Share News

తాగునీటి బకాయి వసూళ్లకు స్పెషల్‌ డ్రైవ్‌

ABN , Publish Date - Oct 16 , 2024 | 12:17 AM

వినియోగించుకున్న తాగునీటికి చార్జీలను చెల్లించడంతో వినియోగదారుల బాధ్యతా రాహిత్యం, చార్జీల వసూళ్లలో మునిసిపల్‌ సిబ్బంది ఏళ్ల తరబడిగా చూపిన అలసత్వంతో భువనగిరి మునిసిపాలిటీలో సుమారు రూ.5కోట్ల నీటి చార్జీల బకాయీలు పేరుకుపోయాయి.

తాగునీటి బకాయి వసూళ్లకు స్పెషల్‌ డ్రైవ్‌
బిల్లు చెల్లించనివారి నల్లా కనెక్షన్లు తొలగిస్తున్న మునిసిపల్‌ సిబ్బంది

వినియోగదారుల బాధ్యతా రాహిత్యం

వసూళ్లలో సిబ్బంది అలసత్వం

భువనగిరి మునిసిపాలిటీలో రూ.5కోట్ల నీటి చార్జీల బకాయిలు

భువనగిరి టౌన, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): వినియోగించుకున్న తాగునీటికి చార్జీలను చెల్లించడంతో వినియోగదారుల బాధ్యతా రాహిత్యం, చార్జీల వసూళ్లలో మునిసిపల్‌ సిబ్బంది ఏళ్ల తరబడిగా చూపిన అలసత్వంతో భువనగిరి మునిసిపాలిటీలో సుమారు రూ.5కోట్ల నీటి చార్జీల బకాయీలు పేరుకుపోయాయి. వాస్తవానికి నో ప్రాఫిట్‌, నో లాస్‌ విధానంలో నీటి సరఫరా విభాగం పని చేయాల్సి ఉంటుంది. కానీ వినియోగదారులు, సిబ్బంది వైఖరితో భువనగిరి మునిసిపల్‌ నీటి సరఫరా విభాగం అస్తవ్యస్తంగా మారుతోంది. అంతే కాక హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ (హెచఎండబ్ల్యూఎ్‌స)కు భువనగిరి మునిసిపాలిటీ నెలవారీగా చెల్లించాల్సిన చార్జీలు రూ.3 కోట్ల బకాయిలుగా పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో నీటి చార్జీల వసూళ్లకు అధికారులు స్పెష ల్‌ డ్రైవ్‌ చేపట్టారు. ‘బకాయి చార్జీలను చెల్లించండి.. లేదా నల్లా కనెక్షన తొలగిస్తాం’ అం టూ మునిసిపల్‌ సిబ్బంది బకాయి దారులను సూచిస్తున్నారు. దీంతో పలువురు పెండింగ్‌ చార్జీలను చెల్లిస్తుండగా ముఖం చాటేస్తున్న మరికొద్ది మంది వినియోగదారుల నల్లా కనెక్షన్లను సిబ్బం ది తొలగిస్తున్నారు.

