Share News

Sunrisers Hyderabad: హిస్టారికల్.. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు

ABN , Publish Date - Apr 15 , 2024 | 09:59 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 287 పరుగులు చేసి, ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చారిత్రాత్మక రికార్డ్‌ని నమోదు చేసింది.

Sunrisers Hyderabad: హిస్టారికల్.. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (Indian Premiere League) సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (Royal Challengers Bengaluru) జరిగిన మ్యాచ్‌లో 287 పరుగులు చేసి, ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చారిత్రాత్మక రికార్డ్‌ని నమోదు చేసింది. ఇంతకుముందు ఇదే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై (Mumbai Indians) 277 పరుగులు చేసి హయ్యస్ట్ టోటల్ సాధించిన సన్‌రైజర్స్.. ఇప్పుడు మరో పది పరుగుల తేడాతో (287) తన రికార్డ్‌ని తానే బద్దలుకొట్టుకుంది. ట్రావిస్ హెడ్ (102) సెంచరీతో శివాలెత్తడం.. క్లాసెన్ (67), సమద్ (37), అభిషేక్ (34), మార్క్‌రమ్ (32) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. సన్‌రైజర్స్ ఈ రికార్డ్‌ని తన పేరిట లిఖించుకుంది.

చరిత్ర సృష్టించిన ధోనీ.. ఆ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్


తొలుత ఓపెనర్లుగా వచ్చిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్.. తమ జట్టుకి అద్భుత శుభారంభాన్ని అందించారు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే వీళ్లిద్దరు ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఎడాపెడా షాట్లతో బౌండరీల మీద బౌండరీలు బాదారు. ముఖ్యంగా.. ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆర్సీబీ బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 39 బంతుల్లోనే శతకం చేశాడంటే.. అతడు ఏ రేంజ్‌లో ఊచకోత కోశాడో అర్థం చేసుకోవచ్చు. కేవలం 8.1 ఓవర్లలోనే వీళ్లిద్దరు తొలి వికెట్‌కి 108 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అభిషేక్ ఔట్ అయ్యాక వచ్చిన క్లాసెన్ సైతం.. మాస్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టేశాడు. మొదట్లో కొంచెం నిదానంగా ఆడినా.. క్రీజులో కుదురుకున్నాక సింహంలా జూలు విదల్చడం మొదలుపెట్టాడు. 31 బంతుల్లోనే 67 పరుగులతో సత్తా చాటాడు.

ధోనీ హ్యాట్రిక్ సిక్సుల మోత.. మైదానంలో నేహా ధూపియా కేరింత

అనంతరం మార్క్‌రమ్, అబ్దుల్ సమద్ కూడా తాండవం చేశారు. మరీ ముఖ్యంగా.. సమద్ పూనకం వచ్చినట్లు బౌండరీల వర్షం కురిపించాడు. క్రీజులోకి వచ్చి రావడంతోనే తన బ్యాట్‌కి పని చెప్పాడు. దీంతో.. 10 బంతుల్లోనే అతడు 4 ఫోర్లు, 3 సిక్సుల సహకారంతో 37 పరుగులు చేశాడు. నిదానంగా ఆడుతాడని ఇన్నాళ్లు తనని విమర్శించిన వారిని.. ఈ ఇన్నింగ్స్‌తో సమద్ నోరు మూయించేశాడు. అటు.. ట్రావిస్ ఔట్ అయ్యాక మార్క్‌రమ్ క్రీజులోకి వచ్చి చాలాసేపే అయినా, క్లాసెన్ ఉన్నంతవరకూ అతనికి ఆడే ఛాన్స్ దక్కలేదు. క్లాసెన్ పోయాక.. సమద్ ఊచకోత చూసి అతడూ చెలరేగిపోయాడు. 17 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. ఇలా బ్యాటర్లందరూ సమిష్టిగా మెరుపులు మెరిపించడం వల్లే.. సన్‌రైజర్స్ 287 పరుగులతో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చరిత్రపుటలకెక్కింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 15 , 2024 | 10:03 PM