Share News

Ts News: 500 కోట్ల భూమి రాసిచ్చేశారు!

ABN , Publish Date - May 02 , 2024 | 05:29 AM

అందరూ అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఉన్నప్పుడు.. రూ.500 కోట్ల విలువ చేసే సర్కారీ భూమి చేతులు మారింది! అన్ని పత్రాలూ ఉన్నా పాస్‌పుస్తకాల కోసం ధరణిలో దరఖాస్తు చేసుకుంటే ఇవ్వడానికి నానా తంటాలూ పెట్టే అధికారులు..

Ts News: 500 కోట్ల భూమి రాసిచ్చేశారు!

గత సర్కారు హయాంలో భూదందా.. స్వాధీనం చేసుకున్న ప్రస్తుత ప్రభుత్వం

రంగారెడ్డి జిల్లా పొక్కల్‌ వాడలో ఐదెకరాల సర్కారీ భూమి.. రూ.36 లక్షలతో ప్రహరీగోడ సైతం నిర్మించిన అధికారులు

అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓ బడా రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కన్ను.. ఆ సంస్థకు నాటి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సాయం

పాస్‌ బుక్స్‌ కోసం ధరణిలో దరఖాస్తు.. వెంటనే ఆమోదం.. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు

స్థానిక తహసీల్దార్‌ నివేదిక మేరకు పాస్‌బుక్‌లు రద్దు చేసి, ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న కలెక్టర్‌ శశాంక

ఇద్దరిపై రాయదుర్గం పీఎస్‌లో క్రిమినల్‌ కేసు నమోదు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

అందరూ అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఉన్నప్పుడు.. రూ.500 కోట్ల విలువ చేసే సర్కారీ భూమి చేతులు మారింది! అన్ని పత్రాలూ ఉన్నా పాస్‌పుస్తకాల కోసం ధరణిలో దరఖాస్తు చేసుకుంటే ఇవ్వడానికి నానా తంటాలూ పెట్టే అధికారులు.. ఎలాంటి పత్రాలూ సమర్పించకున్నా.. ప్రభుత్వ పోరంబోకు భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ పాస్‌బుక్స్‌ జారీ చేసేశారు!! గత ప్రభుత్వ పెద్దలు, అధికారుల సాయంతో ఓ బడా రియల్‌ ఎస్టేట్‌ సంస్థ.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పొక్కల్‌వాడలో సాగించిన భూదందా ఇది. రాజధాని నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన మణికొండను ఆనుకుని ఉన్న ఈ భూమి చుట్టూ.. సర్కారు నిర్మించిన ప్రహరీగోడ అలా ఉండగానే అక్రమార్కులు దాన్ని చెరబట్టడం గమనార్హం. కానీ.. స్థానికులు ఈ వ్యవహారం గురించి కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో చెర వీడింది. అక్రమార్కులపై కేసు నమోదైంది. వారి పేరిట జారీ అయిన పాస్‌బుక్స్‌ను జిల్లా కలెక్టర్‌ శశాంక రద్దు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గండిపేట మండలం పొక్కల్‌వాడ గ్రామంలోని సర్వేనంబరు 4లో 62-06 ఎకరాల ప్రభుత్వ భూమి ( 1954-55 నుంచి ఖాస్రా పహాణీ ప్రకారం) ఉంది. ఇందులో 51-06 ఎకరాల భూమిని ప్రభుత్వం 1986లో హుడాకు కేటాయించింది. మరో ఆరెకరాల భూమిని హౌసింగ్‌ బోర్డుకు ఇచ్చింది. హౌసింగ్‌బోర్డు తాను తీసుకున్న భూమిలో ఒక ఎకరంలో బలహీనవర్గాలకు ఇళ్లు నిర్మించింది. మిగతా అయిదెకరాల భూమి ఖాళీగానే ఉంది. అది సర్కారీ పోరంబోకు భూమిగా రికార్డుల్లో నమోదవుతూ వస్తోంది. కొన్నాళ్లకు ఈ భూమిపై కొందరు కన్ను వేయడంతో.. ఆక్రమణకు గురికాకుండా దానిచుట్టూ ప్రహరీ గోడ నిర్మించడానికి 2012లో అధికారులు నాటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఎట్టకేలకు సర్కారు అనుమతి రావడంతో 2015లో రూ.36 లక్షలు ఖర్చుపెట్టి రక్షణ గోడ నిర్మించారు. అదే సమయంలో.. పూస లక్ష్మయ్య అనే వ్యక్తి ఆ భూమికి హక్కుదారుగా చెప్పుకొంటూ.. ఓఆర్సీ ( ఆక్యుపెన్సీ రైట్స్‌ సర్టిఫికెట్‌) కోసం రాజేంద్రనగర్‌ ఆర్డీవో వద్ద పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ జరిపిన ఆర్డీవో.. అది పూర్తిగా ప్రభుత్వ భూమి అని తేల్చిచెప్పి ఆ పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో ఆయన జిల్లా కోర్టులో వేరువేరుగా రెండు పిటిషన్లు వేశారు. ఆ భూమికి హక్కుదారులమని తమకు ఓఆర్సీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కానీ రెండు కేసుల్లోనూ ప్రభుత్వానికే అనుకూలంగా ఉత్తర్వులు రావడంతో.. 2016లో ఆయన మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు వచ్చింది.


