Share News

కోహ్లీ ఇక్కడైనా కొడతాడా?

ABN , Publish Date - Jun 20 , 2024 | 01:56 AM

టీ20 వరల్డ్‌కప్‌ గ్రూప్‌ దశలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నా.. ఎలాగొలా గట్టెక్కిన భారత జట్టుకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. సూపర్‌-8లో భాగంగా గ్రూప్‌-1లో గురువారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన...

కోహ్లీ ఇక్కడైనా కొడతాడా?

ప్రపంచకప్‌లో నేటి మ్యాచ్‌లు

ఇంగ్లండ్‌ X వెస్టిండీస్‌ (ఉ.6. గం.)

భారత్‌ X అఫ్ఘానిస్థాన్‌ (రా.8. గం.)

రాత్రి 8 గం.నుంచి హాట్‌స్టార్‌, స్టార్‌ నెట్‌వర్క్‌లో..

  • టీమిండియా కూర్పుపై సస్పెన్స్‌

  • సూపర్‌-8లో అఫ్ఘాన్‌తో భారత్‌ ఢీ నేడు

బ్రిడ్జ్‌టౌన్‌ (బార్బడోస్‌): టీ20 వరల్డ్‌కప్‌ గ్రూప్‌ దశలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నా.. ఎలాగొలా గట్టెక్కిన భారత జట్టుకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. సూపర్‌-8లో భాగంగా గ్రూప్‌-1లో గురువారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబరుస్తున్న అఫ్ఘానిస్థాన్‌.. టైటిల్‌ ఫేవరెట్‌ టీమిండియాకు సవాల్‌ విసిరే అవకాశం ఉంది. వేదికలు అమెరికా నుంచి వెస్టిండీ్‌సకు మారడంతో.. కీలక మ్యాచ్‌లో భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్నీ నెగ్గిన జట్టులో ఎటువంటి మార్పులూ చేయడానికి రోహిత్‌ ఇష్టపడడం లేదని సమాచారం. నలుగురు ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, జడేజా, అక్షర్‌లకు తుది జట్టులో చోటు కల్పించాలనుకొంటున్నాడట. ఒకవేళ స్పిన్నర్‌ కుల్దీ్‌పను తీసుకోవాలంటే సిరాజ్‌ను బెంచ్‌కే పరిమితం చేయాలి.


విరాట్‌పైనే అందరి దృష్టీ..: కెన్సింగ్‌టన్‌ ఓవల్‌లో గాలులు వీస్తుండడంతో పవర్‌ప్లేలో పేసర్లు బంతిని స్వింగ్‌ చేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీపైనే అందరి దృష్టీ నెలకొననుంది. ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన విరాట్‌ వరల్డ్‌క్‌పలో మాత్రం ఇప్పటి వరకు డబుల్‌ డిజిట్‌ స్కోరు చేయలేక పోయాడు. న్యూయార్క్‌లో ఎదురుదాడి చేద్దామనుకున్న అతడి వ్యూహం పని చేయలేదు. కానీ, కరీబియన్‌ వికెట్లపై ఆడిన అనుభవంతో కోహ్లీ చెలరేగే అవకాశం ఉంది. డాషింగ్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ ఫామ్‌లో ఉండడం సానుకూలమే అయినా.. భారీ షాట్లు ఆడగల దూబే, పాండ్యా బ్యాట్లు ఝుళిపించాల్సి ఉంది. బౌలింగ్‌ విషయానికొస్తే అర్ష్‌దీప్‌ మ్యాచ్‌ మ్యాచ్‌కు మెరుగుపడుతుండగా.. బుమ్రా ప్రత్యర్థుల పనిబడుతున్నాడు. మందకొడి వికెట్‌ అయితే అక్షర్‌, జడేజా సత్తా చాటగలరు.

సంచలనం సృష్టించాలని..: మరోవైపు ప్రత్యర్థి అఫ్ఘాన్‌ ఫుల్‌జో్‌షలో ఉంది. ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో చిత్తయినా.. తొలి మూడు మ్యాచ్‌ల్లో బౌలర్లు ఆకట్టుకొనే ప్రదర్శన కనబరచారు. ఈసారి సెమీస్‌కు చేరాలనే పట్టుదలతో ఉన్నట్టు కెప్టెన్‌ రషీద్‌ చెప్పాడు. నవీనుల్‌, ఫజల్‌ బంతితో రాణిస్తుండగా.. గుర్బాజ్‌, జద్రాన్‌ బ్యాట్‌తో ఆదుకొంటున్నారు. న్యూజిలాండ్‌ లాంటి టీమ్‌ను ఓడించిన.. అఫ్ఘాన్‌ మరో సంచలనం సృష్టించాలనుకొంటోంది.


జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రిషభ్‌ పంత్‌, సూర్యకుమార్‌, దూబే, పాండ్యా, జడేజా, అక్షర్‌ పటేల్‌, బుమ్రా, అర్ష్‌దీప్‌, సిరాజ్‌/కుల్దీప్‌.

అఫ్ఘానిస్థాన్‌: గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, నజీబుల్లా జద్రాన్‌, నబీ, కరీం జనత్‌, రషీద్‌ ఖాన్‌ (కెప్టెన్‌), గుల్బదిన్‌ నైబ్‌, ఫజల్‌ ఫరూకీ, నవీనుల్‌, నూర్‌ అహ్మద్‌.

పిచ్‌: మందకొడి వికెట్‌ స్పిన్నర్లకు అనుకూలం. అయితే, ఇక్కడ వేగంగా బౌలింగ్‌ చేసిన బౌలర్లకు ఎక్కువ వికెట్లు దక్కాయి. కాగా, ఇదే పిచ్‌పై ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 201 పరుగులు సాధించింది. వర్షం కురిసే అవకాశం ఉన్నా.. మ్యాచ్‌కు ఆటంకం కలిగించదని భావిస్తున్నారు.

Updated Date - Jun 20 , 2024 | 01:56 AM