Share News

T20 World Cup final : ఈసారి వదలొద్దు!

ABN , Publish Date - Jun 29 , 2024 | 05:37 AM

టీ20 ప్రపంచక్‌పలో విశ్వ విజేతను తేల్చే అంతిమ సమరానికి వేళైంది. రెండో టైటిల్‌ కోసం టీమిండియా.. తొలి ట్రోఫీ కోసం దక్షిణాఫ్రికా శనివారం జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఈ మెగా టోర్నీ చరిత్రలో ఒక్క మ్యాచ్‌ కూడా

T20 World Cup final : ఈసారి వదలొద్దు!

రాత్రి 8 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌, హాట్‌స్టార్‌లో..

జోరుమీదున్న భారత్‌

తొలి కప్పు వేటలో దక్షిణాఫ్రికా

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడు

జట్టులో స్టార్‌ ఆటగాళ్లకు కొదువలేదు..

ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ మనోళ్లదే హవా.. కానీ

ఓ వరల్డ్‌కప్‌ను ముద్దాడి ఎన్నేళ్లవుతుంది? ఒకటా.. రెండా.. పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచకప్‌ గెలిచి 17 ఏళ్లయ్యింది.. ఇక భారత్‌ వన్డేల్లో విశ్వకప్‌ గెలిచి 13 ఏళ్లు. మధ్యలో ఈ రెండు టైటిల్స్‌ను గెలిచే చాన్స్‌ రెండుసార్లు వచ్చినా దురదృష్టం వెంటాడింది. కోట్లాదిమంది అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్‌ను సగర్వంగా అందుకునేందుకు మరో సువర్ణావకాశం ముందుంది.. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితిల్లోనూ టైటిల్‌ పట్టేయాలని రోహిత్‌ సేన పట్టుదలగా ఉంది.. అటు చోకర్స్‌గా ముద్రపడిన దక్షిణాఫ్రికా అంచనాలకు మించిన ఆటతీరుతో తొలి వరల్డ్‌ కప్‌ టైటిల్‌ కోసం సై అంటోంది.. మరి, అజేయంగా దూసుకొచ్చిన ఈ రెండు జట్లలో చాంపియన్‌గా నిలిచేది ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.

బ్రిడ్జిటౌన్‌: టీ20 ప్రపంచక్‌పలో విశ్వ విజేతను తేల్చే అంతిమ సమరానికి వేళైంది. రెండో టైటిల్‌ కోసం టీమిండియా.. తొలి ట్రోఫీ కోసం దక్షిణాఫ్రికా శనివారం జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఈ మెగా టోర్నీ చరిత్రలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా రెండు జట్లు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ఈనేపథ్యంలో తుదిపోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2007 ఆరంభ టీ20 ప్రపంచకప్‌ గెలిచాక భారత జట్టు ఈ ఫార్మాట్‌లో మరోసారి విజేత కాలేకపోయింది. అలాగే 2011లో వన్డే వరల్డ్‌కప్‌ గెలిచి, గతేడాది అజేయంగా ఫైనల్‌కు చేరినా నిరాశే ఎదురైంది. అందుకే ఈ రెండు ఫార్మాట్లలో సుదీర్ఘ ఎదురుచూపులకు తెరదించాలన్న కసితో రోహిత్‌ సేన ఉంది. మరోవైపు ఏ ప్రపంచక్‌పలోనైనా సఫారీలు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ఐదుసార్లు వన్డే, రెండుసార్లు టీ20 వరల్డ్‌క్‌పల్లో సెమీస్‌ వరకు చేరి వెనుదిరిగారు. అందుకే మార్‌క్రమ్‌ సేనకు కూడా ఈ పోరు అత్యంత కీలకంగా మారింది.

బౌలింగ్‌ పవర్‌తో..

సఫారీలు ఈస్థాయి ప్రదర్శనతో ఫైనల్‌దాకా వస్తారని నిజంగా ఎవరూ ఊహించలేదేమో. భారత్‌ మాదిరి కాకుండా ఈ జట్టుకు గ్రూప్‌, సూపర్‌-8లో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా గతంలో మాదిరి కాకుండా ఒత్తిడిని దరిజేరనీకుండా గట్టెక్కగలిగారు. నేపాల్‌లాంటి పసికూనపై ఒక్క పరుగుతో ఆఖరి బంతికి గెలిచారు. ఓవరాల్‌గా వీరి విజయాల్లో బౌలర్ల పాత్ర కీలకమని చెప్పవచ్చు. టోర్నీ టాప్‌-5 బ్యాటర్లలో ఒక్క సఫారీ బ్యాటర్‌ కూడా లేకపోవడం గమనార్హం. డికాక్‌ (204) ఫర్వాలేదనిపిస్తున్నాడు. కానీ మార్‌క్రమ్‌, క్లాసెన్‌, మిల్లర్‌, స్టబ్స్‌లలో ఒక్కరు నిలదొక్కుకున్నా భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. మరోవైపు పేసర్లు నోకియా (13), రబాడ (12), స్పిన్నర్‌ షంసీ (11) ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. అలాగే కీలక సెమీస్‌ పోరులో దూకుడు మీదున్న అఫ్ఘాన్‌ను కేవలం 56 పరుగులకే కట్టడి చేసిన విషయం తెలిసిందే. ఇక నేటి ఫైనల్లో స్టార్లతో కూడిన భారత బ్యాటింగ్‌ లైన్‌పను వీరు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే సఫారీల విజయం ఆధారపడి ఉంటుంది.


