Share News

తిలక్‌ తుఫాన్‌

ABN , Publish Date - Nov 14 , 2024 | 03:08 AM

తిలక్‌ వర్మ (56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 107 నాటౌట్‌) సుడిగాలి శతకంతో.. భారత్‌ మళ్లీ గెలుపు బాటపట్టింది. బుధవారం జరిగిన మూడో టీ20లో భారత్‌ 11 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో....

తిలక్‌ తుఫాన్‌

శతక్కొట్టిన తెలుగు కుర్రాడు

  • అభిషేక్‌ హాఫ్‌ సెంచరీ

  • 11 పరుగులతో భారత్‌ గెలుపు

  • మూడో టీ20లో ఓడిన దక్షిణాఫ్రికా

సెంచూరియన్‌: తిలక్‌ వర్మ (56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 107 నాటౌట్‌) సుడిగాలి శతకంతో.. భారత్‌ మళ్లీ గెలుపు బాటపట్టింది. బుధవారం జరిగిన మూడో టీ20లో భారత్‌ 11 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో పైచేయి సాధించింది. తొలుత భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 219/6 స్కోరు చేసింది. అభిషేక్‌ శర్మ (25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) హాఫ్‌ సెంచరీతో అలరించాడు. కేశవ్‌ మహారాజ్‌, సిమెలానె చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో దక్షిణాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 208/7 స్కోరు మాత్రమే చేసింది. జెన్సన్‌ (17 బంతుల్లో 54), క్లాసెన్‌ (41), మార్‌క్రమ్‌ (29) టాప్‌ స్కోరర్లు.


అర్ష్‌దీప్‌ 3, వరుణ్‌ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టారు. టీమిండియా తరఫున రమణ్‌దీప్‌ సింగ్‌ అరంగేట్రం చేశాడు. కీటకాల కారణంగా సౌతాఫ్రికా బ్యాటింగ్‌ సమయంలో సుమారు 20 నిమిషాలపాటు ఆటకు అంతరాయం కలిగింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా తిలక్‌ వర్మ నిలిచాడు.

భయపెట్టిన జెన్సన్‌: భారత స్పిన్నర్ల మాయాజాలంతో.. భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా తడబడింది. ఓపెనర్లు రికెల్టన్‌ (20), హెండ్రిగ్స్‌ (21) ధాటిగా ఆరంభించినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేక పోయారు. రికెల్టన్‌ను అర్ష్‌దీప్‌ బౌల్డ్‌ చేయగా.. హెండ్రిగ్స్‌ను వరుణ్‌ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టబ్స్‌ (12) రెండు ఫోర్లతో జోరు చూపడంతో.. పవర్‌ప్లే ముగిసే సరికి దక్షిణాఫ్రికా 55/2తో నిలిచింది. మధ్య ఓవర్లలో వరుణ్‌, అక్షర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో ఫామ్‌లో ఉన్న స్టబ్స్‌ను అక్షర్‌ ఎల్బీగా వెనక్కిపంపాడు. రెండు సిక్స్‌లతో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన మార్‌క్రమ్‌ను వరుణ్‌ క్యాచవుట్‌ చేయడంతో.. 10 ఓవర్లకు సౌతాఫ్రికా 84/4తో ఇబ్బందుల్లో పడింది. అయితే, క్లాసెన్‌, మిల్లర్‌ (18) ఐదో వికెట్‌కు 58 పరుగులతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. చివరి 30 బంతుల్లో 86 పరుగులు కావల్సి ఉండగా.. మిల్లర్‌ను పాండ్యా అవుట్‌ చేశాడు. ధాటిగా ఆడుతున్న క్లాసెన్‌ను అర్ష్‌దీప్‌ పెవిలియన్‌ చేర్చడంతో మ్యాచ్‌ టీమిండియాదే అని భావించారు. కానీ, జాన్సన్‌ ఎడాపెడా షాట్లతో భారత శిబిరంలో గుబులు రేపాడు. 19వ ఓవర్‌లో పాండ్యా బౌలింగ్‌లో జాన్సన్‌ 2 సిక్స్‌లు, మూడు ఫోర్లతో 26 పరుగులు రాబట్టడంతో.. ఆఖరి ఓవర్‌లో లక్ష్యం 25 పరుగులకు దిగివచ్చింది. అయితే, జెన్సన్‌ను అవుట్‌ చేసిన అర్ష్‌దీప్‌ జట్టుకు ఉత్కంఠ విజయాన్ని అందించాడు.


