అదే తీరు.. బ్యాటింగ్ మారలేదు!
ABN , Publish Date - Nov 02 , 2024 | 06:48 AM
న్యూజిలాండ్‌తో కీలకమైన మూడో టెస్ట్‌లోనూ భారత జట్టు..ముఖ్యంగా బ్యాటర్ల తీరు ఏమాత్రం మెరుగుపడలేదు. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఆట నానాటికీ తీసికట్టు అన్న చందమైంది. ఫలితంగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షి్‌ప ఫైనల్ రేసులో ఉండాలంటే గెలిచి తీరాల్సిన ముంబై మ్యాచ్‌లో టీమిండియా
భారత్ తొలి ఇన్నింగ్స్ 86/4
న్యూజిలాండ్ 235 ఆలౌట్
భారత జట్టు బ్యాటింగ్
డొల్లతనం మరోసారి బయటపడింది..ఎప్పటిలానే బౌలర్లు న్యూజిలాండ్‌ను కట్టడి చేశారు..ఆపై బ్యాటర్లు సత్తా చాటి బౌలర్ల కష్టానికి ఫలితం రాబట్టాల్సి ఉంది..కానీ మనోళ్ల తీరు మారలేదు ! రెండు టెస్ట్‌లు పూర్తయినా స్టార్ బ్యాటర్ల బ్యాటింగ్ గాడిలో పడలేదు..దీంతో బౌలర్ల శ్రమ వృథా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..స్పిన్నర్లు జడేజా, సుందర్ అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని 250 రన్స్‌కులోపే కట్టడి చేయడంతో భారత్‌దే పైచేయి అయింది..అయితే కెప్టెన్ రోహిత్ దారుణ వైఫల్యాన్ని కొనసాగించగా, కోహ్లీ అనూహ్యంగా రనౌట్ కావడంతో మూడో టెస్ట్ మొదటి రోజే టీమిండియా ఇక్కట్లలో పడింది..ఇక తదుపరి బ్యాటర్లలో ఒకరిద్దరైనా పట్టుదలతో ఆడి క్రీజులో నిలవకపోతే ఈ మ్యాచ్ కూడా చేజారడం ఖాయం..
ముంబై: న్యూజిలాండ్‌తో కీలకమైన మూడో టెస్ట్‌లోనూ భారత జట్టు..ముఖ్యంగా బ్యాటర్ల తీరు ఏమాత్రం మెరుగుపడలేదు. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఆట నానాటికీ తీసికట్టు అన్న చందమైంది. ఫలితంగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షి్‌ప ఫైనల్ రేసులో ఉండాలంటే గెలిచి తీరాల్సిన ముంబై మ్యాచ్‌లో టీమిండియా పరిస్థితులు తలకిందులయ్యేలా ఉన్నాయి. శుక్రవారం మొదలైన ఆఖరి టెస్ట్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కివీ్‌స..జడేజా (5/65), సుందర్ (4/81) ధాటికి మొదటి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌటైంది. మిచెల్ (82), యంగ్ (71) అర్ధ శతకాలతో ఆదుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ ఆట ఆఖరికి 86 పరుగులకే నాలుగు వికెట్లు చేజార్చుకుంది. గిల్ (31 బ్యాటింగ్), జైస్వాల్ (30) రాణించారు. రోహిత్ (18), కోహ్లీ (4) తీవ్రంగా నిరాశ పరిచారు.
జైస్వాల్, గిల్ భాగస్వామ్యం: ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన భారత్ ఆనందం.. మొదటి రోజు ఆట చివర్లో ఆవిరైంది. అంతకుముందు..సొంత గడ్డ ముంబైలో కేవలం రెండో టెస్టే ఆడుతున్న రోహిత్ ధాటి షాట్లతో అలరించాడు. ఈక్రమంలో లభించిన లైఫ్‌ను అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఓ భారీ షాట్ సంధించే క్రమంలో రోహిత్ వికెట్ పారేసుకున్నాడు. 25/1తో ఉన్న దశలో జైస్వాల్‌కు గిల్ తోడయ్యాడు. పుణె టెస్ట్ మాదిరే వీరు జట్టు ఇన్నింగ్స్ చక్కదిద్దారు. సాధికార షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. రెండో వికెట్‌కు 53 పరుగులతో జోడించారు.
