సమరానికి నేడే ఆరంభం
ABN , Publish Date - Nov 25 , 2024 | 02:31 AM
అరవై నాలుగు గళ్ల ఆటలో ఆధిపత్యం ఎవరిదో తేల్చుకునేందుకు డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్, భారత యువ సంచలనం గుకేష్ సిద్ధమయ్యారు. ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో ఈ ఇద్దరు సోమవారం నుంచి...
మ. 2.30 నుంచి ఫిడే యూట్యూబ్ చానెల్‌లో..
లిరెన్‌తో గుకేష్ పోరు
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఫైనల్
ప్రపంచ చెస్ చాంపియన్‌షి్‌ప ఫైనల్ ఆరంభ సంబరాలు ముగిశాయి. ఇక అసలు సమరానికి వేళైంది. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్, చాలెంజర్ గుకేష్ విశ్వ కిరీటంకోసం 14 రౌండ్లలో తలపడనున్నారు. రెండు వారాల టోర్నీలోని తొలి రౌండ్ సోమవారం జరగనుంది. విజయానికి ఒక పాయింట్, డ్రాకు అర పాయుంట్ లభిస్తాయి. తొలుత 7.5 పాయింట్లకు చేరిన వారిని విజేతగా ప్రకటిస్తారు. 14 గేమ్‌ల తర్వాతా ఇద్దరు ఆటగాళ్ల స్కోరు సమంగా ఉంటే..
టైబ్రేకర్ ద్వారా చాంపియన్‌ను నిర్ణయిస్తారు.
సింగపూర్: అరవై నాలుగు గళ్ల ఆటలో ఆధిపత్యం ఎవరిదో తేల్చుకునేందుకు డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్, భారత యువ సంచలనం గుకేష్ సిద్ధమయ్యారు. ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో ఈ ఇద్దరు సోమవారం నుంచి తలపడనున్నారు. ప్రస్తుత ఫామ్ పరంగా చూస్తే భారత్‌కు చెందిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ గుకే్‌షనే చెస్ పండితులు తిరుగులేని ఫేవరెట్‌గా భావిస్తున్నారు. అయితే ఒత్తిడి పరిస్థితులను అతడు ఎలా ఎదుర్కొంటాడనేది కీలకమని వారు చెబుతున్నారు. 2023లో ఇయాన్ నెపోమ్నియాచి (రష్యా)తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా 32 ఏళ్ల లిరెన్ విశ్వ విజేతగా ఆవిర్భవించాడు. కానీ అప్పటినుంచి చైనా గ్రాండ్‌మాస్టర్ ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొన్నాడు. గుకే్‌షతో పోలిస్తే గత సంవత్సరం లిరెన్ చాలా తక్కువ పోటీలలో పాల్గొన్నాడు. మరోవైపు విశ్వనాథన్ ఆనంద్ (2012) తర్వాత ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి భారత ఆటగాడిగా నిలవాలని గుకేష్ పట్టుదలగా ఉన్నాడు. గత డిసెంబరులో క్యాండిడేట్స్ చెస్ టోర్నీకి క్వాలిఫై కావడం ద్వారా ప్రపంచ చెస్ చాంపియన్‌షి్‌పవైపు గుకేష్ అడుగులు పడ్డాయి.
హాట్ ఫేవరెట్లు కరువాన, నకమురాలను తలదన్ని క్యాండిడేట్స్ టోర్నమెంట్ టైటిల్ దక్కించుకోవడం ద్వారా గుకేష్ సంచలనం సృష్టించాడు. ఇటీవల బుడాపె్‌స్టలో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు స్వర్ణం గెలుచుకోవడంలో గుకేష్ కీలక భూమిక పోషించాడు. ఇక..గణాంకాల పరంగా చూసినా లిరెన్‌పై గుకే్‌షదే పైచేయి. గత నవంబరు నుంచి 37 రేటింగ్ పాయింట్లు దక్కించుకోగా, అదే సమయంలో లిరెన్ 52 పాయింట్లు కోల్పోవడం గమనార్హం.
ముఖాముఖి..
గుకే్‌ష-లిరెన్ ఇప్పటివరకు క్లాసికల్ గేమ్‌లలో మూడుసార్లు ముఖాముఖి తలపడ్డారు. ఇందులో లిరెన్ రెండుసార్లు విజయం సాధించగా, ఓ గేమ్ డ్రా అయ్యింది. చివరిసారి..ఈ ఏడాది ఆరంభంలో నెదర్లాండ్స్‌లో జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నీతోపాటు, 2023లో ఇదే టోర్నమెంట్‌లో గుకే్‌షపై నెగ్గాడు. ఇక సింక్వీఫీల్డ్ కప్ టోర్నీ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇదీ ఫార్మాట్
తొలి 40 ఎత్తులకు 120 నిమిషాలు. తదుపరి 20 ఎత్తులకు 60 నిమిషాల సమయం. తర్వాత మిగిలిన ఆటకు 15 నిమిషాలు. 61వ ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు 30 సెకన్ల అదనపు సమయం ఉంటుంది. 41వ ఎత్తుకు ముందు డ్రాకు అంగీకరించరు.