Share News

హ్యాట్రిక్‌ పతకం ఖరారు

ABN , Publish Date - Oct 10 , 2024 | 05:18 AM

ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షి్‌పలో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల జట్టు జపాన్‌తో జరిగిన సెమీ్‌సలో ఓడి కాంస్య పతకంతో నిష్క్రమించగా, పురుషుల జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించి..

హ్యాట్రిక్‌ పతకం ఖరారు

  • సెమీ్‌సలో భారత పురుషుల జట్టు

  • ఆసియా టీటీ

ఆస్తానా: ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షి్‌పలో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల జట్టు జపాన్‌తో జరిగిన సెమీ్‌సలో ఓడి కాంస్య పతకంతో నిష్క్రమించగా, పురుషుల జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కంచు పతకం ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన పురుషుల క్వార్టర్‌ఫైనల్స్‌లో భారత్‌ 3-1తో కజకిస్థాన్‌పై గెలిచింది. తొలి సింగిల్స్‌లో గెరాసిమెంకోకు మానవ్‌ ఠక్కర్‌ షాకిచ్చాడు. రెండో సింగిల్స్‌లో హర్మీత్‌ దేశాయ్‌ పరాజయం పాలయ్యాడు. ఈ దశలో శరత్‌ కమల్‌ నెగ్గడంతో భారత్‌ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో మ్యాచ్‌లో మరోసారి బరిలోకి దిగిన హర్మీత్‌ 3-2తో గెరాసిమెంకోపై నెగ్గి, భారత్‌కు సెమీస్‌ బెర్త్‌తో పాటు కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేశాడు. ఆసియా టీటీలో భారత పురుషుల జట్టు గత రెండు పోటీల్లో వరుసగా కాంస్యాలు సాధించింది.


అమ్మాయిల ఓటమి: భారత అమ్మాయిలు సెమీఫైనల్స్‌లో 1-3తో జపాన్‌ చేతిలో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు. ఆకుల శ్రీజ సెమీ్‌సలో బెంచ్‌కే పరిమితమైంది. ఐహిక ముఖర్జీ తొలి మ్యాచ్‌లో 2-3తో హరిమోటో చేతిలో ఓడింది. రెండో మ్యాచ్‌లో మనికా బాత్రా 3-0తో సత్సుకి ఓడోపై నెగ్గింది. మూడో మ్యాచ్‌లో మిమ ఐటో 3-0తో సుత్రిత ముఖర్జీపై నెగ్గింది. నాలుగో మ్యాచ్‌లో మనికా బాత్రా 1-3తో మివా చేతిలో ఓడడంతో భారత్‌ పోటీల నుంచి నిష్క్రమించింది.

Updated Date - Oct 10 , 2024 | 05:18 AM