Paris Olympics : ఆశలు ఆవిరి
ABN , Publish Date - Aug 02 , 2024 | 04:32 AM
పతకం ఖాయం అనుకొన్న తెలుగు క్రీడాకారులు తీవ్రంగా నిరాశపరచారు. పోటీలకు ఆరో రోజైన గురువారం స్వప్నిల్ కుశాలె కాంస్యం, లక్ష్యసేన్ గెలుపు మినహా భారత్‌కు ఏమాత్రం కలిసిరాలేదు. ముఖ్యంగా పీవీ సింధు, నిఖత్ జరీన్, సాత్విక్
ఒకేరోజు నిష్క్రమించిన తెలుగు ప్లేయర్లు
నిరాశపరచిన నిఖత్, సింధు, సాత్విక్
క్వార్టర్స్‌కు లక్ష్యసేన్
పారిస్: పతకం ఖాయం అనుకొన్న తెలుగు క్రీడాకారులు తీవ్రంగా నిరాశపరచారు. పోటీలకు ఆరో రోజైన గురువారం స్వప్నిల్ కుశాలె కాంస్యం, లక్ష్యసేన్ గెలుపు మినహా భారత్‌కు ఏమాత్రం కలిసిరాలేదు. ముఖ్యంగా పీవీ సింధు, నిఖత్ జరీన్, సాత్విక్ సాయిరాజ్ జోడీ పేలవ ప్రదర్శనతో మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించారు.
నిఖత్ ఏకపక్షంగా...
మహిళల 50 కిలోల ప్రీక్వార్టర్స్‌లో నిఖత్ 0-5తో ఆసియాడ్ చాంపియన్ వు యు (చైనా) చేతిలో చిత్తయింది. చైనా బాక్సర్ ఎత్తులు, చురుకుదనం ముందు నిఖత్ నిలవలేకపోయింది. మూడు రౌండ్లలో ప్రత్యర్థిపై ఒక్కసారి కూడా బలమైన పంచ్ విసరలేక పోయింది. మరోవైపు వేగంగా కదులుతూ ప్రత్యర్థి పంచ్‌లను తప్పించుకుంటూనే.. వు యు ఎదురుదాడి చేస్తూ పాయింట్లు రాబట్టింది. జరీన్ దూకుడు కనబరుస్తున్న ప్రతీసారి వ్యూహాత్మకంగా లాక్ చేసి ఆమె చేతులు కట్టేసింది. బౌట్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి వేగంతో తాను పోటీపడలేక పోయానని నిఖత్ అంగీకరించింది. తొలి రౌండ్‌లోనే చైనా బాక్సర్ దూకుడుతో నిఖత్‌పై ఒత్తిడి పెంచింది. వేగవంతమైన ఫుట్‌వర్క్‌తో అదునుచూసి దాడి చేస్తుంటే.. నిఖత్ కౌంటర్ ఇవ్వలేక పోయింది. దీంతో జరీన్ తొలి రౌండ్‌ను 1-4తో కోల్పోయింది. రెండో రౌండ్‌లో నిఖత్ కొంత ఫర్వాలేదనిపించినా.. యు తెలివిగా భారత బాక్సర్ ముఖంపై బలమైన హుక్‌లు విసిరింది. దీంతో రెండో రౌండ్‌లో కూడా జరీన్ 2-3 తేడాతో ఓడింది. అప్పటికే డీలాపడిన నిఖత్.. మూడో రౌండ్‌లో పెద్దగా ప్రతిఘటించలేక బౌట్‌ను చేజార్చుకొంది. అనంతరం ప్రెస్ మీట్‌లో ‘అందరికీ క్షమాపణలు’ అంటూ కన్నీటి పర్యంతమైంది.
సాత్విక్ కల చెదిరింది
హ్యాట్రిక్ పతక వేటలో ఉన్న ఏస్ షట్లర్ సింధుతోపాటు డబుల్స్ టాప్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టికి షాక్ తగిలింది. క్వార్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ ద్వయం 21-13, 14-21, 16-21తో మలేసియాకు చెందిన ఆరోన్ చియా-ఫో వు యిక్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో స్వర్ణం తెస్తారనుకొన్న సాత్విక్ జోడీ.. ఉత్త చేతులతో ఇంటిముఖం పట్టింది.
