Share News

చెర్వుగట్టుపై ఘనంగా లక్షపుష్పార్చన

ABN , Publish Date - Aug 05 , 2024 | 12:35 AM

మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రి లక్ష పుష్పార్చన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం చివరి రోజు, ఆదివారం పుష్యమీ నక్షత్రం ఉండటంతో స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

చెర్వుగట్టుపై ఘనంగా లక్షపుష్పార్చన
చెర్వుగట్టు రామలింగేశ్వరుడికి లక్షపుష్పార్చన చేస్తున్న అర్చకులు, వేడుకలో పాల్గొన్న భక్తులు

ఆషాఢ చివరి అమావాస్య, ఆదివారం కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు

నార్కట్‌పల్లి, ఆగస్టు 4: మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రి లక్ష పుష్పార్చన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం చివరి రోజు, ఆదివారం పుష్యమీ నక్షత్రం ఉండటంతో స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తొలుత ప్రధానాలయం నుంచి పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాలు, భక్తుల శివన్నామ స్మరణ నడుమ పల్లకీ సేవతో మహా మండపానికి చేర్చారు. అనంతరం ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, సహార్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ లక్ష పుష్పార్చన నిర్వహించారు. స్వామివారి చెంత పూజలందుకున్న పుష్పాలను స్వీకరించేందుకు భక్తులు పోటీపడ్డారు. బోనాలెత్తుకుని శివసత్తులు చేసిన సంప్రదాయ నృత్యాలు భక్తులను అలరించాయి. కార్యక్రమంలో ఈవో సిరికొండ నవీన్‌, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా చెర్వుగట్టు క్షేత్రానికి వచ్చిన భక్తులకు ఎల్లారెడ్డిగూడెం ఆర్చి వద్ద ఉన్న శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీ ఆర్యవైశ్య నిత్యాన్నదాన ట్రస్టు, వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో సత్రం చైర్మన్‌ రంగా శేఖర్‌, వైస్‌ చైర్మన్‌ మీలా సోమయ్య, ట్రస్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

గోపలాయపల్లి క్షేత్రంలో నేటి నుంచి మహాలింగార్చన: శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మండలంలోని గోపలాయపల్లి గుట్టపై కొలువైన వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఈనెల 5 నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఆలయ అనువంశిక ధర్మకర్త కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మాసంలో పార్థివ (పుట్ట మట్టితో చేసిన శివలింగానికి) లింగార్చన వేడుకను వేద పాఠశాల ప్రిన్సిపాల్‌ చేబియ్యం రాఘవశర్మ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రతీ రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సాయం త్రం 4 నుంచి రాత్రి 7గంటల వరకు పార్థివ లింగాభిషేకం ఉంటుందని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

దర్వేశీపురం ఎల్లమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

కనగల్‌: మండలంలోని దర్వేశీపురం రేణుకా ఎల్లమ్మ ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగింది. ఆషాఢమాసం, ఆదివారం అమవాస్య కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో కుంకుమ అభిషేక పూజల్లో పాల్గొని చీరసారె, ఒడిబియ్యం, బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. కోరికలు తీర్చాలని ముడుపులు కట్టారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.

Updated Date - Aug 05 , 2024 | 12:35 AM