10 నిమిషాల్లో తారుమారు: యశస్వీ, శుభమన్ భాగస్వామ్యం బలపడుతూ తొలిరోజును ప్రశంసనీయంగా ముగిస్తారని భావిస్తున్న దశలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరో 10 నిమిషాల్లో ఆటకు తెరపడనుండగా..భారత ఇన్నింగ్స్ తీవ్ర కుదుపులకు లోనైంది. స్పిన్నర్ ఎజాజ్ లెగ్ స్టంప్ ఆవలిగా వేసిన బంతిని రివర్స్ స్వీప్ చేయబోయిన జైస్వాల్ బౌల్డయ్యాడు. తన టెస్ట్ కెరీర్‌లో గత 14 ఇన్నింగ్స్‌లలో కళ్లు చెదిరే రివర్స్ స్వీప్ షాట్‌లు ఆడిన జైస్వాల్ మొదటిసారి ఇలా అవుట్ కావడం గమనార్హం. తదుపరి మరో అద్భుతమైన బంతికి నైట్‌వాచ్‌మన్ సిరాజ్‌ను ఎల్బీ చేసిన ఎజాజ్ గట్టి దెబ్బ కొట్టాడు. సిరాజ్ రివ్యూకి వెళ్లినా ఫలితం దక్కలేదు. ఇక..లేని పరుగుకోసం వెళ్లి కోహ్లీ రనౌట్ కావడంతో..ఎనిమిది బంతులలో టీమిండియా ఇన్నింగ్స్ మారిపోగా..కివీస్ మ్యాచ్‌పై పట్టు బిగించింది.
జడేజా ‘ఐదు’ వాంఖడే స్పిన్ పిచ్‌పై టాస్ గెలిచిన లాథమ్..
తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆకాశ్‌దీ్‌ప, సుందర్ ధాటికి 72/3తో నిలిచిన పర్యాటక జట్టును మిచెల్, యంగ్ నాలుగో వికెట్‌కు 87 పరుగులు జత చేసి గాడిలో పెట్టారు. కానీ జడేజా విజృంభణకు కివీస్ 159/3 నుంచి 235కు ఆలౌటైంది.
బాబోయ్ ఎండ
మ్యాచ్‌కు తొలిరోజైన శుక్రవారం 37 డిగ్రీల ఎండతో సూర్యుడు ఠారెత్తించాడు. దానికితోడు తీవ్ర ఉక్కపోత. ఫలితంగా ఆటగాళ్లు అల్లాడిపోయారు. బ్యాటర్లు ప్రతి రెండు ఓవర్లకోసారి డ్రింక్స్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే విరామం మధ్యలో ఐస్ టవల్స్, ఐస్ ప్యాక్‌ను మెడ చుట్టూ ఉంచుకుంటూ ఎండనుంచి కాపాడుకొనేందుకు తంటాలు పడ్డారు.
స్కోరుబోర్డు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : లాథమ్ (బి) సుందర్ 28, కాన్వే (ఎల్బీ) ఆకాశ్‌దీ్‌ప 4, యంగ్ (సి) రోహిత్ (బి) జడేజా 71, రచిన్ (బి) సుందర్ 5, మిచెల్ (సి) రోహిత్ (బి) సుందర్ 82, బ్లండెల్ (బి) జడేజా 0, ఫిలిప్స్ (బి) జడేజా 17, సోథీ (ఎల్బీ) జడేజా 7, హెన్రీ (బి) జడేజా 0, ఎజాజ్ (ఎల్బీ) సుందర్ 7, ఓ రోక్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 13 : మొత్తం 65.4 ఓవర్లలో 235 ఆలౌట్ ; వికెట్లపతనం : 1-15, 2-59, 3-72, 4-159, 5-159, 6-187, 7-210, 8-210, 9-228 ; బౌలింగ్ : సిరాజ్ 6-0-16-0, ఆకాశ్‌దీ్‌ప 5-0-22-1, అశ్విన్ 14-0-47-0, సుందర్ 18.4-2-81-4, జడేజా 22-1-65-5.
భారత్ తొలి ఇన్నింగ్స్ : జైస్వాల్ (బి) ఎజాజ్ 30, రోహిత్ (సి) లాథమ్ (బి) హెన్రీ 18, గిల్ (బ్యాటింగ్) 31, సిరాజ్ (ఎల్బీ) ఎజాజ్ 0, కోహ్లీ (రనౌట్/హెన్రీ) 4, పంత్ (బ్యాటింగ్) 1 ; ఎక్స్‌ట్రాలు : 2 ; మొత్తం : 19 ఓవర్లలో 86/4 ; వికెట్లపతనం : 1-25, 2-78, 3-78, 4-84 ; బౌలింగ్: హెన్రీ 5-1-15-1, ఓ రోక్ 2-1-5-0, ఎజాజ్ పటేల్ 7-1-33-2, ఫిలిప్స్ 4-0-25-0, రచిన్ 1-0-80.