India U-19 Women : ఆయుషి అదరహో
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:20 AM
టోర్నీలో అప్రతిహత విజయాలతో జోరు కొనసాగిస్తున్న భారత జట్టు అండర్-19 మహిళల టీ20 ఆసియా కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. టీనేజ్ లెఫ్టామ్ స్పిన్నర్ ఆయుషి శుక్లా (4/10) తిప్పేసిన వేళ చివరి సూపర్-4 మ్యాచ్‌లో
ఫైనల్లో యువ భారత్ శ్రీలంకపై గెలుపు
బంగ్లాతో తుదిపోరు రేపు
అండర్-19 ఆసియా కప్
సింగపూర్: టోర్నీలో అప్రతిహత విజయాలతో జోరు కొనసాగిస్తున్న భారత జట్టు అండర్-19 మహిళల టీ20 ఆసియా కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. టీనేజ్ లెఫ్టామ్ స్పిన్నర్ ఆయుషి శుక్లా (4/10) తిప్పేసిన వేళ చివరి సూపర్-4 మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్లతో శ్రీలంకను చిత్తు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో..తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 98/9 స్కోరే చేసింది. కెప్టెన్ మనుది ననయకర (33), సముదు నిసంసల (21) మాత్రమే రాణించారు. మరో స్పిన్నర్ పరునిక సిసోడియా 2 వికెట్లు పడగొట్టింది. స్వల్ప ఛేదనను భారత్ 14.5 ఓవర్లలో 102/6 స్కోరుతో ముగించింది. త్రిష (32), కమలిని (28) సత్తా చాటారు. ఆయుషి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో బంగ్లాదేశ్‌తో మన అమ్మాయిలు అమీతుమీ తేల్చుకోనున్నారు.
స్పిన్‌కు విలవిల: టాస్ కోల్పోయి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక..ఆయుషి, పరునిక స్పిన్ బౌలింగ్‌కు ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఇద్దరు బ్యాటర్లే రెండంకెల స్కోరు చేశారు. శ్రీలంక ఓపెనర్లు సంజన (9), హన్సిక (2) కేవలం 12 బంతులే ఆడగలిగారు. ననయకర, నిసంసల ఐదో వికెట్‌కు చేసిన 22 పరుగులే లంక జట్టులో అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. వీరిద్దరి చలువతో లంక మెరుగైన స్కోరుకు చేస్తుందనిపించింది. కానీ నిసంసల రనౌటవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.
త్రిష మళ్లీ..: స్వల్ప ఛేదనలో భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఈశ్వరి (0) మూడో బంతికే రనౌటైంది. సనిక (4) కూడా విఫలమవడంతో భారత్ 5/2తో ఇక్కట్లలో పడింది. అయితే బంగ్లాతో గతమ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన తెలుగు బ్యాటర్ త్రిష, మరో ఓపెనర్ కమలినితో కలిసి పరిస్థితి చక్కదిద్దింది. ఈ జోడీ రెండో వికెట్‌కు 63రన్స్ జోడించడంతో భారత్ సులువుగా లక్ష్యాన్ని చేరింది. మరో సూపర్-4 పోరులో బంగ్లాదేశ్ 9 వికెట్లతో నేపాల్‌ను ఓడించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 11ఓవర్లకు కుదించారు. తొలుత నేపాల్ 11 ఓవర్లలో 54/8 స్కోరు చేసింది. అనంతరం బంగ్లా9.5 ఓవర్లలో 58/1 స్కోరు చేసి గెలిచింది.
సంక్షిప్తస్కోర్లు
శ్రీలంక: 20 ఓవర్లలో 98/9 (మనుది 33, నిసంసల 21, ఆయుషి శుక్లా 4/10, పరునిక 2/27).
భారత్: 14.5 ఓవర్లలో 102/6 (త్రిష 32, కమలిని 28, మిథిల నాటౌట్ 17, ప్రబోద 3/16, షషిణి 2/18).