గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
ABN , Publish Date - Aug 23 , 2024 | 12:29 AM
విధుల్లో ఉన్న పోలీసుహెడ్‌కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందిన సంఘటన కడ్తాల పోలీసుస్టేషన్‌లో చోటుచేసుకుంది.
విధుల్లో ఉండగా ఘటన
కడ్తాల్, ఆగస్టు 22: విధుల్లో ఉన్న పోలీసుహెడ్‌కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందిన సంఘటన కడ్తాల పోలీసుస్టేషన్‌లో చోటుచేసుకుంది. కడ్తాల సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల పీఎస్ హెడ్‌కానిస్టేబుల్ కల్యాణం మల్లయ్య(51) బుధవారం ఉదయం 9గంటలకు విధులకు హాజరయ్యాడు. రాత్రి 12:50 గంటలకు ఊపిరి ఆడడం లేదని తోటిసిబ్బంది తో తెలిపారు. కొద్ది సేపటికి ఛాతీలో నొప్పి అంటూ కుప్పకూలి పోయాడు. వెంటనే అధికారులు, సిబ్బంది ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుపోయి చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని డీఆర్‌డీఏ అపోలో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మల్లయ్య గుండెపోటుతో మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మల్లయ్య 2016 నుంచి కడ్తాల పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ప్రజల అభిమానం చూరగొన్నారు. ఆయనకు భార్య విజయరాణి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మల్లయ్య మృతికి శంషాబాద్ డీసీపీ రాజేశ్ సంతాపం తెలిపారు. బడంగ్‌పేటలోని ఆయన నివాసంలో మల్లయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వపరంగా కుటుంబాన్ని ఆదుకుంటామని డీసీపీ హామీ ఇచ్చారు. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సీఐ శివప్రసాద్, ఎస్‌ఐ వరప్రసాద్, ఏఎ్‌సఐలు నిరంజన్, ప్రసాద్‌జీ, సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.