అటు వర్మ.. ఇటు శర్మ: డాషింగ్‌ బ్యాటర్‌ తిలక్‌ కెరీర్‌లో తొలి శతకంతో దుమ్మురేపగా.. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్‌ అభిషేక్‌ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డ వీరిద్దరూ రెండో వికెట్‌కు 52 బంతుల్లో 107 పరుగులు జోడించడంతో.. భారత్‌ సవాల్‌ విసరగలిగే స్కోరు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (0)ను జెన్సన్‌ వరుసగా రెండోసారి డకౌట్‌ చేశాడు. కానీ, వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్‌, అభిషేక్‌ పోటాపోటీగా షాట్లు ఆడుతూ పవర్‌ప్లేలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వర్మ 4,6 బాదగా.. రెండో ఓవర్‌లో అభిషేక్‌ 4,6,4తో 15 పరుగులు రాబట్టాడు. ఇక, ఐదో ఓవర్‌లో సిమెలానె బౌలింగ్‌లో అభిషేక్‌ రెండు భారీ సిక్స్‌లతో మొత్తం 18 రన్స్‌ సాధించాడు. దీంతో ఆరు ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 70/1తో భారీ స్కోరుకు బాటలువేసింది. అయితే, మధ్య ఓవర్లలో సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో టీమిండియా పరుగుల వేగం మందగించింది. 9వ ఓవర్‌లో కేశవ్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకొన్న అభిషేక్‌.. ఆ వెంటనే స్టంపౌటయ్యాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ (1)ను సిమెలానె స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేర్చడంతో భారత్‌ 110/3తో నిలిచింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్యా (18) వరుస బౌండ్రీలతో స్కోరు బోర్డులో ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు.


13వ ఓవర్‌లో సింగిల్‌తో తిలక్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నా.. పాండ్యాను కేశవ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకొన్నాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్‌ (8) తన సహజ శైలిలో షాట్లు ఆడలేక పోయాడు. కానీ, అప్పటి వరకు ఒకింత నెమ్మదిగా ఆడుతున్న తిలక్‌.. 15వ ఓవర్‌లో కేశవ్‌ బౌలింగ్‌లో 4,6,4తో ఒక్కసారిగా గేర్‌ మార్చడంతో టీమ్‌ స్కోరు దూసుకెళ్లింది. ఆ తర్వాతి ఓవర్‌లో కొట్జీ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లతో చెలరేగిన తిలక్‌ ఏకంగా 21 పరుగులు రాబట్టాడు. రింకూను సిమెలానె బౌల్డ్‌ చేయడంతో ఐదో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. సిక్స్‌తో రమణ్‌దీప్‌ (15) ఖాతా తెరవగా.. బౌండ్రీతో తిలక్‌ సెంచరీ పూర్తి చేసుకొన్నాడు. రమణ్‌దీప్‌ రనౌట్‌ అయ్యాడు. వర్మ దెబ్బకు చివరి 5 ఓవర్లలో సఫారీలు 65 పరుగులు సమర్పించుకోవడంతో.. భారత్‌ స్కోరు 200 మార్క్‌ దాటింది.

స్కోరుబోర్డు

భారత్‌: శాంసన్‌ (బి) జెన్సన్‌ 0, అభిషేక్‌ (స్టంప్డ్‌) క్లాసెన్‌ (బి) కేశవ్‌ 50, తిలక్‌ (నాటౌట్‌) 107, సూర్యకుమార్‌ (సి) జెన్సన్‌ (బి) సిమెలానె 1, హార్దిక్‌ (ఎల్బీ) కేశవ్‌ 18, రింకూ (బి) సిమెలానె 8, రమణ్‌దీప్‌ (రనౌట్‌) 15, అక్షర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం: 20 ఓవర్లలో 219/6; వికెట్ల పతనం: 1-0, 2-107, 3-110, 4-132, 5-190, 6-218; బౌలింగ్‌: జెన్సన్‌ 4-0-28-1, కొట్జీ 3-0-51-0, సిపామ్లా 4-0-45-0, సిమెలానె 3-0-34-2, మార్‌క్రమ్‌ 2-0-19-0, కేశవ్‌ 4-0-36-2.


దక్షిణాఫ్రికా: రికెల్టన్‌ (బి) అర్ష్‌దీప్‌ 20, హెండ్రిక్స్‌ (స్టంప్ట్‌) శాంసన్‌ (బి) వరుణ్‌ 21, మార్‌క్రమ్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) వరుణ్‌ 29, స్టబ్స్‌ (ఎల్బీ) అక్షర్‌ 12, క్లాసెన్‌ (సి) తిలక్‌ (బి) అర్ష్‌దీప్‌ 41, మిల్లర్‌ (సి) అక్షర్‌ (బి) హార్దిక్‌ 18, జెన్సన్‌ (ఎల్బీ) అర్ష్‌దీప్‌ 54, కొట్జీ (నాటౌట్‌) 2, సిమెలానె (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 208/7; వికెట్ల పతనం: 1-27, 2-47, 3-68, 4-84, 5-142, 6-167, 7-202; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-37-3, హార్దిక్‌ 4-0-50-1, అక్షర్‌ 4-0-29-1, వరుణ్‌ 4-0-54-2, రవి బిష్ణోయ్‌ 4-0-33-0.

2

టీ20ల్లో సెంచరీ చేసిన రెండో పిన్నవయసు భారత బ్యాటర్‌గా తిలక్‌ వర్మ (22 ఏళ్ల 5 రోజులు). యశస్వీ జైస్వాల్‌ (21 ఏళ్ల 279 రోజులు) టాప్‌లో ఉన్నాడు.

Updated Date - Nov 14 , 2024 | 03:08 AM