రాకెట్ వీరులు మళ్లీ కొట్టారు
ABN , Publish Date - Mar 11 , 2024 | 02:45 AM
బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి మరోసారి అత్యద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ ఏడాది జరిగే ఒలింపిక్స్‌కు వేదికైన పారిస్‌లో విజయబావుటా ఎగురవేసి స్వర్ణ పతకంపై అంచనాలను పెంచేసింది..
సాత్విక్ జోడీదే ఫ్రెంచ్ ఓపెన్
రెండోసారి టైటిల్ కైవసం
పారిస్: బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి మరోసారి అత్యద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ ఏడాది జరిగే ఒలింపిక్స్‌కు వేదికైన పారిస్‌లో విజయబావుటా ఎగురవేసి స్వర్ణ పతకంపై అంచనాలను పెంచేసింది. ఈ ప్రపంచ నెంబర్‌వన్ జంట ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్‌లో డబుల్స్ చాంపియన్‌గా నిలిచి ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను దక్కించుకుంది. ఈ ఏడాది మలేసియా, ఇండియా ఓపెన్‌లలో ఫైనల్ చేరినా, రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్ జోడీ 21-11, 21-17తో చైనీస్ తైపీ ద్వయం లీ జె హుయి-యాంగ్ పో హ్సువాన్‌ను ఓడించింది. సాత్విక్ జోడీకిది రెండో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. తొలిసారిగా 2019లో ఇక్కడ రన్నరప్‌గా నిలిచిన ఈ ఏస్ జంట.. ఆ తర్వాత 2022లో విజేతగా నిలిచింది. సాత్విక్, చిరాగ్‌లకిది ఓవరాల్‌గా ఏడో వరల్డ్ టూర్ టైటిల్ (సూపర్ 300, ఆపై స్థాయి హోదా) కాగా.. రెండో సూపర్ 750 ట్రోఫీ.
అలవోకగా..: స్థాయికి తగ్గ ఆటతీరుతో చెలరేగిన సాత్విక్ జంట కేవలం 37 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. తొలి గేమ్‌ను 15 నిమిషాల్లోనే ముగించిన భారత ద్వయం.. రెండో గేమ్‌లో కళ్లు చెదిరే స్మాష్‌లు, క్రాస్ కోర్టు షాట్లతో లీ జంటను ముప్పుతిప్పలు పెట్టింది. ఆఖర్లో గేమ్ పాయింట్ సాధించే క్రమంలో చిరాగ్ అదుపు తప్పి కింద పడినా, సాత్విక్ అద్భుతంగా ఆడి లాంఛనం పూర్తి చేశాడు. పురుషుల సింగిల్స్ ఫైౖనల్లో చైనా షట్లర్ షి యుకీ 22-20, 21-19తో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ కున్లావుట్ (థాయ్‌లాండ్)కు షాకిచ్చి విజేతగా నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో అన్ సె యంగ్ (దక్షిణ కొరియా) 18-21, 21-13, 21-10తో యమగుచి (జపాన్)పై నెగ్గి ట్రోఫీ అందుకుంది.