Lightning strikes: మ్యాచ్ జరుగుతుండగా పడిన పిడుగు.. ఆటగాడి పరిస్థితి ఏంటంటే..
ABN , Publish Date - Nov 05 , 2024 | 01:30 PM
ఫుట్‌బాల్ మైదానంలో పిడుగు పడడంతో ఓ ఆటగాడు మరణించాడు. రిఫరీ సహా నలుగురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. పెరూలో ఆదివారం నాడు ఈ ఘటన జరిగింది. గాయపడిన రిఫరీని, నలుగురు ఆటగాళ్లును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఫుట్‌బాల్ మ్యాచ్ (Football Match) జరుగుతుండగా పిడుగు పడడంతో దారుణం జరిగింది. ఫుట్‌బాల్ మైదానంలో పిడుగు (Lightning) పడడంతో ఓ ఆటగాడు మరణించాడు. రిఫరీ సహా నలుగురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. పెరూలో (Peru) ఆదివారం నాడు ఈ ఘటన జరిగింది. గాయపడిన రిఫరీని, నలుగురు ఆటగాళ్లును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన వారు షాకవుతున్నారు (Viral Video).
పెరూలో చిల్కాలో నవంబర్ 3న దేశీయ ఫుట్‌బాల్ క్లబ్‌లు అయిన జువెంటుడ్ బెల్లావిస్టా, ఫామిలియా చొకా మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ఫస్టాఫ్‌లో ఆటగాళ్లు ఉత్సాహంగా ఆడుతున్న సమయంలో వాతావరణం అననుకూలంగా మారింది. వర్షం పడే సూచనలు కనిపించడంతో రిఫరీ మ్యాచ్‌ను నిలిపివేశాడు. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడుతున్నారు. ఆ సమయంలో పిడుగు నేరుగా 39 ఏళ్ల ఆటగాడు జోస్ హ్యూగోపై పడింది. అతడు వెంటనే చనిపోయాడు. ఆ పిడుగు కారణంగా సమీపంలో ఉన్న రిఫరీ, ఇతర ఆటగాళ్లు నేలపై పడిపోయారు. 40 ఏళ్ల ఆటగాడు జువాన్ చోకా శరీరం తీవ్రంగా కాలిపోయింది.
గాయపడిన ఆటగాళ్లను, రిఫరీని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారందరూ చికిత్స పొందుతూ క్షేమంగానే ఉన్నట్టు సమాచారం. గతంలో కూడా పిడుగుపాటు కారణంగా ఫుట్‌బాల్ ఆటగాళ్లు మరణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండోనేసియాలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. ఆ సమయంలో 35 ఏళ్ల సెప్టెన్ రహరాజ మైదనాంలో పిడుగుపాటు కారణంగా మరణించాడు. ప్రస్తుతం పెరూలో పిడుగుపాటుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..