Share News

అటు పరుగులు.. ఇటు వికెట్లు

ABN , Publish Date - Oct 01 , 2024 | 04:37 AM

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు అంచనాలకు భిన్నంగా ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల ఆట మాత్రమే మిగలడంతో నిస్సారమైన డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచ్‌ రంజుగా మారింది. విజయంపై కన్నేసిన రోహిత్‌ సేన...

అటు పరుగులు.. ఇటు వికెట్లు

బంగ్లాదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌ 233

  • మోమినుల్‌ అజేయ శతకం

  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 285/9 డిక్లేర్‌

  • జైస్వాల్‌, రాహుల్‌ అర్ధసెంచరీలు

  • బంగ్లా రెండో ఇన్నింగ్స్‌ 26/2

మూడు రోజులపాటు ఎక్కడికక్కడే ఆగిపోయిన రెండో టెస్టు.. ఒక్క రోజే రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. సోమవారం నాలుగో రోజు వరుణుడు కరుణించడంతో గ్రీన్‌పార్క్‌ మైదానంలో వికెట్లు నేలకూలడంతో పాటు.. పరుగుల మోత మోగింది. దీంతో ఒక్కరోజే ఇరుజట్లు 18 వికెట్లు కోల్పోగా, ఏకంగా 437 పరుగులు నమోదయ్యాయి.

కాన్పూర్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు అంచనాలకు భిన్నంగా ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల ఆట మాత్రమే మిగలడంతో నిస్సారమైన డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచ్‌ రంజుగా మారింది. విజయంపై కన్నేసిన రోహిత్‌ సేన టీ20 తరహాలో ఆడి ఆఖరిరోజు ఆటకి అనూహ్యమైన ముగింపునిచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ముందుగా భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 233 రన్స్‌కు ఆలౌటైంది. మోమినుల్‌ హక్‌ (107 నాటౌట్‌) అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. బుమ్రాకు 3.. ఆకాశ్‌దీ్‌ప, అశ్విన్‌, సిరాజ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.


తర్వాత బరిలోకి దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 34.4 ఓవర్లలోనే 285/9 వద్ద డిక్లేర్‌ చేసింది. జైస్వాల్‌ (51 బంతుల్లో 72), రాహుల్‌ (43 బంతుల్లో 68), విరాట్‌ (35 బంతుల్లో 47), గిల్‌ (39) వేగం కనబరిచారు. దీంతో జట్టుకు 52 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆట ముగిసేసరికి బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 26/2 స్కోరు చేసింది. క్రీజులో షాద్‌మన్‌(7), మోమినుల్‌ (0) ఉన్నారు. అశ్విన్‌కు 2 వికెట్లు లభించాయి. ఆఖరిరోజు 98 ఓవర్ల ఆట ఉండడంతో.. రెండు సెషన్లలోపే బంగ్లాను కట్టడి చేయాలని భారత్‌ భావిస్తోంది.

ఏమా దూకుడు: రెండో సెషన్‌ ఆరంభమైన కాసేపటికే తొలి ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన భారత్‌లో.. వీలైనంత త్వరగా బంగ్లా స్కోరును దాటేయాలన్న ఆత్రుత కనిపించింది. బంతి పడడమే ఆలస్యం బౌండరీ బాదేసేలా అందరి ఆట సాగింది. మొత్తంగా జట్టు 8.22 రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. ఈ టీ20 తరహా ఆటను బంగ్లా బౌలర్లు ఏమాత్రం అంచనా వేయలేకపోయారు. ఓపెనర్లు జైస్వాల్‌, రోహిత్‌ (23) విరుచుకుపడిన తీరుకు వారు చేష్టలుడిగిపోయారు. రోహిత్‌ కొట్టిన ఓ సిక్సర్‌ అయితే స్టేడియంపైన పడింది. వీరి ధాటికి 18 బంతుల్లోనే 50 రన్స్‌ వచ్చాయి. అటు జైస్వాల్‌ 31 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అలాగే రెండో వికెట్‌కు గిల్‌తో కలిసి 10.1 ఓవర్లలోనే స్కోరును 100కు చేర్చాడు. అలాగే ఈ జోడీ మధ్య రెండో వికెట్‌కు 72 పరుగులు నమోదయ్యాయి. వీరి నిష్క్రమణ తర్వాత పంత్‌ (6) విఫలమైనా.. ఆఖరి సెషన్‌లో విరాట్‌, రాహుల్‌ అదరగొట్టారు. ఐదో వికెట్‌కు 87 రన్స్‌ జోడించి జట్టు ఆధిక్యానికి సహకరించారు.


స్పిన్నర్లు మెహిదీ హసన్‌, షకీబ్‌ల ధాటికి చివర్లో వికెట్లు వేగంగా నేలకూలడంతో మరో 19 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే భారత్‌ డిక్లేర్‌ చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ పట్టిన క్యాచ్‌ సింప్లీ సూపర్బ్‌. షకీబ్‌ను అవుట్‌చేసే క్రమంలో మిడాఫ్‌లో వెనక్కి వంగి ఒక్క చేత్తో ఈ క్యాచ్‌ అందుకున్నాడు. అంతకుముందు రోహిత్‌ కూడా ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకుని లిట్టన్‌దాస్‌ను పెవిలియన్‌ పంపాడు.

