Share News

Good Luck : అన్నీ మంచి శకునములే!

ABN , Publish Date - Aug 01 , 2024 | 01:52 AM

ఒలింపిక్స్‌లో ఐదోరోజు భారత అథ్లెట్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకొన్నారు. 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో స్వప్నిల్‌ కుశాలె ఫైనల్‌కు చేరుకొన్నాడు. విశ్వక్రీడల్లో ఈ విభాగంలో పతక రౌండ్‌కు చేరుకొన్న తొలి భారత

 Good Luck : అన్నీ మంచి శకునములే!

ప్రీక్వార్టర్స్‌కు దీపిక

రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఫైనల్లో స్వప్నిల్‌

శ్రీజ, లవ్లీనా, దీపిక ముందంజ

పారిస్‌: ఒలింపిక్స్‌లో ఐదోరోజు భారత అథ్లెట్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకొన్నారు. 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో స్వప్నిల్‌ కుశాలె ఫైనల్‌కు చేరుకొన్నాడు. విశ్వక్రీడల్లో ఈ విభాగంలో పతక రౌండ్‌కు చేరుకొన్న తొలి భారత షూటర్‌గా నిలిచాడు. బుధవారం జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో స్వప్నిల్‌ మొత్తం 590 పాయింట్లతో ఏడో స్థానంలో నిలవగా.. అతడి సహచరుడు ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ 589 పాయింట్లతో 11వ స్థానం దక్కించుకొన్నాడు. 44 మంది తలపడిన అర్హత రౌండ్‌లో టాప్‌-8లో నిలిచిన షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. దీంతో స్వప్నిల్‌ ముందంజ వేయగా.. మెడల్‌ రౌండ్‌ నుంచి ఐశ్వరీ అవుటయ్యాడు. గురువారం ఫైనల్స్‌ జరగనున్నాయి. మహిళల ట్రాప్‌లో రాజేశ్వరీ కుమారి, శ్రేయాసి సింగ్‌ ఫైనల్‌కు చేరుకోలేక పోయారు. క్వాలిఫికేష్‌ రౌండ్‌లో వీరిద్దరూ చెరి 113 పాయింట్లు స్కోరు చేసి 22, 23 స్థానాల్లో నిలిచి, పతక రౌండ్‌ నుంచి అవుటయ్యారు.

ఒలింపిక్స్‌ ఐదో రోజును భారత అథ్లెట్లు ఆశావహంగా ముగించారు. పతకం లేకపోయినా.. బరిలో నిలిచిన ఆటగాళ్లలో చాలామంది విజయాలతో ముందంజ వేశారు. 50 మీ. రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో ఫైనల్‌ చేరిన తొలి భారత షూటర్‌గా స్వప్నిల్‌ కుశాలె రికార్డులకెక్కగా.. బాక్సర్‌ లవ్లీనా బొర్గోహైన్‌ పతకానికి గెలుపు దూరంలో నిలిచింది. సింధు, లక్ష్యసేన్‌ నాకౌట్‌కు దూసుకెళ్లగా.. ఆర్చర్‌ దీపికా కుమారి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి రౌండ్‌-16లో అడుగుపెట్టింది. తెలుగు టీటీ ప్లేయర్‌ ఆకుల శ్రీజ ప్రీక్వార్టర్స్‌కు చేరడం ద్వారా తన బర్త్‌డేను చిరస్మరణీయం చేసుకొంది.

Untitled-5.jpg

సేన్‌ సంచలనం

ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్య సేన్‌ ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. గ్రూప్‌ స్టేజ్‌ చివరి మ్యాచ్‌లో సింధు అలవోకగా నెగ్గగా.. ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌, వరల్డ్‌ నెం:4 జొనాథన్‌ క్రిస్టీపై సేన్‌ సంచలన విజయం నమోదు చేశాడు. గ్రూప్‌-ఎంలో జరిగిన ఆఖరి, రెండో మ్యాచ్‌లో సింధు 21-5, 21-10 క్రిస్టీన్‌ కూబా (ఎస్తోనియా)ను చిత్తు చేసింది. 33 నిమిషాల్లోనే సింధు మ్యాచ్‌ను ముగించడం విశేషం. పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌-ఎల్‌లో చివరి మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ 21-18, 21-12 క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు జొనాథన్‌తో ఐదుసార్లు జరిగిన ముఖాముఖి పోరులో 4 మ్యాచ్‌ల్లో ఓడిన సేన్‌.. మెగా ఈవెంట్‌లో మాత్రం ఆకట్టుకొనే ప్రదర్శన చేశాడు.

పతకానికి అడుగు దూరంలో

టోక్యో కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్‌ క్వార్టర్స్‌కు చేరుకొంది. బాక్సింగ్‌ మహిళల 75 కిలోల రౌండ్‌-16 బౌట్‌లో లవ్లీనా 5-0తో సునీవా హాఫ్‌స్టాడ్‌ (నార్వే)ను మట్టికరిపించింది. అయితే, క్వార్టర్స్‌ పోరులో టాప్‌సీడ్‌ లి కియాన్‌ (చైనా)తో బొర్గోహైన్‌ రూపంలో కఠిన సవాల్‌ను ఎదుర్కోనుంది. ఈ బౌట్‌లో నెగ్గి సెమీస్‌ చేరితే లవ్లీనాకు రెండో ఒలింపిక్‌ పతకం ఖాయమవుతుంది. 54 కిలోల ప్రీక్వార్టర్స్‌లో ప్రీతి పవార్‌ 2-3తో యనీ మార్సెలా (కొలంబియా) చేతిలో పోరాడి ఓడింది.

