మా వాడిని అవమానించారు
ABN , Publish Date - Dec 20 , 2024 | 05:57 AM
మాజీ ఆఫ్‌స్పిన్నర్ ఆర్.అశ్విన్ రిటైర్మెంట్‌పై అతడి తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవమానాలు భరించలేకే తన కుమారుడు ఇంత త్వరగా ఆటకు వీడ్కోలు పలికాడని ...
చెన్నై (ఆంధ్రజ్యోతి): మాజీ ఆఫ్‌స్పిన్నర్ ఆర్.అశ్విన్ రిటైర్మెంట్‌పై అతడి తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవమానాలు భరించలేకే తన కుమారుడు ఇంత త్వరగా ఆటకు వీడ్కోలు పలికాడని చెప్పాడు. ‘అశ్విన్ నిర్ణయం నాకు చివరి నిమిషంలోనే తెలిసింది. అయితే ఇలాంటిది జరుగుతుందని ముందే ఊహించా. ఎందుకంటే మా వాడిని వేధిస్తున్నారు. ఎంతకాలమని భరించగలడు? అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడు’ అని రవిచంద్రన్ తెలిపాడు. అయితే అశ్విన్‌ను అవమానించిన వారెవరో ఆయన చెప్పలేదు. మరోవైపు తన తండ్రికి మీడియాతో ఎలా మాట్లాడాలో తెలీదని, ఆయన కామెంట్స్‌ను పట్టించుకోవద్దని అశ్విన్ చెప్పాడు.
స్వదేశం చేరిన అశ్విన్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్ గురువారం ఉదయం స్వదేశంలో అడుగుపెట్టాడు. చెన్నై విమానాశ్రయం నుంచి నేరుగా స్వగృహానికి చేరుకున్న అశ్విన్‌పై కుటుంబసభ్యులు, సన్నిహితులు పూలవర్షం కురిపిస్తూ.. భాజా భజంత్రీలతో సాదర స్వాగతం పలికారు.
ఘనంగా ఫేర్‌వెల్ దక్కాల్సింది: కపిల్
న్యూఢిల్లీ: అశ్విన్ రిటైర్మెంట్ షాక్‌కు గురి చేసిందని, అలాగే అతడికి ఘనంగా ఫేర్‌వెల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. అశ్విన్ ముఖంలోనూ అసంతృప్తి కనిపించిందని, తను భారత గడ్డపై వీడ్కోలు పలికితే బావుండేదని అన్నాడు. ఇందుకోసం ఇప్పటికైనా బీసీసీఐ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలని చెప్పాడు.