స్కోరుబోర్డు

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: జకీర్‌ హసన్‌ (సి) జైస్వాల్‌ (బి) ఆకాశ్‌ దీప్‌ 0; షాద్‌మన్‌ (ఎల్బీ) ఆకాశ్‌ దీప్‌ 24; మోమినుల్‌ (నాటౌట్‌) 107; షంటో (ఎల్బీ) అశ్విన్‌ 31; ముష్ఫికర్‌ (బి) బుమ్రా 11; లిట్టన్‌ (సి) రోహిత్‌ (బి) సిరాజ్‌ 13; షకీబ్‌ (సి) సిరాజ్‌ (బి) అశ్విన్‌ 9; మెహిదీ హసన్‌ (సి) గిల్‌ (బి) బుమ్రా 20; తైజుల్‌ (బి) బుమ్రా 5; హసన్‌ (ఎల్బీ) సిరాజ్‌ 1; ఖాలెద్‌ (సి అండ్‌ బి) జడేజా 0; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 74.2 ఓవర్లలో 233 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-26, 2-29, 3-80, 4-112, 5-148, 6-170, 7-224, 8-230, 9-231, 10-233. బౌలింగ్‌: బుమ్రా 18-7-50-3; సిరాజ్‌ 17-2-57-2; అశ్విన్‌ 15-1-45-2; ఆకాశ్‌ దీప్‌ 15-6-43-2; జడేజా 9.2-0-28-1.


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) హసన్‌ 72; రోహిత్‌ (బి) మిరాజ్‌ 23; గిల్‌ (సి) హసన్‌ (బి) షకీబ్‌ 39; పంత్‌ (సి) హసన్‌ (బి) షకీబ్‌ 9; విరాట్‌ (బి) షకీబ్‌ 47; రాహుల్‌ (స్టంప్‌) లిట్టన్‌ (బి) మిరాజ్‌ 68; జడేజా (సి) షంటో (బి) మిరాజ్‌ 8; అశ్విన్‌ (బి) షకీబ్‌ 1; ఆకాశ్‌ (సి) ఖాలెద్‌ (బి) మిరాజ్‌ 12; బుమ్రా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 34.4 ఓవర్లలో 285/9 డిక్లేర్‌. వికెట్ల పతనం: 1-55, 2-127, 3-141, 4-159, 5-246, 6-269, 7-272, 8-284, 9-285. బౌలింగ్‌: హసన్‌ 6-0-66-1; ఖాలెద్‌ 4-0-43-0; మిరాజ్‌ 6.4-0-41-4; తైజుల్‌ 7-0-54-0; షకీబ్‌ 11-0-78-4.

బంగ్లా రెండో ఇన్నింగ్స్‌: షాద్‌మన్‌ (నాటౌట్‌) 7; జకీర్‌ (ఎల్బీ) అశ్విన్‌ 10; హసన్‌ (బి) అశ్విన్‌ 4; మోమినుల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 11 ఓవర్లలో 26/2. వికెట్ల పతనం: 1-18, 2-26, బౌలింగ్‌: బుమ్రా 3-1-3-0, అశ్విన్‌ 5-2-14-2, ఆకాశ్‌ దీప్‌ 3-2-4-0.


బజ్‌బాల్‌ను మించేలా..

బజ్‌బాల్‌ గేమ్‌ అంటే ఇంగ్లండ్‌ గుర్తుకురావడం పరిపాటి. కానీ నాలుగోరోజు ఆటలో టీమిండియా చెలరేగిన తీరు దాన్ని మించిపోయింది. బ్యాటర్లంతా కలిసికట్టుగా ఎదురుదాడికి దిగడంతో బంగ్లా బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. ఈ క్రమంలో టెస్టు ఫార్మాట్‌లో రికార్డులు బద్దలయ్యాయి. అత్యంత వేగంగా 50 (18 బంతుల్లో), 100 (74), 200 (146), 250 (181) రన్స్‌ పూర్తి చేసిన జట్టుగా టీమిండియా అదుర్స్‌ అనిపించుకుంది.

1

ఒకే క్యాలెండర్‌ ఏడాదిలో ఎక్కువ సిక్సర్లు (90) బాదిన జట్టుగా టీమిండియా

ఓ టెస్టు ఇన్నింగ్స్‌ (200+రన్స్‌)లో అత్యధిక రన్‌రేట్‌ (8.22;భారత్‌) నమోదు కావడం ఇదే తొలిసారి.

2

తక్కువ టెస్టు (74)ల్లో 3000+ పరుగులు 300 వికెట్లు తీసినరెండో ఆటగాడిగా జడేజా. ఇయాన్‌ బోథమ్‌ (72) ముందున్నాడు.

భారత్‌లో జరిగిన టెస్టుల్లో ఒకే రోజు ఎక్కువ పరుగులు (437) నమోదు కావడం ఇది రెండోసారి. 2009లో శ్రీలంకపై భారత్‌ 470 రన్స్‌ చేసింది.

తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (594) 27 వేల పరుగుల మైలురాయిని చేరిన కోహ్లీ. ఈ క్రమంలో సచిన్‌ (623), సంగక్కర (648), పాంటింగ్‌ (650)ని దాటేశాడు. మొత్తంగా టెండూల్కర్‌ తన కెరీర్‌లో 782 ఇన్నింగ్స్‌లో 34,357 రన్స్‌ సాధించాడు.

Updated Date - Oct 01 , 2024 | 04:37 AM