అన్ని విభాగాల్లోనూ అదుర్స్‌

వాస్తవానికి భారత జట్టుకు ఈ మెగా టోర్నీ నల్లేరు మీద నడకలా సాగుతోంది. గ్రూప్‌ దశలోనే కాదు.. సూపర్‌-8, సెమీ్‌సలోనూ పాక్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లపై అసలు పోటీ అనేదే లేకుండా వరుసగా ఏడు విజయాలతో ఫైనల్‌కు చేరింది. కెనడాతో మ్యాచ్‌ వర్షంతో రద్దయ్యింది. ఈ మ్యాచ్‌ల్లో పిచ్‌ను పరిస్థితి బట్టి స్వల్ప స్కోర్లు నమోదైనా.. బౌలర్లు విజృంభించారు. పేసర్లు, స్పిన్నర్లు కలిసికట్టుగా కదం తొక్కుతూ గత వరల్డ్‌క్‌పల్లో పరాభవాలకు ఆసీస్‌, ఇంగ్లండ్‌ జట్లపై బదులు తీర్చుకుంటూ భారత్‌ ముందుకెళ్లింది. కెప్టెన్‌ రోహిత్‌ తన సమర్థ నాయకత్వానికి తోడు బ్యాటింగ్‌లోనూ రఫ్ఫాడిస్తున్నాడు. ఇప్పటికే 248 పరుగులతో ఉన్న తను మరో 33 రన్స్‌ చేస్తే టోర్నీ టాపర్‌గా నిలుస్తాడు. ఇక సూర్యకుమార్‌ తన సహజశైలిని కొనసాగిస్తుండగా హార్దిక్‌ ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకుంటున్నాడు. పంత్‌ ధనాధన్‌ ఆటతో సాగుతున్నాడు. బ్యాటింగ్‌ విభాగంలో ఓపెనర్‌గా కోహ్లీ, మిడిలార్డర్‌లో దూబే మాత్రమే బలహీనంగా కనిపిస్తున్నారు. ఐపీఎల్‌లో విరుచుకుపడిన ఈ ఇద్దరూ అనూహ్యంగా ఇక్కడ మాత్రం నిరాశపరుస్తున్నారు. అయినా తుది పోరులో విరాట్‌ తన మార్క్‌ ఆటను చూపుతాడని జట్టుతో పాటు ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దూబేను ఆడిస్తారా? శాంసన్‌, జైస్వాల్‌లలో ఒకరికి చోటిస్తారా? అనేది వేచిచూడాల్సిందే. బౌలింగ్‌లో మాత్రం స్పిన్నర్లు కుల్దీప్‌, అక్షర్‌ అదరహో అనిపిస్తున్నారు. జడేజా పరుగులను నియంత్రిస్తుండగా.. పేసర్లు అర్ష్‌దీప్‌ 15 వికెట్లతో బుమ్రా 13 వికెట్లతో టాప్‌ ఫామ్‌తో చెలరేగుతున్నారు. తుది పోరులోనూ అన్ని విభాగాలు కదం తొక్కితే టైటిల్‌ పట్టేయడం ఖాయమే.

ఐసీసీ టోర్నమెంట్‌ ఫైనల్లో భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు తలపడడం ఇదే తొలిసారి.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), విరాట్‌, పంత్‌, సూర్యకుమార్‌, శివమ్‌ దూబే, హార్దిక్‌ పాండ్యా, జడేజా, అక్షర్‌, కుల్దీప్‌, బుమ్రా, అర్ష్‌దీప్‌.

దక్షిణాఫ్రికా: డికాక్‌, హెన్‌డ్రిక్స్‌, మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), క్లాసెన్‌, మిల్లర్‌, స్టబ్స్‌, జాన్సెన్‌, కేశవ్‌, రబాడ, నోకియా, షంసీ.

వర్షం ఖాయమేనట..

కరీబియన్‌ దీవుల్లో ఇది వర్షాకాలం. కాబట్టి మ్యాచ్‌ రోజుతో పాటు రిజర్వ్‌ డే అయిన ఆది వారం కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. శనివారం ఆకాశం దట్టమైన మేఘాలతో ఉండనుంది. అలాగే వర్షానికి 78 శాతం అవకాశం ఉంది. బలమైన గాలులకు ఆస్కారం. అయితే 190 నిమిషాల అదనపు సమయం ఉంది కాబట్టి మ్యాచ్‌కు ఇబ్బంది ఉండకపోవచ్చు. విజేతను తేల్చేందుకు పది ఓవర్ల మ్యాచ్‌ సరిపోతుంది. అదీ వీలు కాకపోతే రిజర్వ్‌డే ఉండనే ఉంది. ఒకవేళ రిజర్వ్‌డే రోజు కూడా మ్యాచ్‌ జరగకపోతే ఇరు జట్లు సంయుక్త విజేతలుగా నిలుస్తాయి.

Updated Date - Jun 29 , 2024 | 07:08 AM