్ రాబట్టాడు. కానీ మధ్య ఓవర్లలో పేసర్లు కమిన్స్, ఉనాద్కట్ పరుగులను కట్టడి చేశారు. రహానె హిట్టింగ్ చేయలేకపోయాడు. అటు నటరాజన్‌ను లక్ష్యంగా చేసుకుని దూబే రెండు వరుస సిక్సర్లు బాది 12వ ఓవర్‌లో స్కోరును వంద దాటించాడు. ఈ జోరు ఎక్కువసేపు కొనసాగకుండా దూబేను కమిన్స్ వెనక్కిపంపగా, తర్వాతి ఓవర్‌లోనే రహానెను ఉనాద్కట్ అవుట్ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక జడేజా-మిచెల్ క్రీజులో ఉన్నా తక్కువ ఎత్తులో వచ్చిన బంతులను ఆడేందుకు వీరు ఇబ్బందిపడ్డారు. దీంతో 14-17 ఓవర్ల మధ్య రెండు ఫోర్లు మాత్రమే వచ్చాయి. 18వ ఓవర్‌లో చెరో ఫోర్‌తో 13 రన్స్ రాగా.. ఇక చివరి రెండు ఓవర్లలోనూ జట్టు పరుగులు రాబట్టలేకపోయింది. ఆఖరి ఓవర్‌లో మూడో బంతికి డారిల్ మిచెల్ (13) వెనుదిరగగా.. ఉప్పల్‌లో అభిమానుల జోష్ మధ్య ధోనీ (1 నాటౌట్) మూడు బంతుల కోసం బరిలోకి దిగాడు. కానీ పేసర్ నటరాజన్ స్లో బంతులకు ధోనీ భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఆఖరి బంతిని జడేజా ఫోర్‌గా మలచడంతో ఏడు పరుగులు లభించాయి.
స్కోరుబోర్డు
చెన్నై: రచిన్ (సి) మార్‌క్రమ్ (బి) భువనేశ్వర్ 12, రుతురాజ్ (సి) సమద్ (బి) షాబాజ్ 26, రహానె (సి) మార్కండే (బి) ఉనాద్కట్ 35, దూబే (సి) భువనేశ్వర్ (బి) కమిన్స్ 45, జడేజా (నాటౌట్) 31, మిచెల్ (సి) సమద్ (బి) నటరాజన్ 13, ధోనీ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 165/5; వికెట్ల పతనం: 1/25, 2/54, 3/119, 4/127, 5/160; బౌలింగ్: అభిషేక్ 1-0-7-0, భువనేశ్వర్ 4-0-28-1, నటరాజన్ 4-0-39-1, కమిన్స్ 4-0-29-1, మయాంక్ మార్కండే 2-0-21-0, షాబాజ్ అహ్మద్ 1-0-11-1, ఉనాద్కట్ 4-0-29-1
హైదరాబాద్: హెడ్ (సి) రచిన్ (బి) తీక్షణ 31, అభిషేక్ (సి) జడేజా (బి) దీపక్ 37, మార్‌క్రమ్ (ఎల్బీ) మొయిన్ 50, షాబాజ్ (ఎల్బీ) మొయిన్ 18, క్లాసెన్ (నాటౌట్) 10, నితీశ్ (నాటౌట్) 14, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 18.1 ఓవర్లలో 166/4; వికెట్ల పతనం: 1/46, 2/106, 3/132, 4/141; బౌలింగ్: దీపక్ చాహర్ 3.1-0-32-1, ముకేశ్ చౌధరి 1-0-27-0, తీక్షణ 4-0-27-1, తుషార్ 2-0-20-0, జడేజా 4-0-30-0, మొయిన్ అలీ 3-0-23-2, రచిన్ 1-0-3-0.