ఎన్నికల సమయంలో..

ఖరీదైన ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఈ భూమిపై కన్నేసిన ఓ బడా రియల్‌ ఎస్టేట్‌ సంస్థ.. అందరూ 2023 అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో రంగంలోకి దిగింది. ఈ భూమిపై గతంలో కేసులు వేసి ఓడిపోయిన పూస లక్ష్మయ్య కుమారులు పూస రవీందర్‌, పూస ప్రహ్లాద్‌తో కలిసి నాటకానికి తెరలేపింది. అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సహకారంతో ఈ అయిదెకరాల పాస్‌బుక్‌ కోసం పావులు కదిపింది. ఆ ప్లాన్‌లో భాగంగా పూస రవీందర్‌, పూస ప్రహ్లాద్‌ గత నవంబర్‌లో పాస్‌బుక్‌ల కోసం ధరణిలో దరఖాస్తు చేశారు. ఎలాంటి పత్రాలూ, రెవెన్యూ అధికారుల సిఫారసులు లేకున్నా.. వారి దరఖాస్తులను ఆమోదించిన అధికారులు.. ఇద్దరి పేర్లపై చకచకా పాస్‌బుక్‌లు జారీచేసేశారు. పూస రవీందర్‌ పేరు మీద సర్వే నంబరు 4/2లోని 2-20 ఎకరాలకు (టీ05070110003) ఒక పాస్‌బుక్‌.. పూస ప్లహాద్‌ పేరు మీద సర్వేనంబరు 4/12లోని మరో 2-20 ఎకరాల భూమికి (టీ05070110004) ఒక పాస్‌బుక్‌ జారీ చేశారు. వెంటనే వారు భూమిని ఆధీనంలోకి తీసుకుని అందులో షెడ్లు వేసి కొందరిని కాపాలాపెట్టారు.


స్పందించిన రెవెన్యూ...

ఈ దందాను గమనించిన స్థానికులు.. ప్రభుత్వం మారిన వెంటనే కలెక్టర్‌ శశాంకకు సమాచారం అందించారు. దీంతో ఆయన ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని గండిపేట తహశీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. విచారణలో భాగంగా ఆయన.. ‘‘ఈ భూమి మీదే అనడానికి ఏవైనా ఆధారాలున్నాయా?’ అని ప్రశ్నిస్తూ పూస రవీందర్‌, ప్రహ్లాద్‌కు నోటీసులు ఇచ్చారు.

వాళ్లు ఒక్క ఆధారం కూడా చూపించకపోవడంతో.. పాస్‌బుక్‌ల జారీలో అవకతవకలు జరిగాయని, ఈ వ్యవహారమంతా మోసపూరితంగా జరిగిందని నివేదిక ఇచ్చారు. గతంలో కోర్టుల్లో కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పులు వచ్చాయని తెలిపారు. దీంతో కలెక్టర్‌ ఈ భూమిని ఈ ఏడాది జనవరి 21న తిరిగి 22ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టారు. జీవో 1122 కింద.. ఆ భూములను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ రైట్స్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్‌యాక్ట్‌ 2020లోని సెక్షన్‌ 8 కింద పాస్‌బుక్‌లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గండిపేట తహసీల్దార్‌ బుధవారం తన సిబ్బందితో వెళ్లి.. అక్కడ పాగా వేసిన ప్రైవేటు వ్యక్తులను బయటకు పంపించి, షెడ్డు కూల్చివేసి భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అది ప్రభుత్వ భూమి అని.. ఆక్రమించినవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ప్రహరీగోడపై హెచ్చరిక రాయించారు. అలాగే.. టైటిల్‌ లేకుండా ప్రభుత్వ భూమికి అక్రమంగా పాస్‌బుక్‌లు పొందినందుకు ఏప్రిల్‌ 6న రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు పెట్టారు.

Updated Date - May 02 , 2024 | 07:13 AM