Share News

అలా ముగించారు

ABN , Publish Date - Nov 19 , 2024 | 06:33 AM

భారత సాకర్‌ జట్టు ఈ ఏడాదిని విజయం లేకుండానే ముగించింది. సోమవారం గచ్చిబౌలిలోని స్టేడియంలో జరిగిన భారత్‌-మలేసియా స్నేహపూర్వక మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది.

అలా ముగించారు

ఒక్క గెలుపు లేకుండానే ఏడాదికి భారత్‌ వీడ్కోలు

మలేసియాతో మ్యాచ్‌ డ్రా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత సాకర్‌ జట్టు ఈ ఏడాదిని విజయం లేకుండానే ముగించింది. సోమవారం గచ్చిబౌలిలోని స్టేడియంలో జరిగిన భారత్‌-మలేసియా స్నేహపూర్వక మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. ఆట ప్రథమార్థంలో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడడంతో పోరు హోరాహోరీగా సాగింది. భారత ఆటగాళ్లు ఫారుఖ్‌ చౌధురి, సందేశ్‌, చింగిల్‌ సనా ఆరంభంలో దూకుడుగా ఆడడంతో బ్లూ టైగర్స్‌ ఆధిపత్యం కనబర్చింది. ఆట 19వ నిమిషంలో గోల్‌కీపర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధు డైరెక్ట్‌ హిట్‌ను అంచనా వేయడంలో విఫలమవడంతో మలేసియాకు సులభమైన గోల్‌ లభించింది. పౌలో జోశ్‌ చేసిన గోల్‌తో ఆ జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత పుంజుకున్న భారత్‌ తొలి అర్ధభాగం ముగిసేలోపు గోల్‌ చేసి స్కోర్లు సమం చేసింది. ప్రథమార్థం ముగుస్తుందనగా 39వ నిమిషంలో కార్నర్‌ నుంచి ఫెర్నాండెజ్‌ అందించిన పాస్‌ను రాహుల్‌ బెకు కళ్లు చెదిరే హెడర్‌తో భారత్‌కు సూపర్‌ గోల్‌ అందించాడు. దీంతో ఇరుజట్ల స్కోరు 1-1తో సమమైంది. ఇక.. ద్వితీయార్థంలో ఇరుజట్లు గోల్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. ఇంజ్యూరీ సమయంలోనూ ఇరుజట్లు మరో గోల్‌ సాధించలేకపోయాయి. దీంతో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ చివరకు డ్రాగా ముగియక తప్పలేదు.

Updated Date - Nov 19 , 2024 | 06:33 AM