Teachers Transfer: 25 వేల మంది టీచర్ల బదిలీ!
ABN , Publish Date - Jul 02 , 2024 | 04:39 AM
తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా 25 వేల మంది ఎస్జీటీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆదేశాలు జారీ అయ్యాయి. బదిలీ అయిన వారిలో చాలా మంది సోమవారమే కొత్త బడుల్లో చేరిపోయారు. రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఈ జిల్లాలో రెండు మూడు రోజుల్లో దీనిని పూర్తి చేయనున్నారు.
వీరిలో కొందరు ఇంకొన్నాళ్ల పాటు పాతచోటనే!
విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న దగ్గర ఈ పరిస్థితి
10 వేల మంది వరకు ఇలాంటి ఉపాధ్యాయులు!
రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో బదిలీలు పూర్తి
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా 25 వేల మంది ఎస్జీటీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆదేశాలు జారీ అయ్యాయి. బదిలీ అయిన వారిలో చాలా మంది సోమవారమే కొత్త బడుల్లో చేరిపోయారు. రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఈ జిల్లాలో రెండు మూడు రోజుల్లో దీనిని పూర్తి చేయనున్నారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో భాగంగా ఇప్పటికే పదోన్నతులను పూర్తి చేశారు. స్కూల్ అసిస్టెంట్ల (ఎస్‌ఏ) బదిలీలను కూడా ముగించారు. కాగా బదిలీ అయిన వారిలో కొందరు కొత్త స్కూల్‌లో జాయిన్ కావడానికి కొంత సమయం ఆగాల్సి ఉంటుంది. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ పోస్టులు ఉండాలనే ఉద్దేశంతో హేతుబద్ధీకరణ విధానాన్ని అమలు పరుస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న స్కూళ్లలో అక్కడ పనిచేస్తున్న టీచర్లు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు.
ఈ స్కూళ్లకు రావడానికి ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆప్షన్లను నమోదు చేసుకోకపోవడంతో బదిలీ అయిన ఉపాధ్యాయులే కొన్నాళ్లు అక్కడ పనిచేయాల్సి ఉంటుందని, అలాంటి ఉపాధ్యాయులను విడుదల చేయోద్దని విద్యా శాఖ అధికారులు జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా బదిలీ అయి, ప్రస్తుతం విడుదల కాని ఉపాధ్యాయుల సంఖ్య సుమారు 10 వేల వరకు ఉంటుందని అంచనా.
డీఎస్సీ ద్వారా కొత్త ఉపాధ్యాయులు వచ్చే వరకు, లేదా తాత్కాలిక సర్దుబాటులో భాగంగా డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయులు వచ్చే వరకు ప్రస్తుతం బదిలీ అయిన ఉపాధ్యాయులు పాత స్కూల్‌లోనే పనిచేయాల్సి ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలో సోమవారం స్కూల్ అసిస్టెంట్ బదిలీలను పూర్తి చేశారు. తర్వాత సీనియారిటీ జాబితాలను వెల్లడించి, పదోన్నతులను పూర్తి చేయనున్నారు. తర్వాత ఎస్జీటీలను బదిలీలను నిర్వహించనున్నారు.