‘ఫైనల్’ అడుగు ఎవరిదో?
ABN , Publish Date - May 21 , 2024 | 01:29 AM
ఊహకందని అంచనాలతో రసవత్తరంగా సాగిన ఐపీఎల్-17వ సీజన్ లీగ్ దశ ముగిసింది. ఇక మంగళవారం నుంచి ప్లేఆఫ్స్ పోరుకు తెర లేవనుంది. గతేడాది టాప్-4లో నిలిచిన...
క్వాలిఫయర్-1లో కోల్‌కతా X సన్‌రైజర్స్ అమీతుమీ
నేడు రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో
గెలిచిన జట్టు తుది పోరుకు
అహ్మదాబాద్: ఊహకందని అంచనాలతో రసవత్తరంగా సాగిన ఐపీఎల్-17వ సీజన్ లీగ్ దశ ముగిసింది. ఇక మంగళవారం నుంచి ప్లేఆఫ్స్ పోరుకు తెర లేవనుంది. గతేడాది టాప్-4లో నిలిచిన చెన్నై, గుజరాత్, ముంబై, లఖ్‌నవూలో ఒక్క జట్టు కూడా ఈసారి అర్హత సాధించకపోవడం గమనార్హం. ఈసారి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. గెలిచిన జట్టుకు నేరుగా ఫైనల్‌కు వెళ్లే గోల్డెన్ చాన్స్ ఉండడంతో ఇరు జట్ల అభిమానులు హోరాహోరీ పోరును ఆశిస్తున్నారు. ఓడిన జట్టు క్వాలిఫయర్-2లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. కోల్‌కతా చివరి రెండు మ్యాచ్‌లు వర్షార్పణం కావడంతో వారికి సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. అటు రైజర్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై ఘనవిజయం సాధించి జోష్‌లో ఉంది. తాజా సీజన్‌లో ఈ రెండింటి మధ్య ఈడెన్‌లో ఓ మ్యాచ్ జరగ్గా కేకేఆర్ నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. ఓవరాల్‌గా ఈ రెండు జట్ల మధ్య 26 మ్యాచ్‌లు జరగ్గా.. కేకేఆర్ 17, రైజర్స్ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
వీరబాదుడే లక్ష్యంగా..
గతేడాది పట్టికలో అట్టడుగున నిలిచిన రైజర్స్.. ఈ సీజన్‌లో ఊహకందని రీతిలో చెలరేగుతోంది. ఆ జట్టు ఫ్యాన్స్ కూడా ఇలాంటి భీకర ఫామ్‌ను అంచనా వేయలేకపోయారు. ఇప్పటికే అత్యధిక స్కోరు రికార్డును అధిగమించిన ఈ జట్టు ఈ మ్యాచ్‌లోనూ బౌలర్లపై విరుచుకుపడాలని భావిస్తోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (533 రన్స్), అభిషేక్ శర్మ (467) పోటాపోటీ బౌండరీలతో పవర్‌ప్లేలోనే జట్టు స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళుతోంది. ఈ ఇద్దరూ 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో ఆడుతుండడంతో బౌలర్ల దిమ్మ తిరిగిపోతోంది. హెడ్ బాదుడును ప్రేరణగా తీసుకుంటూ అభిషేక్ హిట్టింగ్‌కు దిగుతుండడంతో రైజర్స్ పరుగుల వరద పారిస్తోంది. గత ఆరు సీజన్లలో 31 సిక్సర్లు బాదిన శర్మ ఈ సీజన్‌లోనే 41 సిక్సర్లతో అదరగొట్టాడు. అయితే మిడిలార్డర్‌లో నితీశ్, క్లాసెన్ మాత్రమే రాణిస్తున్నారు. అలాగే వన్‌డౌన్‌లో రాహుల్ త్రిపాఠినే కొనసాగించవచ్చు. సమద్, షాబాజ్ ఆఖర్లో వేగం కనబర్చుతున్నారు. బౌలింగ్‌లో స్పిన్ బలహీనంగా కనిపిస్తున్నా కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్, ఉనాద్కట్‌లతో పేస్ దళం మాత్రం పటిష్టంగా ఉంది.
సాల్ట్ లేకుండానే..
లీగ్ మ్యాచ్‌ల్లో కోల్‌కతా మెరుపు ఆరంభాలకు ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ది ప్రధాన పాత్ర. కానీ పాక్‌తో టీ20 సిరీస్ కోసం అతడు ఇంగ్లండ్‌కు వెళ్లడంతో కేకేఆర్‌కు కీలక సమయంలో ఎదురుదెబ్బ తగిలింది. మరో ఓపెనర్ నరైన్ (461 రన్స్), సాల్ట్ (435) జట్టులో ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్లు. అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు రహ్మనుల్లా గుర్బాజ్‌ను పరీక్షిద్దామనుకున్నా రాజస్థాన్‌తో మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో నరైన్ బాదుడుపై భారీ స్కోరు ఆధారపడి ఉంది. వన్‌డౌన్‌లో రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్‌లను సందర్భాన్ని బట్టి ఆడిస్తున్నారు. మిడిలార్డర్‌లో కెప్టెన్ శ్రేయాస్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయితే నితీశ్ రాణా బరిలోకి దిగిన ఒక్క మ్యాచ్‌లో వేగంగా ఆడాడు. ఇక ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్ హిట్టింగ్ డెత్ ఓవర్లలో కీలకం కానుంది. బౌలింగ్‌లో నరైన్, వరుణ్ చక్రవర్తిల రూపంలో స్పిన్ బలంగా కనిపిస్తుండగా, పేస్‌లో మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా ఇబ్బందిపెట్టాలనుకుంటున్నారు.
తుది జట్లు (అంచనా)
కోల్‌కతా: గుర్బాజ్, నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా, రస్సెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
సన్‌రైజర్స్: హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్, క్లాసెన్, షాబాజ్, సమద్, సన్వీర్ సింగ్, కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్, నటరాజన్.
పిచ్, వాతావరణం
చక్కటి పేస్, బౌన్స్‌తో ఇక్కడి వికెట్ బ్యాటింగ్, పేసర్లకు అనుకూలించనుంది. భారీ స్కోర్లకు అవకాశం ఉండదు. గత 12 ఇన్నింగ్స్‌లో రెండుసార్లు మాత్రమే 200+ స్కోర్లు నమోదయ్యాయి. అలాగే చివరి ఐదు మ్యాచ్‌ల్లో ఛేజింగ్ జట్లే గెలిచాయి. కాబట్టి టాస్ నెగ్గిన టీమ్ ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపవచ్చు.