రూ.5కోట్ల నీటి చార్జీల బకాయిలు

భువనగిరి మునిసిపల్‌ పరిధిలో అసిస్మెంట్‌ జరిగిన భవనాలు, సుమారు 15,100 ఉన్నాయి. వీటికి సుమారు 9200 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. గృహ వినియోగ నల్లాలకు నెలసరిగా రూ.100, వాణజ్య నల్లాలకు రూ.250, స్పెషల్‌ కేటగిరి నల్లాకు రూ.500 నుంచి రూ.1000 వరకు చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. రోజువారీగా హెచఎండబ్య్లూఎ్‌స సరఫరా చేసే 5.5 ఎంఎల్‌డీ గోదావరి జలాలు, స్థానిక వనరుల ద్వారా మరో 5 ఎంఎల్‌డీ అనగా ప్రతీ రోజు నల్లాల ద్వారా సుమారు 10.5 ఎంఎల్‌డీ తాగునీటిని మునిసిపాలిటీ సరఫరా చేస్తోంది. హెచఎండబ్య్లూఎ్‌స సరఫరా చేసే గోదావరి జలాలకు భువనగిరి మునిసిపాలిటీ నెలవారీగా సుమారు రూ.16లక్షలు చార్జీల రూపకంలో చెల్లిస్తోంది. సుమారుగా అం తే మొత్తంలో నెలవారీగా నీటి చార్జీల డిమాండ్‌ ఉంటోంది. అంతేకాక పవర్‌ బోర్లు ఇతర వనరు ల ద్వారా సరఫరా చేసే స్థానిక జలాలకు విద్యుత బిల్లులను చెల్లించాల్సి ఉంటోంది. కానీ ఏళ్ల తరబడిగా నీటి చార్జీలను చెల్లించడంలో వినియోగదారులు, వసూలు చేయడంలో సిబ్బంది చూపిన నిర్లక్ష్యం ఫలితంగా ఏరియర్స్‌ చార్జీలుగా సుమారు రూ.3.50కోట్లు, విద్యుత డిమాండ్‌ చార్జీలు సుమారు రూ.1.60 కోట్లు వసూలు కావాల్సి ఉంది. బిల్లులు సకాలంలో వసూలు కాకపోతుండడంతో హెచఎండబ్ల్యూఎ్‌సకు సుమారు రూ.3కోట్లు, ట్రాన్సకోకు విద్యుత బిల్లులు సుమారు రూ.1.20కోట్లు భువనగిరి మునిసిపాలిటీ బకాయిలుగా చెల్లించాల్సి ఉంది. ఆస్తిపన్ను చెల్లింపు, వసూళ్లలో చూపే శ్రద్ధ నీటి చార్జీలలోనూ చూపి ఉంటే ఇంత భారీగా బకాయీలు పేరుకపోయి ఉండేవి కావని పలువురు అంటున్నారు. అయితే పలు గృహాలు శిథిలమై ఎవరూ నివాసం ఉండనప్పటికీ ఆ ఇళ్లలో నల్లా కనెక్షన్లు ఉన్నట్లు రికార్డులు పేర్కొంటున్నాయి. దీంతో నీటి చార్జీల బకాయీలు భారీగా పేరుకుపోయినట్లు రికార్డుల్లో నమోదు అవుతున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. శిథిల గృహాల నల్లాలను తొలగిస్తే బకాయిలు తగ్గుతాయని అంటున్నారు.

ఫలితాలిస్తున్న ప్రత్యేక కార్యక్రమం

బకాయి నీటి చార్జీల వసూళ్ల కోసం చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ సత్ఫలితాలను ఇస్తున్నట్లు తెలుస్తున్నది. స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టినప్పటి నుంచి సుమారు రూ.50లక్షల పైబడి వసూళ్లు అయ్యాయి. అలాగే చార్జీలు చెల్లించని పలు నల్లా కనెక్షన్లను సిబ్బంది తొలగిస్తున్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ కోసం అధికారులు ప్రత్యేక బృందాలను నియమించారు. ఆయా బృందాలు నిర్ధేశిత గృహాలకు వెళ్తూ పెండింగ్‌ చార్జీల చెల్లింపుపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ వసూళ్లు చేస్తున్నారు. ముఖం చాటేస్తున్న వినియోగదారుల నల్లా కనెక్షన్లను తొలగిస్తున్నారు. అదే సమయంలో శిఽథిల భవనాల నల్లా కనెక్షన్లను కూడా గుర్తిస్తున్నారు.

పట్టణాభివృద్ధికి సహకరించాలి

వినియోగదారులు నీటి చార్జీలు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. ఆనలైనలో లేదా ఆఫ్‌లైనలో చార్జీలను చెల్లించే అవకాశం వినియోగదారులకు కల్పించాం. బకాయి నీటి చార్జీలు చెల్లించకపోతే మునిసిపల్‌ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. శిఽథిల భవనాల నల్లా కనెక్షన్ల తొలగింపుపై ఉన్నతాధికారులు, మునిసిపల్‌ కౌన్సిల్‌ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం.

-పి.రామాంజల్‌రెడ్డి, కమిషనర్‌, భువనగిరి మునిసిపాలిటీ

Updated Date - Oct 16 , 2024 | 12:17 AM