కొత్త విద్యుత్తు విధానం
ABN , Publish Date - Jan 11 , 2024 | 04:18 AM
రాష్ట్రంలో ఇప్పటిదాకా సరైన విద్యుత్తు పాలసీని రూపొందించకపోవడంతో పలురకాల ఇబ్బందులు, సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు.
నిపుణుల సలహాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరించి, రూపొందిస్తాం
ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్తు విధానాలను
అధ్యయనం చేసి మెరుగైన పాలసీ తీసుకొస్తాం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన
కరెంట్ కొనుగోళ్ల ఒప్పందాలన్నీ వెలికి తీయండి
రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి తీరాల్సిందే
గృహావసరాలకూ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు
సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోండి
తక్కువ ధరకు దొరికే చోటనే విద్యుత్తు కొనండి
అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశం
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇప్పటిదాకా సరైన విద్యుత్తు పాలసీని రూపొందించకపోవడంతో పలురకాల ఇబ్బందులు, సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. వీటిని నివారించేందుకు సరికొత్త విద్యుత్తు పాలసీని తీసుకొస్తామని ప్రకటించారు. విద్యుత్తు రంగ నిపుణుల సలహాలు తీసుకోవడంతోపాటు వివిధ రాష్ట్రాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి కొత్త విద్యుత్తు విధానాన్ని రూపొందిస్తామన్నారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యుత్తు విధానాలను అధ్యయనం చేయాలని, మెరుగైన విధానం ఏ రాష్ట్రంలో ఉందో తెలుసుకొని నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబుతో కలిసి విద్యుత్తు శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి తీరాలని స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా విద్యుత్తు ఉత్పత్తినిపెంచడానికి, మరిన్ని విద్యుత్తు సంస్థలను ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అన్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సంస్థల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. దీంతోపాటు విద్యుత్తు దుర్వినియోగాన్ని అరికట్టాలని, నాణ్యతను పెంచాలని సూచించారు. నిరంతర విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అవాంతరాలు రాకుం డా ముందస్తు చర్యలు పకడ్బందీగా చేపట్టాలన్నారు.
కరెంటు కొనుగోళ్ల లెక్కలు తేల్చండి..
తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014 నుంచి ఇప్పటిదాకా డిస్కమ్‌లకు, విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు మధ్య జరిగిన ఒప్పందాలు, వాటిలోని అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అధిక ధరకు కరెంట్ కొనుగోళ్ల వల్ల విద్యుత్తు సంస్థలకు కలిగిన నష్టాలను వెలికితీయాలన్నారు. ఛత్తీ్‌సగఢ్‌తోపాటు పవర్‌గ్రిడ్‌తో జరిగిన ఒప్పందాలు, స్వల్ప, మధ్యకాలిక కరెంట్ కొనుగోళ్లతో జరిగిన నష్టం, ఒక్కో యూనిట్‌ను ఎంత ధరకు కొన్నారు? అప్పట్లో మార్కెట్‌లో ఎంత ధరకు కరెంట్ అందుబాటులో ఉంది? వంటి వివరాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. కాగా, రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి, వివిధ విద్యుత్తు కంపెనీల నుంచి కరెంటు కొనుగోళ్లు, విద్యుత్తు వినియోగం, డిస్కమ్‌ల పనితీరు, ఆర్థిక పరిస్థితిని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. గృహజ్యోతి పథకం కింద గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తే ఏటా రూ.4 వేల కోట్ల దాకా భారం పడుతుందని నివేదించారు. దీంతో వివిధ రాష్ట్రాల్లో గృహ వినియోగదారులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడానికి అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. అధ్యయనం అనంతరం పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బహిరంగ మార్కెట్లో ఎక్కడ తక్కువ ధరకు విద్యుత్తు లభిస్తుందో, ఆ కంపెనీల నుంచే కొనుగోలు చేయాలని నిర్దేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి, జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ఎస్‌ఏఎం రిజ్వీ, సీఎం ముఖ్యకార్యదర్శి శేషాద్రి, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, దక్షిణ డిస్కమ్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ , సీఎం ఓఎస్డీ అజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరంపై సమీక్ష వాయిదా..
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు వివిధ ప్రాజెక్టులపై బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించ తలపెట్టిన సమీక్ష గురువారానికి వాయిదా పడింది. సమీక్ష కోసం అధికారులు సచివాలయానికి రాగా.. విద్యుత్తు రంగంపై సీఎం సుదీర్ఘ చర్చలో ఉండిపోయారు. దీంతో కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులపై సమీక్ష గురువారం ఉంటుందని అధికారులకు సీఎం కార్యాలయం సమాచారం ఇచ్చింది.