Share News

తులిక..తెచ్చేనా పతకం ?

ABN , Publish Date - Jul 19 , 2024 | 03:37 AM

పారి్‌సకు వందమందికిపైగా బృందంతో భారత్‌ బరిలో దిగుతోంది. ఇందులో ఒక్క ప్లేయరే తలపడుతున్న క్రీడాంశాలు మూడున్నాయి. వాటిలో జూడో ఒకటి. అది కూడా మహిళల విభాగంలో...

తులిక..తెచ్చేనా పతకం ?

పారిస్‌ ఒలింపిక్స్‌ 7 రోజుల్లో

పారి్‌సకు వందమందికిపైగా బృందంతో భారత్‌ బరిలో దిగుతోంది. ఇందులో ఒక్క ప్లేయరే తలపడుతున్న క్రీడాంశాలు మూడున్నాయి. వాటిలో జూడో ఒకటి. అది కూడా మహిళల విభాగంలో. ఆమే ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల తులికా మాన్‌. 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో తులిక రజత పతకం సొంతం చేసుకుంది. మహిళల +78 కిలోల విభాగంలో మొత్తం 1345 పాయింట్లు సాధించిన ఆమె..ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌ ర్యాంకింగ్స్‌లో 36వ స్థానంలో నిలిచింది. తులిక ప్రస్తుతం స్పెయిన్‌లోని వలెన్సియాలో శిక్షణ తీసుకుంటోంది. అటునుంచే ఈనెల 26న ఒలింపిక్స్‌ ప్రారంభం నాటికి పారిస్‌ చేరుకోనుంది. తులిక తొలి బౌట్‌ ఆగస్టు రెండున జరగనుంది. గత టోక్యో విశ్వక్రీడల్లోనూ జూడోలో భారత్‌ నుంచి ఒక్కరే బరిలో ఉన్నారు. మహిళల 48 కిలోల విభాగంలో సుశీలా దేవి లికంబమ్‌ తలపడింది. కానీ ఆమె తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. ఈనేపథ్యంలో తులికా మాన్‌ అయినా ఒలింపిక్స్‌లో భారత్‌ తొలి పతకం అందిస్తుందేమో చూడాలి.


పారి్‌సలో ఇనుప తెర !

పారిస్‌: మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్‌ ప్రారంభం కానుండడంతో క్రీడల నిర్వాహకులు భద్రతా చర్యలపై దృష్టి సారించారు. ఉగ్రవాద చర్యల నిరోధంలో భాగంగా..సెంట్రల్‌ పారిస్‌ సహా సెన్‌ నదీపరివాహక ప్రాంతంలో గురువారం ఇనుప తెరను ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా జారీ చేసిన పాస్‌ ఉంటే తప్ప సెన్‌ నదిని దాటేందుకు, సెంట్రల్‌ పారి్‌సలో తిరిగేందుకు అనుమతించడంలేదు. కిలోమీటర్ల పొడవున ఇనుప తెర ఏర్పాటు చేయడంతోపాటు పోలీసులనూ భారీగా మోహరించారు. ఫోన్‌లో క్యూఆర్‌ కోడ్‌ లేదా పేపర్‌ ప్రింట్‌ ఉన్నవారినే ఈ ప్రాంతంలో తిరిగేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు.

Updated Date - Jul 19 , 2024 | 03:37 AM