Share News

Tejashvi Yadav: కోహ్లీ పేరు ప్రస్తావించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్

ABN , Publish Date - Sep 15 , 2024 | 04:12 PM

బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన క్రికెట్ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒకప్పుడు తన కెప్టెన్సీలో ఆడాడని చెప్పారు.

Tejashvi Yadav: కోహ్లీ పేరు ప్రస్తావించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్
Virat Kohli Tejaswiyadav

బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన క్రికెట్ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒకప్పుడు తన కెప్టెన్సీలో ఆడాడని చెప్పారు. దేశవాళీ క్రికెట్ ఆడుతున్నప్పుడు స్టార్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తనను పూర్తిగా మరచిపోవడం పట్ల తేజశ్వి యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత భారత క్రికెట్ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు తన బ్యాచ్‌మేట్స్ అని కూడా ఆయన వివరించారు.


‘‘నేను క్రికెటర్‌ని. ఆ విషయం గురించి ఎవరూ మాట్లాడరు. విరాట్ కోహ్లీ నా కెప్టెన్సీలో ఆడాడు. దాని గురించి ఎవరైనా మాట్లాడారా?. ఎందుకు అలా చేయరు?. ఒక ప్రొఫెషనల్‌గా నేను బాగా క్రికెట్ ఆడాను. చాలా మంది టీమ్ ఇండియా ఆటగాళ్లు నా బ్యాచ్‌మేట్స్. రెండు లిగమెంట్లు ఫ్రాక్చర్ అవడంతో క్రికెట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది’’ అని జీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా తేజశ్వి యాదవ్ చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై క్రికెట్ అభిమానులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


కాగా తేజస్వి యాదవ్ క్రికెట్ కెరీర్ పరంగా చూస్తే 1 ఫస్ట్ క్లాస్, 2 లిస్ట్-ఏ, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో ర్ఖండ్‌ జట్టుకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. నవంబర్ 2009లో విదర్భ జట్టుపై మ్యాచ్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. రెండు లిస్ట్ ఏ మ్యాచ్‌ల విషయానికి వస్తే ఫిబ్రవరి 2010లో త్రిపురపై, ఒడిశా జట్లపై ఆడాడు. ఇక నాలుగు టీ20 మ్యాచ్‌లు ధన్‌బాద్‌లో ఒడిశా, అసోం, బెంగాల్, త్రిపుర జట్లపై ఆడాడు.


ఐపీఎల్ విషయానికి వస్తే 2008 సీజన్‌లో తేజస్విని ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) కొనుగోలు చేసుకుంది. అయితే ఈ విషయం పెద్ద ఎవరికీ తెలియదు. అయితే 2008 నుంచి 2012 వరకు బెంచ్‌‌కే పరిమితమయ్యాయి. ఒక్క ఆట కూడా ఆడకపోవడం గమనార్హం.

Updated Date - Sep 15 , 2024 | 04:12 PM