ధోనీ స్ఫూర్తిగా..

షూటర్‌ స్వప్నిల్‌కు క్రికెటర్‌ ధోనీ అంటే ఎంతో అభిమానం. కెరీర్‌ ఆరంభంలో రైల్వే టీటీగా మహీ చేసిన తరహాలోనే ఇతడు కూడా టీటీగా పనిచేస్తున్నాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని కంబల్వాడి గ్రామానికి చెందిన 29 ఏళ్ల కుశాలె 2012 నుంచి అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొంటున్నాడు. కానీ, ఒలింపిక్స్‌ అవకాశం కోసం పన్నెండేళ్లపాటు ఎదురుచూశాడు. అయితే, ఆడుతున్న తొలి మెగా ఈవెంట్‌లోనే తనదైన ముద్ర వేశాడు. 50 మీ. రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో ఫైనల్‌ చేరిన తొలి భారత షూటర్‌గా నిలిచాడు. షూటర్‌గా ఎంతో ప్రశాతంగా, కూల్‌గా ఉండాలి. ఈ విషయంలో ధోనీ తనకు ఆదర్శమని చెప్పాడు. మహీ బయోపిక్‌ను ఎన్నోసార్లు చూశానన్నాడు.

శ్రీజ.. స్పెషల్‌ విన్‌

ఆకట్టుకొనే ప్రదర్శన చేస్తున్న తెలుగమ్మాయి శ్రీజ ప్రీక్వార్టర్స్‌కు చేరుకొంది. మహిళల సింగిల్స్‌ రౌండ్‌-32లో శ్రీజ 4-2తో జియాంగ్‌ జెన్‌ (సింగపూర్‌)పై గెలిచింది. తొలి గేమ్‌లో 9-11తో ఓడినా.. ఆ తర్వాత గొప్పగా పోరాడిన శ్రీజ.. తన 26వ పుట్టిన రోజును చిరస్మరణీయం చేసుకొంది. ప్రీ క్వార్టర్స్‌లో వరల్డ్‌ నెం:1 సన్‌ యింగ్‌షా (చైనా)తో శ్రీజ తలపడనుంది. కాగా, సింగిల్స్‌లో మనికా పోరాటం ముగిసింది. రౌండ్‌-16లో బాత్రా 1-4తో హినానో మ్లూ (జపాన్‌) చేతిలో ఓడింది.

పన్వర్‌కు ఆరో స్థానం

పతకం రౌండ్‌ నుంచి అవుటైన రోయర్‌ బల్‌రాజ్‌ పన్వర్‌.. సింగిల్స్‌ స్కల్స్‌లో ఆరోస్థానంతో ఫైనల్‌ ‘డి’కి చేరుకొన్నాడు. ఫైనల్‌ ‘డి’ అనేది 19-24 స్థానాల వర్గీకరణ ఈవెంట్‌.

ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న సీనియర్‌ ఆర్చర్‌ దీపిక కుమారి ప్రీక్వార్టర్స్‌కు చేరుకొంది. రెండో రౌండ్‌లో దీపిక 6-2తో క్వింటీ రోఫెన్‌ (నెదర్లాండ్స్‌)పై సునాయాసంగా నెగ్గి రౌండ్‌-16కు చేరుకొంది. శనివారం జరిగే ప్రీక్వార్టర్స్‌లో మిషెల్లీ క్రోపన్‌ (జర్మనీ)తో దీపిక తలపడనుంది. పురుషుల వ్యక్తిగత విభాగం తొలి రౌండ్‌లోనే తరుణ్‌దీప్‌ రాయ్‌ వెనుదిరిగాడు. రౌండ్‌-64లో రాయ్‌ 4-6తో టామ్‌ హాల్‌ (బ్రిటన్‌) చేతిలో ఓడాడు.

అనూష్‌ అవుట్‌..

ఈక్వెస్ట్రియన్‌లో బరిలోకి దిగిన తొలి భారత రైడర్‌ అనూష్‌ అగర్వాల ఫైనల్‌కు చేరుకోలేక పోయాడు. ఆసియాడ్‌ పతక విజేత అనూష్‌.. డ్రెస్సేజ్‌ ఈవెంట్‌ గ్రూప్‌-ఈ క్వాలిఫయర్స్‌లో 66.444 స్కోరు మాత్రమే చేసి తొమ్మిదో స్థానంలో నిలిచి పతక రౌండ్‌కు అర్హత సాధించలేక పోయాడు. అయితే, ఒలింపిక్స్‌ డ్రెస్సేజ్‌ ఈవెంట్‌లో బరిలోకి దిగిన మొదటి భారత ఈక్వెస్ట్రియన్‌గా మాత్రం అనూష్‌ రికార్డులకెక్కాడు.

Updated Date - Aug 01 , 2024 | 01:52 AM