థాంక్యూ.. ద్రవిడ్
ABN , Publish Date - Jun 30 , 2024 | 01:55 AM
2007 వన్డే ప్రపంచకప్.. విండీ్‌సలోనే జరిగిన ఈ మెగా టోర్నీని భారత్ క్రీడాభిమానులు పొరపాటున కూడా గుర్తుంచుకోవడానికి ఇష్టపడరు.
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)
2007 వన్డే ప్రపంచకప్.. విండీ్‌సలోనే జరిగిన ఈ మెగా టోర్నీని భారత్ క్రీడాభిమానులు పొరపాటున కూడా గుర్తుంచుకోవడానికి ఇష్టపడరు. గ్రూప్ ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లా జట్లు సూపర్-8కి వెళ్లగా.. బెర్ముడాతో కలిసి భారత్ ఇంటిముఖం పట్టింది. అప్పుడు కెప్టెన్ రాహుల్ ద్రవిడ్. ఆ దారుణ పరాభవంతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ద్రవిడ్ సారథ్యం కూడా కోల్పోయాడు. సుదీర్ఘ కాలం భారత్‌కు ఆడినా అతడి ఖాతాలో ఒక్క వరల్డ్‌కప్ కూడా లేకుండానే ముగిసిపోయింది. అయితే అప్పుడు కలగానే మిగిలిన కప్‌ను.. తన అపార అనుభవంతో జట్టు కోచ్‌గా ద్రవిడ్ సాధించి చూపాడు. అంతకుముందే అండర్-19 జట్టు సైతం తన ఆధ్వర్యంలోనే వన్డే వరల్డ్‌కప్ అందుకోవడం విశేషం.
దూకుడు నేర్పాడు..
రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నప్పుడు 2021 టీ20 వరల్డ్‌క్‌పలో జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. అనంతరం ద్రవిడ్ కొత్త కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఆ పరాభవానికి కారణాలను విశ్లేషించాక ఆటతీరులో మార్పు తెచ్చాడు. సంప్రదాయ ఆటతీరుకు స్వస్తి చెప్పి మూడు ఫార్మాట్లలోనూ దూకుడుగా వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఆటగాళ్లను వెన్నంటి ప్రోత్సహిస్తూ వారి నుంచి సరైన ఆటతీరును రాబట్టాడు. వివాదాల జోలికి వెళ్లకుండా ప్రపంచ క్రికెట్‌లో జట్టు ఆధిపత్యానికి తన వంతు ప్రయత్నం చేశాడు. ఫలితంగా.. మూడు ఫార్మాట్లలోనూ జట్టు నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది. అలాగే అద్భుత ఆటతీరుతో నాలుగు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్స్‌కు చేరగలిగింది. అయితే మూడుసార్లూ తుదిమెట్టుపైనే బోల్తా పడింది. 2022 టీ20 వరల్డ్‌కప్ సెమీ్‌సలో భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో ఓడింది. 2023 వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్లో.. అదే ఏడాది వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లోనూ ఆసీస్ చేతిలోనే పరాభవం పాలైంది. కానీ నాలుగోసారి ఫైనల్‌కు చేరిన క్రమంలో కోచ్‌గా ద్రవిడ్ అనుకున్నది సాధించాడు. అపజయమన్నది లేకుండా రోహిత్ నేతృత్వంలోని టీమిండియా టీ20 వరల్డ్‌క్‌పను తమ శిక్షకుడి చేతికి అందించి సగర్వంగా సెండాఫ్ పలికేలా చేసింది. అంతకుముందు రవిశాస్త్రి శిక్షణలో భారత్ భారీ విజయాలు సాధించినా.. ఐసీసీ టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్, 2021 వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్, 2021 టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్‌కు పరాజయాలు ఎదురయ్యాయి.
కోచ్‌గా ద్రవిడ్ ప్రస్థానం
24 టెస్టుల్లో 14 గెలిచి మూడింట్లో ఓడింది.
13 వన్డే ద్వైపాక్షిక సిరీ్‌సల్లో భారత్ పదింటిని గెలుచుకుంది. అలాగే రోహిత్-ద్రవిడ్ కాంబినేషన్‌లో ఆడిన 56 మ్యాచ్‌ల్లో 41 విజయాలున్నాయి.
77 టీ20 మ్యాచ్‌ల్లో 56 గెలిచింది.