Share News

టీమిండియా మాజీ పేసర్‌ జాన్సన్‌ అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Jun 21 , 2024 | 01:52 AM

భారత జట్టు మాజీ పేసర్‌ డేవిడ్‌ జాన్సన్‌ (52) అనుమానాస్పద పరిస్థితుల్లో గురువారం మరణించాడు. కొత్తనూరులోని కనకశ్రీ లేఅవుట్‌లో తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్థు బాల్కనీనుంచి...

టీమిండియా మాజీ పేసర్‌ జాన్సన్‌ అనుమానాస్పద మృతి

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): భారత జట్టు మాజీ పేసర్‌ డేవిడ్‌ జాన్సన్‌ (52) అనుమానాస్పద పరిస్థితుల్లో గురువారం మరణించాడు. కొత్తనూరులోని కనకశ్రీ లేఅవుట్‌లో తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్థు బాల్కనీనుంచి కిందపడి మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే అతడు ఆత్మహత్య చేసుకొన్నాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. జాన్సన్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జాన్సన్‌ గతవారం కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది. జాన్సన్‌ తన ఇంటికి సమీపంలో ఓ క్రికెట్‌ కోచింగ్‌ సెంటర్‌ నడుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే అది సరిగా నడవకపోవడంతో ఆర్థిక సమస్యలు ఏర్పడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్న అతడు డీ అడిక్షన్‌ కేంద్రంలో చికిత్స కూడా తీసుకుంటున్నట్టు ఓ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.


భారత్‌ తరపున రెండు టెస్టులాడాడు. 1996లో ఢిల్లీలో ఆస్ట్రేలియాపై టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. అందులో ఓ వికెట్‌ సాధించాడు. అనంతరం సౌతాఫ్రికాలో ఆ జట్టుపై తన రెండో టెస్ట్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. జాన్సన్‌ మృతికి బీసీసీఐ కార్యదర్శి జైషా, అనిల్‌ కుంబ్లే, గౌతమ్‌ గంభీర్‌ సంతాపం తెలిపారు.

Updated Date - Jun 21 , 2024 | 01:52 AM