Share News

తీర్పుపై స్విస్‌ కోర్టుకు.. వినేశ్‌ ఫొగట్‌

ABN , Publish Date - Aug 16 , 2024 | 01:24 AM

వినేశ్‌ ఫొగట్‌ అప్పీల్‌ను క్రీడా మధ్యవర్తిత్వ న్యాయస్థానం (కాస్‌) అడ్‌హాక్‌ డివిజన్‌ ఆర్బిట్రేటర్‌ జస్టిస్‌ అనాబెల్‌ బెనెట్‌ బుధవారం కొట్టివేశారు. ఇక..వినేశ్‌పై అనర్హత వేటుకు సంబంధించి తదుపరి కార్యాచరణ ఏమిటనే విషయమై...

తీర్పుపై స్విస్‌ కోర్టుకు.. వినేశ్‌ ఫొగట్‌

న్యూఢిల్లీ: వినేశ్‌ ఫొగట్‌ అప్పీల్‌ను క్రీడా మధ్యవర్తిత్వ న్యాయస్థానం (కాస్‌) అడ్‌హాక్‌ డివిజన్‌ ఆర్బిట్రేటర్‌ జస్టిస్‌ అనాబెల్‌ బెనెట్‌ బుధవారం కొట్టివేశారు. ఇక..వినేశ్‌పై అనర్హత వేటుకు సంబంధించి తదుపరి కార్యాచరణ ఏమిటనే విషయమై చర్చలు బయలు దేరాయి. తీర్పునకు సంబంధించి సింగిల్‌ లైన్‌ ఆర్డర్‌ కాపీ మాత్రమే వచ్చిందని పారిస్‌ కోర్టులో వినేశ్‌ కేసుపై భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) తరపున వాదించిన సీనియర్‌ న్యాయవాదుల్లో ఒకరైన విదుష్పత్‌ సింఘానియా శుక్రవారం తెలిపారు. తీర్పును ఎందుకు కొట్టి వేశారో సింగిల్‌ ఆర్డర్‌ కాపీలో లేదని చెప్పారు. పూర్తి వివరాలతో కూడిన తీర్పు కాపీ అందాల్సి ఉందన్నారు. కాస్‌ తీర్పుపై 30 రోజుల్లోగా స్విస్‌ ఫెడరల్‌ ట్రిబ్యునల్‌లో అప్పీలు చేస్తామని ఆయన తెలిపారు. స్విట్జర్లాండ్‌లోని లాసన్నెలో ఉన్న స్విస్‌ ఫెడరల్‌ కోర్టుకు వెళ్లే విషయంలో సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే తమకు మార్గరద్శనం చేస్తారని విదుష్పత్‌ తెలిపారు. అక్కడ తీర్పు అనుకూలంగా వస్తే..వినేశ్‌కు రజత పతకం అందజేస్తారు.


ఇలా సవాలు చేయొచ్చు..

అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), ప్రపంచ రెజ్లింగ్‌ పాలక మండలి..యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) నిబంధనలకు అనుగుణంగా కాస్‌ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేయడానికి ఆస్కారముంది. కానీ తక్కువ అంశాల్లో మాత్రమే సవాలుకు చాన్సు ఉందని తెలిసింది. విచారణ నిబంధనలు ఉల్లంఘించినట్టు ప్రాథమికంగా తేలడం, పబ్లిక్‌ పాలసీలలో అననుకూలత..వంటి కారణాలతో కాస్‌ తీర్పును సవాలు చేయవచ్చని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Aug 16 , 2024 | 01:25 AM