Share News

టాప్‌ లేపాల్సిందే..

ABN , Publish Date - Nov 10 , 2024 | 01:38 AM

నాలుగు టీ20ల సిరీ్‌సను ఘనంగా ఆరంభించిన టీమిండియా మరో విజయపై దృష్టి సారించింది. శాంసన్‌ మెరుపు శతకానికి తోడు స్పిన్నర్ల మాయతో జట్టు తొలి టీ20లో 61 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకుంది. తాజాగా ఆదివారం దక్షిణాఫ్రికాతో...

టాప్‌ లేపాల్సిందే..

రాత్రి 7.30 నుంచి స్పోర్ట్స్‌18,

జియో సినిమాలో

టాపార్డర్‌ ఫామ్‌పై ఆందోళన

ఓపెనర్‌ శాంసన్‌పై అధిక భారం

మరో విజయంపై భారత్‌ దృష్టి

నేడు దక్షిణాఫ్రికాతో రెండో టీ20

గెబెహా: నాలుగు టీ20ల సిరీ్‌సను ఘనంగా ఆరంభించిన టీమిండియా మరో విజయపై దృష్టి సారించింది. శాంసన్‌ మెరుపు శతకానికి తోడు స్పిన్నర్ల మాయతో జట్టు తొలి టీ20లో 61 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకుంది. తాజాగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనుకుంటోంది. అయితే గతేడాది ఇక్కడ జరిగిన ఏకైక టీ20లో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఓడింది. ఇక జట్టు బ్యాటింగ్‌ ఆశించిన మేర ఆకట్టుకోలేకపోతోంది. శాంసన్‌ మినహా మరే బ్యాటర్‌ కూడా డర్బన్‌లో ప్రభావం చూపలేదు. తను మాత్రమే అలవోకగా భారీ సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. ముఖ్యంగా టాపార్డర్‌లో నిలకడలేమిపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆందోళనగా ఉంది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక వరుసగా స్వల్ప స్కోర్లకే వెనుదిరుగుతున్నాడు. జింబాబ్వేపై శతకం తర్వాత వరుసగా ఏడు మ్యాచ్‌ల్లోనూ 20లోపే అవుటయ్యాడు.


ఈనేపథ్యంలో నేటి మ్యాచ్‌ అతడికి అత్యంత కీలకం కానుంది. తిలక్‌ వేగంగానే ఆడుతున్నా భారీ స్కోర్లుగా మలచాల్సిన అవసరం ఉంది. కెప్టెన్‌ సూర్యకుమార్‌, హార్దిక్‌ కూడా త్వరగానే పెవిలియన్‌కు చేరారు. కాగితంపై బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగానే కనిపిస్తున్నా 36 పరుగుల వ్యవధిలోనే చివరి ఆరు వికెట్లను కోల్పోవడం.. మిడిల్‌, లోయరార్డర్‌ ఆటతీరును చాటిచెప్పినట్టయ్యింది. అందుకే నేటి మ్యాచ్‌లో ఈ బలహీనతను అధిగమించాలనుకుంటోంది.


రాణిస్తున్న బౌలర్లు: బ్యాటర్ల ఫామ్‌ ఎలా ఉన్నా ఇక్కడి పిచ్‌లపై పెద్దగా అనుభవం లేని బౌలర్లు మాత్రం అదరగొట్టారు. కేవలం 141 పరుగులకే ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బంగ్లాదేశ్‌పై చూపిన ఫామ్‌ను ఇక్కడా కొనసాగించాడు. బిష్ణోయ్‌ కూడా మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. పేసర్లు అర్ష్‌దీప్‌, అవేశ్‌ ఆరంభ, ముగింపులో ఇబ్బందిపెడుతున్నారు. అందుకే పటిష్ట బౌలింగ్‌ లైన్‌పతో రెండో మ్యాచ్‌ను కూడా భారత్‌ తమ ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది.

ఒత్తిడిలో సఫారీ: తొలి టీ20 పరాభవంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా నిరాశలో మునిగింది. టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ తర్వాత భారత్‌ చేతిలో ఆ జట్టుకిది వరుసగా రెండో ఓటమి. అయితే ప్రధాన ఆటగాళ్లు డికాక్‌, పేసర్లు రబాడ, నోకియా స్పిన్నర్‌ షంసీ లేకపోవడం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపింది. విండీ్‌సతో సిరీస్‌ ఓటమి, ఐర్లాండ్‌తో సిరీస్‌ సమం తర్వాత భారత్‌తో మ్యాచ్‌లు ఆ జట్టుకు సవాల్‌గా మారాయి. మరోవైపు బ్యాటింగ్‌లో ఏ బ్యాటర్‌ కూడా 25 పరుగులు దాటలేకపోయాడు. రెండో టీ20లోనైనా సీనియర్‌ బ్యాటర్లు క్లాసెన్‌, మిల్లర్‌, కెప్టెన్‌ మార్‌క్రమ్‌ తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించాలనుకుంటున్నారు. ఇక బౌలర్లు కూడా శాంసన్‌ ధాటిని అడ్డుకోలేకపోయినా డెత్‌ ఓవర్లలో మాత్రం ప్రభావం చూపారు.


తుది జట్లు (అంచనా)

భారత్‌: అభిషేక్‌, శాంసన్‌, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), తిలక్‌, హార్దిక్‌, రింకూ సింగ్‌, అక్షర్‌, అర్ష్‌దీప్‌, బిష్ణోయ్‌, వరుణ్‌, అవేశ్‌.

దక్షిణాఫ్రికా: హెన్‌డ్రిక్స్‌, రికెల్టన్‌, మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), స్టబ్స్‌, క్లాసెన్‌, మిల్లర్‌, జాన్సెన్‌, కేశవ్‌, కొట్జీ, పీటర్‌, బార్ట్‌మన్‌.

పిచ్‌, వాతావరణం

ఇక్కడి సెయింట్‌ జార్జి పిచ్‌ కూడా మ్యాచ్‌ జరిగే కొద్దీ స్పిన్‌కు అనుకూలించనుంది. ఆరంభంలో మాత్రం బ్యాటర్లకు సహాయకంగా ఉండనుంది. అందుకే టాస్‌ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. సగటు స్కోరు 135 మాత్రమే. సాయంత్రం చిరు జల్లులకు ఆస్కారముంది.

Updated Date - Nov 10 , 2024 | 01:38 AM