తాగునీటి ట్యాంకులో.. 30 కోతుల కళేబరాలు
ABN , Publish Date - Apr 04 , 2024 | 05:46 AM
మనం తాగే నీటిలో చిన్న నలక కనిపిస్తే.. వెంటనే పారబోస్తాం. కాస్త తేడా అనిపిస్తే.. వాడే నీటిని తక్షణమే ఆపేస్తాం..! కానీ, వారు రోజుల తరబడి అదే నీటిని వినియోగించారు. చివరకు అనుమానంతో స్థానిక
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో ఘటన
నీరు తాగడానికెళ్లి ట్యాంకులో పడిన కోతులు
10 రోజులుగా 150 ఇళ్లకు ఆ నీరే సరఫరా
అందులో కోతుల వెంట్రుకలు, అవశేషాలు
కలుషిత నీరు చూసి యువకుల ఫిర్యాదు
మూడేళ్ల కిందట ఇక్కడే ఇదే తరహా సంఘటన
నాగార్జునసాగర్, ఏప్రిల్ 3: మనం తాగే నీటిలో చిన్న నలక కనిపిస్తే.. వెంటనే పారబోస్తాం. కాస్త తేడా అనిపిస్తే.. వాడే నీటిని తక్షణమే ఆపేస్తాం..! కానీ, వారు రోజుల తరబడి అదే నీటిని వినియోగించారు. చివరకు అనుమానంతో స్థానిక యువకులు పరిశీలన చేయగా విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ఎండల తాకిడితో.. దాహం తీర్చుకోవడానికి ఒకదాని వెంట ఒకటి మినీ ట్యాంకులోకి దిగిన కోతులు అందులోనే ప్రాణాలొదిలిన వైనం బయటపడింది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ మునిసిపాలిటీ పరిధి విజయవిహార్ కాలనీ 1వ వార్డు విజయ్ విహార్ పక్కన 5 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు ఉంది. దీని ద్వారా సుమారు 150 ఇళ్లకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే, పది రోజులుగా కుళాయి నీటిలో వెంట్రుకలు, చిన్న చిన్న మాంసపు ముక్కలు వస్తున్నాయి. బుధవారం కొంతమంది యువకులు ట్యాంకు వద్దకు వెళ్లి చూడగా పైన మూత తొలగించి ఉంది. లోపల 30 వరకు కోతుల కళేబరాలు తేలుతున్నాయి. దీనిపై మునిసిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కళేబరాలను తొలగించేందుకు మునిసిపల్ సిబ్బంది రాగా, ట్యాంకు వద్ద ఉన్న ఇంకొన్ని కోతులు దాడి చేసేందుకు ఎగబడ్డాయి. కొద్దిసేపటికి కోతులు వెళ్లిపోగా.. ట్యాంకులోని కళేబరాలను బయటకు తీశారు.
పైకి వచ్చే మార్గం లేక
నాగార్జునసాగర్ మునిసిపల్ పరిధి 12 వార్డుల్లో రెండు ఓవర్‌హెడ్ ట్యాంకులతో పాటు, 12 మినీ ట్యాంకులున్నాయి. మినీ ట్యాంకులపై ఐరన్ షీట్స్ ఉంటాయి. 1వ వార్డులోని మినీ ట్యాంకుపై రేకులు గాలికి ఎగిరిపోయాయి. 10 రోజుల క్రితం అటుగా వచ్చిన కోతులు అందులోని నీరు తాగేందుకు దిగి పైకి రాలేకపోయాయి. కాగా, మునిసిపల్ సిబ్బంది నిచ్చెన వేసుకుని ట్యాంకు లోపలకు దిగి కళేబరాలను బయటకు తీశారు. నీటిని ఖాళీ చేశారు. కాగా, ట్యాంకులను సాగర్ వాటర్ సప్లయ్ విభాగం సిబ్బంది నెల రోజులకు ఒకసారి బ్లీచింగ్‌తో శుభ్రం చేయించాల్సి ఉంది. కానీ, ఆరు నెలలకొకసారి కొద్దిపాటి పనులతో సరిపెడుతున్నారు. కాగా, విజయవిహార్ 5వ వార్డులోనే మూడేళ్ల కిందట ట్యాంకులో పడి 15 కోతులు చనిపోయాయి. అప్పట్లోనూ ఎవరినుంచి కూడా ఆరోగ్య ఫిర్యాదులు రాలేదు.
స్థానికుల భయాందోళన..
కలుషిత నీటిని 10 రోజుల నుంచి వాడామని తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సాగర్ ఏరియా ఆస్పత్రి సీఎంవో భానుప్రసాద్ వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. కలుషిత నీటి బాధితులు ఎవరూ ఆస్పత్రికి రాలేదని చెప్పారు. ఎవరైనా అస్వస్థతులైతే పూర్తిస్థాయిలో వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాగా, నందికొండ హిల్ కాలనీలో 2 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులు 2, వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక ట్యాంకు ఉన్నాయని సాగర్ ఎస్‌ఈ నాగేశ్వరరావు చెప్పారు. కోతులు చనిపోయిన ట్యాంకు వేరుగా ఉందన్నారు. 3 రోజులుగా దీన్నుంచి నీటి సరఫరా లేదని పేర్కొన్నారు. హిల్ కాలనీ ప్రధాన ఇళ్లకు తాగు నీరు సరఫరా చేసే ట్యాంకులకు, దీనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కోతులు చనిపోయిన ట్యాంక్‌ను పూర్తిగా శుభ్రం చేశాకనే నీటిని విడుదల చేస్తామన్నారు.