Share News

Paris Olympics : ఉత్సాహం.. ఉద్వేగం.. ఉత్కంఠ !

ABN , Publish Date - Aug 01 , 2024 | 12:56 AM

చిరుతల్లా దూసుకుపోయే రన్నర్లు..కిలోమీటర్ల కొద్దీ అలవోకగా నడిచే అథ్లెట్లు..అడ్డంకులను సునాయాసంగా దాటేసే హర్డ్‌లర్లు..ఫ్యాన్స్‌లో ఉత్సాహం, ఉద్వేగం అంతకుమించి ఉత్కంఠ కలిగించే పోటీలు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్లు.

 Paris Olympics : ఉత్సాహం.. ఉద్వేగం.. ఉత్కంఠ !

నేటినుంచి ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ పోటీలు

పారిస్‌: చిరుతల్లా దూసుకుపోయే రన్నర్లు..కిలోమీటర్ల కొద్దీ అలవోకగా నడిచే అథ్లెట్లు..అడ్డంకులను సునాయాసంగా దాటేసే హర్డ్‌లర్లు..ఫ్యాన్స్‌లో ఉత్సాహం, ఉద్వేగం అంతకుమించి ఉత్కంఠ కలిగించే పోటీలు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్లు. ఒలింపిక్స్‌కే తలమానికమైన ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ పోటీలకు గురువారం తెరలేవనుంది. విశ్వక్రీడల్లో మొత్తం 32 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతున్నా..ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్లకు ఉండే క్రేజే వేరు. పురుషులు, మహిళల విభాగాల్లో 23 అంశాల చొప్పున, రెండు మిక్స్‌డ్‌ ఈవెంట్లు (4గీ400మీ. మిక్స్‌డ్‌ రిలే, 35 కి.మీ. మిక్స్‌డ్‌ రేస్‌ వాక్‌) కలిపి మొత్తం 48 అంశాల్లో అథ్లెట్లు ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

వీటికి మరింత క్రేజ్‌: ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ పోటీల్లో 100 మీ. స్ర్పింట్‌కు ఉన్న క్రేజే వేరు. అమెరికన్‌ ద్వయం నోవా లైల్స్‌, షా కారీ రిచర్డ్‌సన్‌ ఈ సారి పురుషులు, మహిళల 100 మీ. పరుగులో హాట్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. పురుషుల విభాగంలో ఇటలీకి చెందిన ఒలింపిక్‌ చాంపియన్‌ మార్సెల్‌ జాకబ్‌ నుంచి నోవాకు తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశముంది. అమెరికాకే చెంది న ఇరియాన్‌ నైటన్‌, లెసిలీ టెబాగో (బోట్స్వానా) కూడా గట్టి పోటీ ఇచ్చే చాన్సుంది. ఇక మహిళల 100 మీ.లలో రెండుసార్లు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఎలానీ థాంప్సన్‌ (జమైకా) లేకపోవడం టైటిల్‌ రేసులో రిచర్డ్‌సన్‌కు కలిసి రానుంది. అలాగే జమైకా స్ర్పింటర్‌ షెరికా జాక్సన్‌ ఈసారి 100 మీ.లకు దూరంగా ఉన్నట్టు ప్రకటించడంతో రిచర్డ్‌సన్‌కు మరింత సానుకూలం కానుంది. అయితే ఐదో, ఆఖరి ఒలింపిక్స్‌లో తలపడుతున్న జమైకా క్వీన్‌ షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌ ప్రైస్‌..రిచర్డ్‌సన్‌కు సవాలు విసురుతోంది. ప్రస్తుత ఒలింపిక్‌ చాంపియన్‌ అర్మాండ్‌ డుప్లాంటిస్‌ పురుషుల పోల్‌వాల్ట్‌లో వరల్డ్‌ రికార్డుకు గురిపెట్టాడు. మహిళల 400 మీ హర్డిల్స్‌లో సిడ్నీ మెక్‌లాలిన్‌ ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాలని పట్టుదలగా ఉంది. కెన్యా సూపర్‌ స్టార్‌ ఫెయిత్‌ కిపోయేగన్‌ మహిళల 1500 మీ. పరుగులో చారిత్రక హ్యాట్రిక్‌ పసిడి పతకమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. మహిళల హైజం్‌పలో యరోస్లావా మహూచిక్‌ గతనెలలో తాను నెలకొల్పిన వరల్డ్‌ రికార్డును మరోసారి తిరగరాయాలని భావిస్తోంది. చిరకాల ప్రత్యర్థులు ఎలుద్‌ కిప్చోగే (కెన్యా), కెనీనిసా బెకెలే (ఇథియోపియా) పురుషుల మారథాన్‌లో స్వర్ణం కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు.

నేడు బరిలో ప్రియాంక, ఆకాశ్‌, వికాస్‌, బిస్త్‌

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ తొలిరోజు పోటీలలో భారత్‌ తరపున ప్రియాంక గోస్వామి మహిళల 20 కి.మీ రేస్‌ వాక్‌లో, పరమ్‌జీత్‌సింగ్‌ బిస్త్‌, ఆకాశ్‌దీప్‌, వికాస్‌ సింగ్‌ పురుషుల 20 కి.మీ. రేస్‌ వాక్‌లో పోటీపడనున్నారు.

ఆశలన్నీ చోప్రాపైనే..

మొత్తం 29 మంది భారత అథ్లెట్లు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ బరిలో దిగుతున్నారు. 16 పతక విభాగాల్లో మనోళ్లు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా..జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాపైనే అందరి దృష్టి నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రక స్వర్ణ పతకం సొంతం చేసుకున్న 26 ఏళ్ల నీరజ్‌ మళ్లీ ఆ ఫీట్‌తో ఇంకోసారి చరిత్ర తిరగ రాస్తాడని బలంగా విశ్వసిస్తున్నారు. తెలుగు అథ్లెట్లు యర్రాజీ జ్యోతి (100 మీ. హర్డిల్స్‌), జ్యోతికశ్రీ దండి (4గీ400మీ. రిలే) తొలి ఒలింపిక్స్‌లో ఎలా రాణిస్తారో చూడాలి.

Updated Date - Aug 01 , 2024 | 12:56 AM