హాకీలో ఓటమి..
భారత హాకీ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. గ్రూప్-బిలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-2తో బెల్జియం చేతిలో పరాజయాన్ని చవిచూసింది. 18వ నిమిషంలోనే అభిషేక్ గోల్ చేసి భారత్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. అయితే, తిబ్యూ స్టాక్‌బోరెక్స్ (33వ నిమిషం), జాన్ డోమెన్ (44వ) చెరో గోల్‌తో బెల్జియాన్ని గెలిపించారు. గ్రూప్‌లో చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. న్యూజిలాండ్‌పై గెలిచి అర్జెంటీనాతో డ్రా చేసుకొన్న టీమిండియా క్వార్టర్స్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకొంది.
సింధు కూడా..
మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో సింధు 19-21, 14-21తో హి బింగ్జియావో (చైనా) చేతిలో వరుస గేముల్లో చిత్తయింది. తొలి గేమ్ ఆరంభం నుంచే సింధు వెనుకంజలోనే సాగింది. అయితే, బ్రేక్ తర్వాత పుంజుకొని 19-19తో సమం చేసినా.. కీలక సమయంలో తడబాటులో గేమ్‌ను చేజార్చుకొంది. ఇక, రెండో గేమ్‌లో ఏమాత్రం పోరాటం కనబర్చలేదు. కాగా, సింగిల్స్‌లో లక్ష్య సేన్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. సహచర షట్లర్ హెచ్‌ఎ్‌స ప్రణయ్‌తో జరిగిన రౌండ్-16 పోరులో సేన్ 21-12, 21-6తో అలవోకగా నెగ్గాడు. ఈ క్రమంలో కశ్యప్, శ్రీకాంత్ తర్వాత ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌కు చేరుకొన్న మూడో పురుష షట్లర్‌గా నిలిచాడు. తర్వాతి రౌండ్‌లో 12వ సీడ్ చో టిన్ చెన్ (చైనీస్ తైపీ)తో సేన్ తలపడనున్నాడు.
ప్రియాంకకు 41వ స్థానం..: అథ్లెటిక్స్‌ను భారత్ పేలవంగా ఆరంభించింది. మహిళల 20 కి.మీ రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామి గంటా 39 నిమిషాల 55 సెకన్ల టైమింగ్‌తో ముగించి 41వ స్థానంలో నిలిచింది. పురుషుల 20 కిమీ రేస్‌లో వికాస్ సింగ్ 30, పరమ్‌జీత్ సింగ్ 37వ స్థానంలో నిలిచారు. ఇక ఇదే విభాగంలో తలపడిన ఆకాశ్ దీప్ సింగ్ ఆరు కి.మీ. తర్వాత రేస్ నుంచి వైదొలిగాడు.
ప్రవీణ్ తొలి రౌండ్‌లోనే..: పురుషుల ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో మిగిలిన ఏకైక ఆర్చర్ ప్రవీణ్ జాదవ్ తొలి రౌండ్‌లోనే అవుటయ్యాడు. రౌండ్-64లో జాదవ్ 0-6తో కొ వెంచావ్ (చైనా) చేతిలో చిత్తయ్యాడు.
శరవణన్ వెనుకంజ..: సెయిలింగ్ పురుషుల డింగీ ఈవెంట్‌లో విష్ణు శరవణన్ రెండు రేస్‌లు ముగిసే సరికి 25వ స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి రేస్‌లో 10, రెండో రేస్‌లో 34వ స్థానంలో నిలిచాడు. మొత్తం 10 రేస్‌లు పూర్తయిన తర్వాత టాప్-10లో నిలిచిన సెయిలర్లు పతక రౌండ్‌కు చేరుకొంటారు. మహిళల డింగీలో నేత్ర కుమనన్ తొలి రేస్‌లో ఆరో స్థానంలో నిలిచింది. తగిన విధంగా గాలి లేకపోవడంతో రెండో రేస్‌ను వాయిదా వేశారు.